SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gas Cylinder Blast: చంద్రబాబు సభ వద్ద కలకలం.. పేలిన గ్యాస్ సిలిండర్

Gas Cylinder Blast At CM Chandrababu Meeting: ముఖ్యమంత్రి సమావేశం జరుగుతున్న సభ వద్ద ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. పెద్ద ఎత్తున పేలుడు శబ్దం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తీరా ఏం జరిగిందని చూడగా.. నిమ్మకాయ సోడా బండి వద్ద గ్యాస్‌ సిలిండర్‌ పేలిందని తెలిసింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 30, 2026, 05:48 PM IST | Updated: Sep 30, 2026, 05:50 PM IST
Image Credit: Cylinder Blast At Chandrababu Meeting
Join

Vijayawada: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం సమీపంలో ఒక్కసారిగా పేలుడు శబ్ధ రావడంతో కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమై పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. తీరా ఏం జరిగిందని తెలుసుకోగా.. నిమ్మకాయ సోడా బండి వద్ద ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలిందని తెలుసుకుని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ బసవపున్నయ్య స్టేడియం వద్ద ముఖ్యమంత్రి కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం జరుగుతున్న సమయంలో పేలుడు శబ్ధం వినిపించింది. స్టేడియం వద్ద ఉన్న నిమ్మకాయ సోడా బండి వద్ద ఎండ తీవ్రత కారణంగా గ్యాస్ సిలిండర్ పేలింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు, సభకు హాజరైన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి చక్కదిద్దారు. సోడా గ్యాస్ బండ అని తెలుసుకున్న స్థానికులు, సభికులు ఊపిరి పీల్చుకున్నారు.

అంతకుముందు జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. ప్రజలు వేసిన ప్రతి ఓటుకూ న్యాయం చేస్తున్నాం.     ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడుతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది' అని తెలిపారు. 'విశాఖపట్నంలో 28 వేల మంది, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, విజయవాడలో 26 వేల మంది.. మొత్తం కలిపి 60 వేల మంది పేదలకు పట్టాలు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నా' అని చంద్రబాబు చెప్పారు.

'రూ.52 వేల కోట్ల విలువైన భూముల్ని పేదలకు ఇవ్వటం సంతోషంగా ఉంది. పేదలకు జరుగుతున్న పట్టాభిషేకం ఇది. విజయవాడలో ఇస్తున్న భూముల విలువ రూ.28,112 కోట్లుగా ఉంది. ప్రతి ఒక్కరికీ సగటున 130 చదరపు గజాల స్థలం వచ్చింది. ఒక్కో స్థలం విలువ రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ ఉంటుంది. ఇదే పేదల ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న పట్టాభిషేకం' అని చంద్రబాబు వెల్లడించారు.

'దశాబ్దాలుగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించి మీ స్థలాలకు హక్కుల కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. గత పాలనలో ఐదేళ్ల పాటు విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. పేదలకు కూడూ, గూడు, గుడ్డ అన్నది ఎన్టీఆర్ నినాదం అందులో భాగంగా 12,007 మందికి హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. '707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించాం. ఇది మీ వారసత్వ హక్కు. భవిష్యత్తు కోసం జాగ్రత్తగా వీటిని కాపాడుకోవాలి' అని సూచించారు.

'దశాబ్దాలుగా ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాం. విశాఖ, వట్టిచెరుకూరు, కంగుమంది, కైకలూరు, అమలాపురం లాంటి చోట్ల ఉన్న ఈ తరహా సమస్యల్ని పరిష్కరించి పట్టాలు ఇచ్చాం. 2019-24లో గత పాలకులు ప్రతీ ఇంట్లోనూ ఆస్తుల వివాదాలు సృష్టించారు' అని వైఎస్‌ జగన్‌ పాలనపై సీఎం చంద్రబాబు విమర్శించారు. 'పట్టాదారు పాస్ పుస్తకాలపై వారి బొమ్మలేసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ఇబ్బందులు సృష్టించారు' అని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. ఎలాంటి వివాదాలు లేని కొత్త వ్యవస్థను తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES