Tirupati Homestay: తిరుపతిలో విచ్చలవిడిగా హోమ్‌స్టేలు.. పండుగలు, బ్రహ్మోత్సవాల్లో అడ్డగోలు ధరలు
Tirupati Homestay: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. హోటళ్లు, లాడ్జీలతో పాటు తిరుపతిలో ‘హోమ్‌స్టే’లు భారీగా పుట్టుకొస్తున్నాయి. పర్యాటక శాఖ లెక్కల ప్రకారం దాదాపు 561 హోమ్‌స్టేలు ఇక్కడ నడుస్తున్నాయి. కానీ.. అతిథి దేవోభవ అనాల్సిన చోట....అడ్డగోలు దోపిడీ నడుస్తోందా?...నిబంధనలు గాలికొదేసి పక్కా కమర్షియల్ బిజినెస్ సెంటర్లుగా మారిపోయాయా? దీనిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
Tirupati Homestay: తిరుపతికి వచ్చే భక్తుల్లో కుటుంబాలు, వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చేవారే ఎక్కువ. చాలామంది రెండు మూడు రోజులు నగరంలోనే బస చేస్తుంటారు. ఇలాంటి వారికి హోటళ్ల కంటే తక్కువ ఖర్చులో, ఇల్లు లాంటి వాతావరణం ఇచ్చే హోమ్‌స్టేలు మంచి ప్రత్యామ్నాయంగా మారాయి. ఎక్కువ మంది ఒకే చోట ఉండే సౌకర్యం, కిచెన్, పార్కింగ్ వసతులు ఉండటంతో భక్తులు కూడా హోమ్‌స్టేల వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
హోమ్‌స్టేల అసలు ఉద్దేశం.. స్థానికులు తమ ఇళ్లలోని అదనపు గదులను భక్తులకు అద్దెకు ఇవ్వడం. దీనివల్ల భక్తులకు తక్కువ ధరలో వసతి దొరకడమే కాకుండా, స్థానిక కుటుంబాలకు అదనపు ఆదాయం లభిస్తుంది. నిర్వహణ, శుభ్రత, వంటి పనుల ద్వారా స్థానికులకు ఉపాధి కూడా లభిస్తోంది. 2025 పర్యాటక శాఖ లెక్కల ప్రకారం తిరుపతిలో సుమారు 561 హోమ్‌స్టేలు ఉన్నట్లు సమాచారం. హోమ్ స్టేల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అనుమానాలు, ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఇంటి వాతావరణంలో నడుస్తున్నవి ఎన్ని? పూర్తిస్థాయి వ్యాపార సముదాయాలుగా మారిపోయినవి ఎన్ని? హోమ్‌స్టేల పేరుతో భవనాలకు భవనాలే అద్దెకు ఇస్తూ కమర్షియల్‌గా మారుస్తున్నారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నిబంధనల ప్రకారం ఇవి నడుస్తున్నాయా లేదా అని అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముఖ్యంగా సెలవులు, పండుగలు, బ్రహ్మోత్సవాల టైంలో తిరుపతిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు హోమ్‌స్టే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఒక ధర చూపి, తీరా అక్కడకు వెళ్లాక ఎక్కువ వసూలు చేయడం వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ధరల విషయంలో ఖచ్చితమైన పారదర్శకత ఉండాలని కోరుతున్నారు.
ధరలతో పాటు భక్తుల భద్రత కూడా అత్యంత ముఖ్యం. కుటుంబాలతో వచ్చే వారికి సరైన రక్షణ ఉందా లేదా అనేది పరిశీలించాలి. అగ్నిప్రమాదాల నివారణ చర్యలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, సీసీ కెమెరాలు, పరిశుభ్రత వంటి ప్రాథమిక వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో అధికారులు పర్యవేక్షించాలి. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. మరోవైపు భక్తులకు సులభంగా సమాచారం దొరికేలా వ్యవస్థ ఉండాలి. తిరుపతిలో అధికారికంగా నమోదైన హోమ్‌స్టేలు ఎన్ని? అవి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? గది అద్దె ఎంత? అనే వివరాలు ఒకే చోట అందుబాటులో ఉంచాలి. దీనివల్ల భక్తులు మోసపోకుండా సరైన వసతిని ఎంచుకోగలరు. అలాగే అనుమతులు లేని అనధికారిక హోమ్‌స్టేలను గుర్తించడం అధికారులకు కూడా తేలికవుతుంది.
హోమ్‌స్టే నిర్వాహకులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. భక్తులను కేవలం వ్యాపార వినియోగదారులుగా కాకుండా, తిరుమల శ్రీవారి అతిథులుగా చూడాలి. చెప్పిన సదుపాయాలను ఖచ్చితంగా అందించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, పారదర్శకమైన సేవలందించినప్పుడే హోమ్‌స్టే సంస్కృతికి మంచి పేరు వస్తుంది. తిరుపతి అనేది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు.. కోట్లాది మంది నమ్మకానికి కేంద్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ స్థానికులకు ఆదాయం రావడం, రవాణా, ఆహార రంగాలకు వ్యాపారం పెరగడం మంచి పరిణామమే. కానీ, సేవ పేరుతో అపరిమితమైన వ్యాపారం సాగితే మాత్రం నియంత్రణ తప్పనిసరి. నిజమైన హోమ్‌స్టేలకు ప్రాధాన్యం ఇస్తూనే, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలి.
తిరుపతిలో హోమ్‌స్టేల సంఖ్య పెరగడం స్వాగతించదగిన విషయమే. కానీ, ఆ పేరుతో నియంత్రణ లేని వ్యాపారం సాగకూడదు. పర్యాటక శాఖ, స్థానిక అధికారులు ధరలు, భద్రత, నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలి. భక్తులకు సౌకర్యవంతమైన బస అందిస్తూ.. స్థానికులకు ఉపాధి చూపుతూ.. నిబంధనల ప్రకారం నడిచినప్పుడే తిరుపతిలో ఈ హోమ్‌స్టే సంస్కృతికి ఒక అర్థం ఉంటుందంటున్నారు స్థానికులు.