Vishakapatnam Crime: ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. నమ్మించి నగలతో పరార్..!
Vishakapatnam Crime: సోషల్ మీడియా పరిచయం విశాఖపట్నంలో ఓ మహిళ కుటుంబాన్ని నిండా ముంచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ మహిళ ఇంట్లో మరో మహిళ ఆశ్రయం పొంది.. చివరకు బంగారం దొచుకుని పరార్ అయింది. విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా..
Vishakapatnam Crime: ఎవరి ఫ్రెండ్‌షిప్ చివరకు ఎటు దారిస్తుందో చెప్పలేం.. కొందరు వాటిని స్నేహాలుగా మలుచుకుంటే.. మరికొందరు అదే పరిచయాన్ని మోసాలకు వాడుకుంటున్నారు. తెలిసిన మనుషులే నిండా ముంచుతున్న ఈ కాలంలో ఇక సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను పూర్తిగా నమ్మి మోసపోయింది ఓ బాధితురాలు. విశాఖపట్నానికి చెందిన మానేపల్లి నీరజ అనే మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళ పరిచయం అయింది. తాను అనారోగ్యంతో ఉన్నానంటూ చెప్పిన ఆ మహిళ.. నీరజ ఇంటికి వచ్చి ఆశ్రయం పొందింది. కొద్దిరోజుల పాటు అక్కడే ఉంటూ కుటుంబ సభ్యుల నమ్మకాన్ని సంపాదించింది. చివరకు ఇంట్లోని బంగారు, వజ్రాభరణాలను తీసుకుని కనిపించకుండా పోయింది. విశాఖలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మానేపల్లి నీరజ (40)తో సదరు మహిళ 'Smiley-Queen' అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా పరిచయాన్ని పెంచుకుంది. ఆమె వ్యక్తిగత వివరాలు, కుటుంబ విషయాలను ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. తనకు ఆరోగ్యం బాగోలేదని.. ఇబ్బందుల్లో ఉన్నానని ఆ మహిళ చెప్పడంతో నీరజ ఆమెకు ఇంట్లో ఆశ్రయం కల్పించారు. అలా ఇంట్లోకి వచ్చిన మహిళ కొంతకాలం అక్కడే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసిపోయింది.
తన ప్రవర్తనతో ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించింది. ఈ క్రమంలో ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన విలువైన నగలపై కన్నేసింది. అదును చూసుకుని బంగారు, వజ్రాభరణాలను తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో నగలు కనిపించకపోవడంతో నీరజ ఆందోళన చెందింది. 11.3 గ్రాముల బరువున్న డైమండ్ నెక్లెస్‌తో పాటు ఇతర వజ్రాభరణాలు, బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మహిళే ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మహిళ ఎవరనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అవతలి వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా.. వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.