SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Operation Trishul: తిరుపతిలో ఆపరేషన్ త్రిశూల్.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి..!

Operation Trishul: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ త్రిశూల్ కొనసాగుతోంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవకోనలో స్థానికులతో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలన, మహిళలు, చిన్నారుల భద్రత, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అసలు ఆపరేషన్ త్రిశూల్ ప్రధాన ఉద్దేశ్యం ఏంటి..? జీవకోనలో పోలీసులు చేపట్టిన కార్యక్రమంపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.

Written By Ashok Krindinti
Published: Oct 05, 2026, 06:43 PM IST | Updated: Oct 05, 2026, 06:54 PM IST
Image Credit: Operation Trishul
Join

Operation Trishul: ఏపీలో డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలను అరికట్టేందుకు సీఎం చంద్రబాబు ఆపరేషన్ త్రిశూల్‌ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్ త్రిశూల్‌లో పలు శాఖలు సమన్వయంతో పాల్గొని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సీఎం పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవకోనలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు.

గతంలో జీవకోన ప్రాంతానికి అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలతో చెడ్డపేరు ఉండేదని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ప్రజల్లో వచ్చిన మార్పు, పోలీసుల నిరంతర నిఘాతో నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. జీవకోనను ప్రశాంతమైన, సురక్షితమైన ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.

రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి వినియోగం, సరఫరాపై నిరంతరం నిఘా కొనసాగుతోందన్నారు. మత్తు పదార్థాలు ఎవరన్నా విక్రయించినా, సేవించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

ఈ సందర్భంగా మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు తెలిపారు. శక్తి టీమ్స్ నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయని, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, ఘర్షణలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. అల్లర్లకు పాల్పడిన వారిపై రౌడీషీట్లు తెరుస్తామని తెలిపారు.

అదే విధంగా సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం పిన్, సీవీవీ వంటి రహస్య వివరాలను ఎవరికీ చెప్పకూడదని తెలిపారు. బ్యాంకు అధికారులు ఫోన్‌లో ఇలాంటి వివరాలను అడగరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.  డబ్బు అందుకోవడానికి యూపీఐ పిన్ అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు అది ఎవరికి చెల్లింపు వెళ్తుందో పరిశీలించాలని సూచించారు. కేవైసీ అప్డేట్, బ్యాంక్ అకౌంట్ బ్లాక్, పోలీస్ కేసు, విద్యుత్ బిల్లు వంటి పేర్లతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.

లాటరీ, ఉద్యోగం, ఇతర ఆఫర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు, వీడియో కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మొబైల్‌లో యాప్స్‌ను అధికారిక వనరుల నుంచే ఇన్‌స్టాల్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఫోన్, బ్యాంకింగ్ యాప్స్, సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్ లేదా పిన్‌తో పాటు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించాలని తెలిపారు.

సైబర్ మోసంలో డబ్బు పోయినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ట్రాన్సాక్షన్ వివరాలు, స్క్రీన్‌షాట్లు, ఫోన్ నంబర్లు, మెసేజ్‌లు, చాట్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు వంటి ఆధారాలను భద్రపరచుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ మోసాలను నివారించవచ్చని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని పోలీసు అధికారులు కోరారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES