SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kakinada Crime: దేవుడి నగలపైనే కన్ను.. ఒక్కటి కాదు 12 ఆలయాల్లో చోరీలు.. చివరికి ఇలా దొరికాడు

Kakinada Crime: కాకినాడ జిల్లాలో వరుసగా ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఒక్కటి కాదు.. ఏకంగా 12 కేసుల్లో అతడి ప్రమేయాన్ని గుర్తించారు. అతడి వద్ద నుంచి కిలోల కొద్దీ వెండి, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Nov 19, 2026, 19:30 IST | Updated: Nov 19, 2026, 19:31 IST
Image Credit: Kakinada Crime (Source: Facebook)
Join

Kakinada Crime: కాకినాడ జిల్లాలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 12 ఆలయ చోరీ కేసులతో సంబంధం ఉన్న నిందితుడిని పట్టుకుని.. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు, నేరాలకు ఉపయోగించిన బైక్ విలువ కలిపి సుమారు రూ.48 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వివరాలు ఇలా.. కాకినాడ జిల్లా తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మెయిన్ రోడ్డుపై ఉన్న వినాయకుడి ఆలయంలో అక్టోబర్ 17, 18 తేదీల మధ్య రాత్రి దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య ఆలయానికి చేరుకున్న దొంగ.. తలుపుల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం ఆలయంలోని విలువైన వస్తువులను అపహరించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లాలోని ఆలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాలతో కాకినాడ సబ్ డివిజన్ డీఎస్పీ ఎన్.ఎస్.వి.కె.దుర్గారావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ సీఐ డీఎస్.చైతన్య కృష్ణ, తిమ్మాపురం ఎస్ఐ వై.గణేష్ కుమార్ ఆధ్వర్యంలో సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర దర్యాప్తు పద్ధతులను ఉపయోగించి నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో నవంబర్ 19న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తిమ్మాపురం గ్రామ శివారులోని ఎన్‌హెచ్-216 బైపాస్ రోడ్డు వద్ద అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతడిని అరెస్టు చేశారు.

అరెస్టయిన వ్యక్తిని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన పసుపులేటి శివాజీ (30)గా పోలీసులు గుర్తించారు. చెడు అలవాట్లకు బానిసై అప్పులు చేయడంతో వాటిని తీర్చుకునేందుకు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. గతంలోనూ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మూడు దొంగతనం కేసుల్లో శివాజీని పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులకు సంబంధించి కోర్టు వాయిదాలకు హాజరవుతున్నప్పటికీ, తిరిగి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా నిర్వహించిన దర్యాప్తులో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 12 ఆలయ చోరీ కేసులతో అతడికి సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు.

నిందితుడి నుంచి పోలీసులు భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వెండి దేవతా విగ్రహాల తొడుగులు, వెండి కడ్డీలు, ఇతర వెండి వస్తువులు కలిపి 25.833 కిలోలు ఉన్నాయి. అలాగే 20 గ్రాముల బంగారు వస్తువులు, బంగారు ముక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను సీజ్ చేశారు. వీటన్నింటి విలువ సుమారు రూ.48 లక్షలుగా అంచనా వేశారు. వరుస ఆలయ చోరీ కేసులను ఛేదించి, నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అభినందించారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES