Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి.. పలు వాహనాలకు నిప్పు.!.
High tension in Tadipatri: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పదుల సంఖ్యలో వాహనాలకు టీడీపీ వర్గీయులు నిప్పంటించారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది.
High tension at tadipatri amid gram panchayat elections row: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇప్పటికే ఏపీ పంచాయతీ ఎన్నికల్ని అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కడప జిల్లాలోని పులివెందులలో ఎంపీ అవినాష్ కాన్వాయ్ పై ప్రత్యర్థి వర్గం పెట్రోల్ బాంబుతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పులివెందులలో సైతం ఉద్రిక్తత కొనసాగుతుంది.
మరోవైపు తాడిపత్రి రాజకీయాలు సైతం కాకరేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య కొన్ని రోజుల నుంచిసవాళ్ల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంలోకి టీడీపీ వర్గీయులు దూసుకుని వెళ్లి పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఆయన గ్రౌండ్ ఫ్లోర్ లో జనరేటర్ కు నిప్పంటించి నానా బీభత్సం చేశారు. దాదాపు పదుల సంఖ్యలో కార్లు, బైక్ లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. సజ్జలదిన్నె, ఇగుడూరు గ్రామాల్లో వాహనాలను తగలబెట్టారు.
అయితే.. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల్ని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే తాడిపత్రిలో అరాచకాలు జరుగుతున్నాయని వైసీపీ విమర్శలు చేస్తుంది. టీడీపీ వారు దాడులు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడుల్లో పెద్దారెడ్డి నివాసంలో ఉన్న 6 కార్లు, 30కి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు వైసీపీ ఆరోపిస్తుంది. ఈ ఘటనతో తాడిపత్రి ప్రస్తుతం నివురు కప్పిన నిప్పులా ఉంది. మరోవైపుకేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసుల్ని అల్లర్లు జరిగిన ప్రదేశంకు వెళ్లకుండా అడ్డుకున్నారు.