Cyclone Akvan Latest Update: దక్షిణ మధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 'అక్వాన్' తీవ్ర తుఫాను కొనసాగుతోంది. గత ఆరు గంటల్లో ఇది గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ (RTGS) సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను నరసాపురానికి 500 కి.మీ, కళింగపట్నానికి 540 కి.మీ, చెన్నైకి 560 కి.మీ, గోపాల్‌పూర్‌కి 630 కి.మీ, పూరీకి 690 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వర్ష సూచన, గాలుల తీవ్రత
ఈ తీవ్ర తుపాను శుక్రవారం మధ్యాహ్నానికి నరసాపురం - ఒడిశా రాష్ట్రంలోని పూరీ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం నవంబరు 19న పలు జిల్లాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ వేగంతో, గరిష్ఠంగా 80 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
ప్రజలకు అధికారుల హెచ్చరికలు
అక్వాన్ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అత్యవసర సహాయక బృందాలను ముందస్తుగానే మోహరించారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాసలలో 3 NDRF బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, సీతంపేటలలో 2 NDRF బృందాలు, అదే విధంగా విజయనగరంలో 1 SDRF బృందంతో పాటు స్థానిక అగ్నిమాపక దళాలను సిద్ధంగా ఉంచారు.
సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.