Sachivalaya Employees: చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన సచివాలయ ఉద్యోగులు.. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత
High Tension In Vijayawada: ఏపీలోని విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ఉద్యోగులు భారీ నిరసనకు సిద్ధమవగా.. వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Sachivalaya Employees Protest: సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు భారీ ఆందోళన చేపట్టగా విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు ఎలాంటి అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు విజయవాడలో తీవ్ర ఆంక్షలు విధించారు. అయినా కూడా సచివాలయ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధమవగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో పోలీసులు, సచివాలయ ఉద్యోగులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఉద్యోగులందరినీ అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు.
చలో విజయవాడకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పిలుపునివ్వగా.. అందులో భాగంగా విజయవాడలోని ధర్నా చౌక్‌కు ఉద్యోగులు తరలివస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించినా.. విజయవాడకు ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. పలుమార్లు ఉద్యోగులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఉద్యోగులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వలయాన్ని చేధించుకుంటూ ఎట్టకేలకు ఉద్యోగులు ధర్నా చౌక్‌కు చేరుకున్నారు.
విజయవాడలోని ధర్నా చౌక్‌లో నిరసన తెలియజేయడానికి తణుకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే మహిళ ఉద్యోగస్తులను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ సమీపంలో అడ్డుకొని గన్నవరం తీసుకుకువెళ్లారు. తతాము శాంతియుతంగా తమ బాధలు వ్యక్తపరచడానికి వచ్చామని.. అందరూ చదువుకున్నవారే ఉన్నారని సచివాలయ ఉద్యోగులు తెలిపారు. సచివాలయాల్లో ఇతర ఇతర 10 డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సిబ్బంది తాము అని చెప్పారు. గొడవలు చెయ్యడానికి రాలేదని వివరణ ఇచ్చారు.
తమకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లేకపోవడంతో ధర్నా చౌక్‌లో నిరసన తెలపడానికి వచ్చామని పోలీసులతో సచివాలయ ఉద్యోగులు వాదించారు. తమ నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయాల్లో పనిచేసే తమకు ఎటువంటి గుర్తింపు లేదని.. ఇంక్రిమెంట్లు లేవు, ప్రమోషన్స్ లేవు అని వాపోయారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి విజయవాడ వచ్చామని సచివాలయ ఉద్యోగులు తెలిపారు. తోపులాట, వాగ్వాదం అనంతరం సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని గన్నవరం నుంచి ఆత్కూరు పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి విజయవాడ ధర్నా చౌక్‌కు వెళ్తున్న సచివాలయ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయ ఉద్యోగులను అరెస్ట్ చేసి ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు 200మందికి పైగా సచివాలయం ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు. తమను రెండు గంటల నుంచి బస్సులో ఉంచారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నా అనుమతించలేదని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ చేరుకున్న సచివాలయ ఉద్యోగులను బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్‌లలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.