SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kakinada Fishermen: కాకినాడ సముద్రంలో అక్రమ వేట.. సాంప్రదాయ మత్స్యకారుల బతుకులు బుగ్గిపాలు..!

Kakinada Latest News: కాకినాడ సముద్ర తీరంలో కొందరి అత్యాశ...వేలాది మంది మత్స్యకారుల పొట్టకొడుతోంది! అక్రమ వేట సముద్ర గర్భాన్ని గుల్ల చేస్తోంది! నియంత్రించాల్సిన అధికారుల నిర్లక్ష్యం సాంప్రదాయ మత్స్యకారుల బతుకులను బుగ్గి పాలు చేస్తోంది! హోప్ ఐలాండ్, కోరింగ అభయారణ్య పరిధిలో సాగుతున్న ఈ జల దోపిడీపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.

Written By Ashok Krindinti
Published: Sep 28, 2026, 01:04 PM IST | Updated: Sep 28, 2026, 01:05 PM IST
Image Credit: Kakinada Latest News
Join

Kakinada Latest News: బంగాళాఖాతంలో సముద్ర వేటకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. సాంప్రదాయ తెప్పలు, చిన్న బోట్లకు 10 నాటికల్ మైళ్ల పరిధి వరకు అనుమతి ఉంటే...యంత్ర బోట్లకు 10 నుంచి 15 నాటికల్ మైళ్ల దూరంలో వేటాడేందుకు నిబంధనలు వేరుగా ఉన్నాయి. కోరింగ అభయారణ్యం, తుఫానుల నుంచి తీరాన్ని కాపాడే హోప్ ఐలాండ్ ప్రాంతాలు సీఆర్జడ్, ఎకో-జోన్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సాధారణ మత్స్యకారులు మాత్రమే వేటాడాలి, యంత్ర బోట్లకు పూర్తిగా నిషేధం ఉంది. ఇక్కడ ఎన్నో అరుదైన సముద్ర జీవులు ఉంటాయి. కానీ, వీటిని పర్యవేక్షించాల్సిన మెరైన్ పోలీసులు, మత్స్యశాఖల అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలకే పరిమితమవుతున్నారు.

కోరింగ అభయారణ్యం, హోప్ ఐలాండ్ పరిసర ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న యంత్ర బోట్లు విచ్చలవిడిగా వేట సాగిస్తున్నాయి. చేపల గుడ్లు, చిన్న పిల్లలతో సహా పట్టుకుపోయి ఫిష్ ఆయిల్ తయారీకి వాడుతున్నారు. అటవీశాఖ వద్ద చిన్న బోట్లు మాత్రమే ఉండటంతో వేటాడే యంత్ర బోట్లను పట్టుకోవడం వారికి సాధ్యపడటం లేదు. ఏదో రకంగా దొరికినా, పట్టుకున్న సరుకును తిరిగి సముద్రంలో వదిలేయడం తప్ప కేసులు పెట్టే అధికారాలు వారికి లేవు. కఠిన చర్యలు తీసుకోవాల్సిన మత్స్య, మెరైన్ శాఖల అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారని మత్స్యకారులు నేరుగానే ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఉప్పాడ తదితర తీరప్రాంతాల నుంచి వేటకు వెళ్లే సాధారణ మత్స్యకారులకు డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. వేటకు వెళ్లినా చేపలు పడకపోవడంతో బోట్లను లంగరు వేసి, కూలి పనులకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. మత్స్య సంపద పెరిగే ఎకో-జోన్ ప్రాంతాల్లోనే గుడ్లతో సహా చేపలను ఎత్తుకెళ్తుండటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇలాగే కొనసాగితే మరో ఏడాదిలో సముద్రంలో చేపలే దొరకవని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు.

వేలాది మత్స్యకార కుటుంబాల భవిష్యత్తు నిలవాలంటే ఎకో, శాంచ్యురీ ప్రాంతాల్లో యంత్ర బోట్ల వేటను తక్షణమే అడ్డుకోవాలి. అటవీశాఖ అధికారులు సమాచారం ఇస్తున్నా మత్స్య, మెరైన్ శాఖల అధికారులు స్పందించడం లేదు. ఈ అలసత్వం ఇలాగే కొనసాగితే కాకినాడ సముద్రంలో వేటే ఆగిపోయే ప్రమాదముంది. అంతేకాకుండా ప్రకృతి రక్షణగా ఉన్న హోప్ ఐలాండ్, కోరింగ అభయారణ్యాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఈ సమస్యపై జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వెంటనే దృష్టి సారించాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో సముద్ర కాలుష్యంపై నిరసన తెలపగా, 100 రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన ఇచ్చిన హామీకి ఏడాది కావోస్తున్నా మార్పు లేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా యంత్ర బోట్ల అక్రమ వేట తమ పొట్టకొడుతోందని వాపోతున్నారు. మరి ఈ సమస్యపై డిప్యూటీ సీఎం స్పందిస్తారా... లేక అధికారులు ఎప్పటిలాగే వదిలేస్తారా అనేది వేచి చూడాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES