SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Botsa Anusha: కూటమి నేతలంతా ఏకమైనా.. వెనక్కి తగ్గని బొత్స అనూష..!

Andhra Pradesh Politics: బొండపల్లి జడ్పీటీసీ ఎన్నికల్లో ఊహించని విధంగా బరిలోకి దిగిన బొత్స అనూష.. ప్రత్యర్థుల నుంచి గట్టి సవాల్ ఎదుర్కొని ఓటమిపాలయ్యారు. మరోవైపు గరివిడి, గుర్లలో వైసీపీ విజయాల వెనుక ఆమె పాత్రను వైసీపీ వర్గాలు మెచ్చుకుంటున్నాయి.

Written By Ashok Krindinti
Published: Nov 08, 2026, 04:36 PM IST | Updated: Nov 08, 2026, 04:39 PM IST
Image Credit: Botsa Anusha (Source: Facebook)
Join

Andhra Pradesh Politics: బొండపల్లి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. రాజకీయంగా మాత్రం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూతరు బొత్స అనూష పేరు చర్చనీయాంశంగా మారింది. అధికార కూటమి నేతలంతా ఒక్కటై రాజకీయంగా అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా ఎన్నికల బరిలో నిలిచిన ఆమె.. ఒకవైపు విజయనగరం జిల్లాలో పోరాటం చేస్తూనే మరోవైపు భీమిలిలో పార్టీ వ్యవహారాలను సమన్వయం చేశారు. బొత్స సత్యనారాయణ కుమార్తెగా కాకుండా.. సొంతంగా రాజకీయ నాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. బొండపల్లిలో ఎదురైన సవాళ్లు, భీమిలిలో పార్టీకి దక్కిన ఫలితాలు, విజయనగరం జిల్లాలో వైసీపీ విజయాల వెనుక ఆమె పాత్ర ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

బొండపల్లి జెడ్పీటీసీ ఎన్నికల్లో బొత్స అనూష పోరాటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార కూటమి నుంచి గట్టి పోటీ ఎదురైనా వెనక్కి తగ్గకుండా బరిలో నిలవడం ద్వారా ఆమె తన రాజకీయ పట్టుదలను చాటుకున్నారు. వైసీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న బొత్స అనూష.. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్కడ పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు.

అయితే విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపాలనే ఆలోచనతో అధిష్టానం బొత్స అనూషను పేరును ఖరారు చేసింది. అక్కడ స్థానికంగా అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నా.. పార్టీ నిర్ణయానికి అనూష అంగీకరించి నామినేషన్ దాఖలు చేశారు. బొత్స అనూష అక్కడికి వెళ్లకుమందే బొండపల్లి ఎన్నిక చుట్టూ అప్పటికే రాజకీయ వేడి మొదలైంది. వైసీపీ అభ్యర్థి లేకుండా చేసి జెడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవాలన్న ప్రయత్నాలు జరిగాయని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబీనాయనతో పాటు టీడీపీలో చేరిన మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్థానిక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లో అనూష నామినేషన్ వేయడంతో ఎన్నికల సమీకరణాలు మారిపోయాయి. ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోవడంతో కూటమి నేతలు కూడా బొండపల్లి ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వచ్చింది. దీంతో స్థానికంగా మొదలైన పోరు జిల్లా రాజకీయాల్లోనూ చర్చకు దారితీసింది. బొండపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తునే.. తాను బాధ్యత వహిస్తున్న భీమిలి నియోజకవర్గంపై కూడా అనూష దృష్టి సారించారు. జీవీఎంసీ పరిధిలోని భీమిలి వార్డుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలోని కూటమి నుంచి ఎదురైన రాజకీయ పోటీని తట్టుకుంటూ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు.

భీమిలి పరిధిలో పోటీ చేసిన ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించడంలో అనూష పాత్ర కీలకమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు బొండపల్లిలో ప్రత్యక్షంగా ప్రచార బాధ్యతలు చూసుకుంటూనే, మరోవైపు భీమిలిలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడం ఆమెకు రాజకీయంగా సవాలుగా మారింది. బొండపల్లిలో అనూష ప్రచారం ఊపందుకోవడంతో కూటమి నేతలు కూడా ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. మంత్రి, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు రంగంలోకి దిగడంతో అక్కడ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. చివరకు బొండపల్లి ఫలితం అనూషకు అనుకూలంగా రాకపోయినా.. కూటమి ఆశించిన స్థాయిలో భారీ ఆధిక్యం సాధించలేకపోయిందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం 5,136 ఓట్ల మెజార్టీతోనే కూటమి విజయం సాధించిందని చెబుతున్నాయి.

చీపురుపల్లి నియోజకవర్గంలో గతంలో అనూష ఏర్పరచుకున్న రాజకీయ పరిచయాలు, పార్టీ శ్రేణులతో ఉన్న సంబంధాలు గరివిడి, గుర్ల ప్రాంతాల్లో ఉపయోగపడ్డాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. గరివిడిలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు కోడలిపై బొత్స పూజిత సాధించిన విజయం.. గుర్లలో సంగంరెడ్డి వెంకటలక్ష్మి గెలుపు పార్టీకి కీలకంగా మారాయి. ఈ విజయాల వెనుక క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయడం, మహిళా విభాగాలను ఎన్నికలకు సిద్ధం చేయడంలో అనూష చేసిన కృషి ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బొత్స కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యాన్ని కొనసాగించడమే కాకుండా, సొంతంగా పార్టీ బాధ్యతలను నిర్వహించగల నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES