Rukmini Kota Pawan Kalyan: "డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇందులో సంబంధం ఏంటి?" జనసేన నేత రుక్మిణి సంచలనం!
Rukmini Kota Pawan Kalyan Controversy: తన సంస్థలోని మాజీ ఉద్యోగి ఒకరు పాల్పడిన ఉద్యోగ నియామక మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని జనసేన నేత రుక్మిణి కోటా స్పష్టం చేశారు. తన పేరును, సంస్థ అధికారిక పత్రాలను దుర్వినియోగం చేసిన సదరు ఉద్యోగిపై అంతర్గత విచారణ జరిపి విధుల నుంచి తొలగించడమే కాకుండా, పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Rukmini Kota Pawan Kalyan Controversy: జనసేన నేత రుక్మిణి కోటాపై సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లపై ఆమె స్పందించారు. తన సంస్థలోని మాజీ ఉద్యోగిని ఒకరు పాల్పడిన ఉద్యోగ నియామకాల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన పేరుతో పాటు తన సంస్థకు సంబంధించిన అధికారిక పత్రాలను దుర్వినియోగం చేసిన క్రమంలో సదరు ఉద్యోగినిపై అంతర్గత విచారణ చేసి విధుల నుంచి తొలగించామని ఆమె స్ఫష్టం చేశారు.
మోసంపై ఫిర్యాదు చేసిన తనపైనే కొందరు రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తూ.. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ పేరును వివాదంలోకి లాగడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని కించపరిచే వారిపై న్యాయపరంగా పోరాడతానని తేల్చిచెప్పారు.
రుక్మిణి కోటా విడుదల చేసిన బహిరంగ ప్రకటన ప్రకారం.. ఆమె సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఆమె పేరును, కంపెనీ గుర్తింపును, అధికారిక పత్రాలను దుర్వినియోగం చేస్తూ తీవ్రమైన ఉద్యోగ నియామక మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారమంతా అధికారిక పని వేళల వెలుపల, ఆమె ప్రమేయం, అనుమతి లేకుండానే జరిగిందని తేలింది. ఈ విషయం దృష్టికి వచ్చిన వెంటనే ఆమె ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరారు. అనంతరం అంతర్గత విచారణ జరిపి సేవలను రద్దు చేయడంతో పాటు, బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు లాగడంపై ఆగ్రహం
అసలు నేరానికి పాల్పడిన వారిని ప్రశ్నించాల్సింది పోయి, మోసంపై స్వయంగా ఫిర్యాదు చేసిన తననే కొందరు రాజకీయ నాయకులు, మీడియా వేదికలు నిందితురాలిగా చిత్రీకరించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించి తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షులు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ పేరును ఈ ఆరోపణలతో ముడిపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు
తన మౌనం బలహీనత కాదని, సహనం లొంగుబాటు కాదని రుక్మిణి కోటా తేల్చిచెప్పారు. భగవద్గీత శ్లోకాన్ని ప్రస్తావిస్తూ, మంచి చేసే వారికి ఎన్నటికీ దుర్గతి పట్టదని పేర్కొన్నారు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (CMPF), 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి నేటి వరకు పవన్ కల్యాణ్ నాయకత్వం, ఆశయాల పట్ల అచంచలమైన నిబద్ధతతో కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి, జనసేన వీర మహిళల స్ఫూర్తితో తన ఆత్మగౌరవాన్ని, కుటుంబాన్ని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన మార్గాల్లో పోరాడతానని, తప్పుడు ప్రచారం చేసేవారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతానని ఆమె వెల్లడించారు.