SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Madanapalle Handloom Weavers: మదనపల్లి మగ్గానికి ఏదీ గుర్తింపు..? నేతన్నల ఆవేదన..!

Madanapalle Handloom Weavers: మదనపల్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది టమోటా మార్కెట్! కానీ.. ఆ పేరు వెనుక మరో ఘనమైన చరిత్ర ఉంది. అదే...మదనపల్లి మగ్గం సవ్వడి! నీరుగట్టువారిపల్లెలో దశాబ్దాలుగా మగ్గాలు మొగుతూనే ఉన్నాయి. తరతరాలుగా ఈ చేనేతనే నమ్ముకుని వందలాది కుటుంబాలు బతుకుతున్నాయి. ఇక్కడ తయారయ్యే సిల్క్ చీరలు దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్! కానీ...మదనపల్లి చేనేతకు మాత్రం రావాల్సిన "బ్రాండ్ నేమ్" రాలేదు. ఇంతకీ మదనపల్లి మగ్గం వెనుక ఉన్న అసలు కథేంటి? నేతన్నల ప్రధాన డిమాండ్లేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్.

Written By Ashok Krindinti
Published: Sep 28, 2026, 01:43 PM IST | Updated: Sep 28, 2026, 01:46 PM IST
Image Credit: Madanapalle Handloom Weavers
Join

Madanapalle Handloom Weavers: మదనపల్లి టమోటాకు ఎంత క్రేజ్ ఉందో... ఇక్కడి చేనేత మగ్గానికి కూడా అంతే గొప్ప చరిత్ర ఉంది! నీరుగట్టువారిపల్లెలో ప్రతీ ఇల్లూ ఒక చేనేత పరిశ్రమే. ఇళ్లలోనే మగ్గాలు ఏర్పాటు చేసుకుని...చీరలు నేస్తారు. నూలు సిద్ధం చేయడం దగ్గర్నుంచి... రంగులద్దడం, మగ్గంపై డిజైన్ అల్లడం వరకు ప్రతీ దాంట్లోనూ నేతన్నల చెమట ఉంటింది. ఒక్క చీర బయటపడాలంటే గంటల తరబడి మగ్గం ముందు కూర్చోవాల్సిందే! కానీ, రోజురోజుకూ పెరిగిపోతున్న ముడిసరుకుల ధరలు, యంత్రాల పోటీతో సంప్రదాయ మగ్గాన్ని నడపడం నేతన్నలకు కత్తిమీద సాములా మారింది.

మదనపల్లిలో తయారయ్యే సిల్క్ చీరల డిజైన్లకు, నాణ్యతకు బయట విపరీతమైన డిమాండ్ ఉంది. నేసే చేతులకు నైపుణ్యం ఉంది... కొనుగోలు చేసేందుకు మార్కెట్టూ ఉంది! మరి "మదనపల్లి చేనేత"కు రావాల్సిన ప్రత్యేక గుర్తింపు ఎందుకు రావడం లేదన్నదే నేతన్నల ప్రశ్న! "మదనపల్లి" పేరుతో ప్రత్యేక బ్రాండింగ్ చేసి, చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తే తమ చీరలకు మంచి ధర దక్కుతుందని చెబుతున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఎగ్జిబిషన్లు, సేల్స్ పాయింట్ల ద్వారా విక్రయించే సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.

నీరుగట్టువారిపల్లెలో సొంత మగ్గాలున్న వారికంటే... ఇతరుల దగ్గర కూలీకి నేసే కుటుంబాలే ఎక్కువ! రోజంతా నడుము విరగ్గొట్టుకుని పనిచేసినా... వచ్చే కూలీ కుటుంబ అవసరాలకు కనీసం సరిపోవడం లేదు. పైగా, ప్రభుత్వ పథకాలు కేవలం సొంత మగ్గం ఉన్నవారికే వర్తింపజేస్తున్నారని... తమలాంటి కూలీలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మగ్గం ఎవరిదైతేనేం...నేసేది చేనేత కార్మికుడే కదా అని ప్రశ్నిస్తున్నారు!

రోజంతా మగ్గం ముందు ఒకేలా కూర్చోవడం వల్ల నడుము నొప్పులు, కంటి చూపు తగ్గడం వంటి తీవ్ర శారీరక సమస్యలు నేతన్నలను వేధిస్తున్నాయి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే... ఆస్పత్రి బిల్లులు కట్టలేక అప్పులపాలవుతున్నారు. అందుకే, ప్రతీ నేతన్నకూ ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కూలీలుగా ఉన్నవారు సొంతంగా మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ వడ్డీకి రుణాలు, ఆధునిక డిజైన్లపై శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు.

సరైన ప్రోత్సాహం అందిస్తే మదనపల్లి చేనేత రాత మారడం పెద్ద కష్టమేమీ కాదు. గతంలో కూలీలుగా పనిచేసి, కష్టపడి సొంతంగా మగ్గాలు ఏర్పాటు చేసుకుని యజమానులుగా ఎదిగిన కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి! ప్రభుత్వాలు ముడిసరుకులపై రాయితీలు ఇచ్చి, పక్కా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే... ఎందరో కూలీ నేతన్నలు సొంత కాళ్లపై నిలబడే అవకాశముంది. మదనపల్లి టమోటాకు దక్కిన గుర్తింపు... ఇక్కడి మగ్గానికి కూడా దక్కాలన్నది నేతన్నల కల! గంటల తరబడి శ్రమించే చేతులకు కేవలం కూలీ మాత్రమే కాదు.. జీవితానికి గట్టి భరోసా కావాలి! కూలీ నేతన్నలకూ ప్రభుత్వ పథకాలు వర్తింపజేసి, ఆరోగ్య బీమా అందించి... మదనపల్లి చేనేతకు ప్రత్యేక బ్రాండింగ్ తీసుకువస్తేనే ఈ సంప్రదాయ కళ నిలబడుతుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES