Diviseema Cyclone 1977: 49 ఏళ్లయినా మానని దివిసీమ గాయం.. మృత్యువు విలయతాండవం చేసిన ఆ కాళరాత్రి ఏం జరిగిందంటే..?
Diviseema Cyclone History: 1977 నవంబర్ 19న సంభవించిన దివిసీమ ఉప్పెనకు నేటితో 49 ఏళ్లు. వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఆ జలప్రళయం ఎలా మొదలైంది..? ఆ కాళరాత్రి అసలేం జరిగింది..? పూర్తి వివరాలు ఇలా..
Diviseema Cyclone History: మనదేశ చరిత్రలోనే అత్యంత భయానక ప్రకృతి వైపరీత్యాలలో దివిసీమ ఉప్పెన ఒకటి. ఈ జలప్రళయం సంభవించి నేటికి సరిగ్గా 49 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19న బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని.. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని దివిసీమను శ్మశానవాటికగా మార్చేసింది. దశాబ్దాలు గడుస్తున్నా.. ప్రతి ఏటా నవంబర్ నెల వచ్చిందంటే చాలు ఆనాటి చేదు జ్ఞాపకాలు గుర్తుకువచ్చి తీర ప్రాంత ప్రజలు ఇప్పటికీ వణికిపోతున్నారు. ప్రస్తుతం నవంబర్ నెలలో వరుస తుఫాన్ల హెచ్చరికలు వస్తుండటంతో దివిసీమ వాసుల్లో మళ్లీ ఆనాటి భయాందోళనలు మొదలయ్యాయి.
నదీ ప్రవాహంతో కొట్టుకొచ్చిన ఒండ్రుమట్టి మేటలు వేసి ద్వీపాలుగా ఏర్పడటం ప్రకృతి సహజం. అందుకు నిలువెత్తు నిదర్శనమే దివిసీమ. బంగాళాఖాతం తీరాన సుమారు 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో మరో రెండు చిన్న దీవులు ఉండటం విశేషం. కృష్ణా నది సముద్రంలో కలిసే చోట ఉన్న ఈ సస్యశ్యామల ప్రాంతం, 1977 నాటి పెను ఉప్పెనతో ప్రపంచవ్యాప్తంగా విషాదకర గుర్తింపు పొందింది.
ఆ కాళరాత్రి అసలేం జరిగింది..?
1977 నవంబర్ 19వ తేదీ సాయంత్రం వరకు భీకరంగా వీచిన ఈదురు గాలులు, కుండపోత వర్షం అకస్మాత్తుగా తగ్గుముఖం పట్టాయి. తుఫాను ముప్పు తప్పిందని భావించిన దివిసీమ ప్రజలు ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు. కానీ, అది పెను ప్రళయానికి ముందు ఆవరించిన నిశ్శబ్దం అని ఎవరూ ఊహించలేదు. అర్ధరాత్రి దాటాక సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఎగసిపడిన రాక్షస అలలు ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. గాఢ నిద్రలో ఉన్న వేలాది మంది ప్రజలు, పశువులు తేరుకునేలోపే జలసమాధి అయ్యారు. తెల్లవారి చూసేసరికి ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపించాయి. తుమ్మ పొదల్లో, తాటి చెట్ల కొమ్మలపై మృతదేహాలు చిక్కుకుని కనిపించాయి. ప్రాణాలతో బయటపడిన వారికి తాగడానికి గుక్కెడు మంచినీరు లేక, ఆకలి దప్పులతో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. కుళ్లిపోయిన కళేబరాల దుర్గంధంతో ఆ ప్రాంతమంతా నరకప్రాయంగా మారింది.
ఈ జలప్రళయంలో జరిగిన ప్రాణనష్టం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అధికారిక ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఉప్పెనలో దాదాపు 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే అనధికారిక అంచనాలు, స్థానిక ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం మృతుల సంఖ్య 15 వేల నుంచి 20 వేల వరకు ఉండవచ్చని చెబుతారు. కొన్ని గ్రామాల్లో అయితే కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఇక 2.5 లక్షలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. దాదాపు 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రాణాలతో బయటపడిన వారికి తాగడానికి గుక్కెడు మంచినీరు లేక, ఆకలి దప్పులతో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉప్పునీరు భూముల్లోకి చేరడంతో బావులన్నీ కలుషితమయ్యాయి. కుళ్లిపోయిన మృతదేహాలు, పశువుల కళేబరాల దుర్గంధంతో ఆ ప్రాంతమంతా నరకప్రాయంగా మారింది.
ఈ పెను తుఫాను ప్రస్థానం ఇలా..
1977 నవంబర్ 14న నికోబార్ దీవులకు నైరుతి దిశగా సుమారు 520 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను వ్యవస్థను ఉపగ్రహాలు తొలిసారి గుర్తించాయి. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ అదే రోజు తీవ్ర వాయుగుండంగా బలపడింది. మధ్యాహ్నం జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ (JTWC) తొలి హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 15 ఉదయం 8 గంటల సమయానికి గాలుల వేగం గంటకు 75 కిలోమీటర్లకు చేరుకోవడంతో పూర్తిస్థాయి తుఫానుగా మారింది. అనంతరం వాయువ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతూ సముద్రంలో మరింత శక్తిని పుంజుకుంది. నవంబర్ 16 నాటికి ఇది అత్యంత తీవ్రమైన హరికేన్ స్థాయికి చేరింది.
తుఫాను తీరం వైపు దూసుకొస్తుండటంతో నవంబర్ 17న గాలుల వేగం గంటకు 195 కిలోమీటర్లకు పెరిగింది. కేంద్రంలో బారోమెట్రిక్ పీడనం 948 hPa వద్ద నమోదైంది. నవంబర్ 18 సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను, గంటకు 205 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడింది. IMD అంచనా ప్రకారం.. తీరం దాటే సమయంలో మూడు నిమిషాల పాటు ఏకంగా గంటకు 230 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయి. దీంతో ఇది అత్యంత విధ్వంసకరమైన 'సూపర్ సైక్లోనిక్ తుఫాను'గా రికార్డులకెక్కింది. 49 ఏళ్లు గడిచినా, ఆనాటి ప్రకృతి ప్రకోపం మిగిల్చిన ఆనవాళ్లు, ఆత్మీయులను కోల్పోయిన బాధితుల కన్నీటి గాథలు దివిసీమ చరిత్రలో చెరగని ముద్రగా మిగిలిపోయాయి.