SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఒకరు దొంగతనం చేస్తే.. మరొకరు బెయిల్ ఇప్పిస్తారు..! బయటపడ్డ ఇద్దరి క్రైమ్ కథ

Kakinada Crime News: దొంగతనాలు చేయడం ఒకరి పని.. ఆ సొమ్ములో వాటా తీసుకోవడం మరొకరి బాధ్యత.. అంతేకాదు.. దొంగ పోలీసులకు చిక్కితే బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు కూడా ముందుగానే ఓ ఒప్పందం చేసుకున్నారు. ఇలా తమదైన శైలిలో నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు.. పాత కేసుల నుంచి తప్పించుకునేందుకు గంజాయి వ్యాపారం వైపు మళ్లారు. కానీ కాకినాడలో జరిగిన ఓ చోరీ వీరి నేర చరిత్రను మరోసారి బయటపెట్టింది. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Nov 17, 2026, 18:48 IST | Updated: Nov 17, 2026, 18:50 IST
Image Credit: Kakinada Crime News
Join

Kakinada Crime News: కాకినాడ గోల్డ్ మార్కెట్ వీధిలోని బంగారం, వెండి ఆభరణాలను కరిగించే దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసును జిల్లా పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.10 లక్షల నగదు, వెండి కడ్డీలు, 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను మంగళవారం కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎం.కిషోర్ కుమార్ డీఎస్పీతో కలిసి వివరాలను వెల్లడించారు.

గోల్డ్ మార్కెట్ వీధిలోని ఓ దుకాణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.10 లక్షల నగదుతో పాటు మూడు కిలోల వెండి కడ్డీలను అపహరించారు. దీనిపై కాకినాడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ప్రత్యేక దృష్టి సారించి.. నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని ఆదేశించారు. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎన్‌ఎస్‌వీకే దుర్గారావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నేర స్థలంలో లభించిన వేలిముద్రలను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విశ్లేషించారు. ఈ క్రమంలో నవంబరు 17న నిందితుడిని గుర్తించారు. మూడో పట్టణ సీఐ కేవీఎస్ సత్యనారాయణ సిబ్బందితో కలిసి సూర్యనారాయణ పురంలోని అతడి నివాసం వద్ద బీర దుర్గా వెంకటేష్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద గంజాయి లభించడంతో విచారించగా.. కాకర లోవరాజు అనే వ్యక్తి గంజాయిని తీసుకొచ్చి తన వద్ద ఉంచినట్లు వెల్లడించాడు. దీంతో లోవరాజును కూడా పోలీసులు అరెస్టు చేశారు.

విచారణలో నిందితులిద్దరూ చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఏ-1 బీర దుర్గా వెంకటేష్‌పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 21 దొంగతనం కేసులు, ఏ-2 కాకర లోవరాజుపై సుమారు 28 దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏ-1 దొంగతనాలకు పాల్పడి వచ్చిన సొమ్ములో కొంత వాటాను ఏ-2కు ఇచ్చేవాడని, తాను పోలీసులకు పట్టుబడితే బెయిల్‌పై బయటకు వచ్చేందుకు సహకరించాలని కోరేవాడని విచారణలో తేలింది.

ప్రస్తుత చోరీ అనంతరం కూడా బెయిల్ అవసరాల కోసం ఏ-2 వద్ద కొంత నగదు ఉంచినట్లు వెల్లడైంది. ఇప్పటికే పలు దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉండటంతో పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ఇకపై దొంగతనాలు చేయకుండా గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏ-2 లోవరాజు కొన్ని రోజుల క్రితం చింతపల్లికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి కాకినాడకు తీసుకొచ్చాడు. కొంత గంజాయిని విక్రయించి, మిగిలిన దానిని ఏ-1 వద్ద ఉంచి ఇద్దరూ కలిసి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుత చోరీతో పాటు కడియం గ్రామంలోని ఓ వైన్ షాపు, నడకుదురు గ్రామంలోని ఓ ఇల్లు, కాకినాడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద మార్కెట్ ప్రాంతంలోనూ ఏ-1 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుల నుంచి వివిధ కేసులకు సంబంధించి రూ.10 లక్షల నగదు, తొమ్మిది వెండి కడ్డీలు, 1.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మరో చోరీ కేసులో పది ఉన్ని స్వెట్టర్లు, ఇంకో కేసులో రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES