SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తాటా తీస్తా..! ఆ నియోజకవర్గంలో కార్యకర్తలతో టీడీపీ మహిళా ఎమ్మెల్యే రగడ

AP Politics: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేతో టీడీపీ కార్యకర్తల రగడ‌ హాట్ టాపిక్ గా మారింది. తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన మహిళా ఎమ్మెల్యే తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇంతకీ అక్కడ ఎమ్మెల్యేపై టీడీపీ క్యాడర్ ఎందుకు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే సారీ చెప్పడంతో అసమ్మతి కథ సుఖాంతం అయినట్టేనా...? నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై టిడిపి అధిష్టానం ఏం చేయబోతుంది...?

Written By Ashok Krindinti
Published: Sep 20, 2026, 07:36 AM IST | Updated: Sep 20, 2026, 07:39 AM IST
Image Credit: AP Politics (Source: File)
Join

AP Politics: పోలవరం జిల్లా రంపచోడవరం టిడిపి ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి సొంత పార్టీ కార్యకర్తలపై రెచ్చిపోయిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాట తీస్తా అంటూ పార్టీ సమావేశంలో టీడీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. సొంత పార్టీ క్యాడర్ పై ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే శిరీష దేవి తన నియోజకవర్గంలో మండలాల వారీగా  టీడీపీ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో  నాలుగు రోజుల క్రితం అడ్డతీగలలో నిర్వహించిన సమావేశంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ వారిపై మండిపడ్డారు. నేను వైసిపి వాళ్లకు పనులు చేస్తున్నాను అంటూ మీరు పార్టీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తారా..? మీ తాటతీస్తా అంటూ టీడీపీ కార్యకర్తలను హెచ్చరించారు. తనతో వాగ్వివాదానికి దిగిన కార్యకర్తను కూర్చోరా అంటూ ఏకవచనంతో మండిపడ్డారు. నియోజకవర్గంలోని ఒక్క అడ్డతీగల మండల కార్యకర్తలతోనే తనకు ఇబ్బందిగా ఉందనీ... పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండటం లేదని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు కుడుపూడి సత్తిబాబు సహా పార్టీకి మాజీ ఎమ్మెల్యేల సమక్షంలోనే ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి ఇలా రెచ్చిపోవడంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవిపై నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు భగ్గుమంటున్నారు. తనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఓ కార్యకర్తకు తాట తీస్తా అంటూ ఎమ్మెల్యే శిరీషా దేవి బహిరంగ వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం అడ్డతీగలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో పార్టీ క్యాడర్ పై  ఏక వచన పదజాలంతో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అదే సమావేశంలో పాల్గొన్న టిడిపి మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు స్పందించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలు పార్టీ అధినేత చంద్రబాబుకు తెలుసనీ... సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి అన్నారు. కార్యకర్తలు లేకపోతే టిడిపి పార్టీ లేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... నాలుగు రోజుల తర్వాత టిడిపి ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి టిడిపి కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు‌. ఎమ్మెల్యే పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  టిడిపి కార్యకర్తలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. కార్యకర్తలను సమన్వయం చేసేందుకే అలా మాట్లాడాను  తప్ప ఉద్దేశపూర్వకంగా అనలేదని ఎమ్మెల్యే శిరీషా దేవి వివరణ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అడ్డాగా ఉన్న అడ్డతీగల మండలంలో టిడిపి కార్యకర్తలు వర్గాలుగా ఉన్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తల కష్టంతోనే అంగన్వాడి టీచర్ గా ఉన్న తాను ఎమ్మెల్యే అయ్యానని పేర్కొన్నారు.

ప్రస్తుతం రంపచోడవరం నియోజకవర్గంలో 12 మండలాలు 350 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అయితే ఒక్క అడ్డతీగల మండల కార్యకర్తలతోనే తనకు సమస్య ఉందని ఎమ్మెల్యే శిరీష దేవి చెబుతున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అడ్డాగా ఉన్న అడ్డతీగల మండలంలో టిడిపి కార్యకర్తలు ఇలా గ్రూపులుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను విస్మరిస్తే ఎలా అని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక్క అడ్డతీగల మండలం మాత్రమే కాకుండా అన్ని మండలాల్లోనూ ఎమ్మెల్యే పై టిడిపి కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే భర్త విజయ భాస్కర్ వ్యవహార శైలి దీనికి కారణంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో మైనింగ్ తోపాటు అనేక వ్యవహారాల్లో ఎమ్మెల్యే భర్త పై ఆరోపణలు ఉన్నాయి.‌

ఈ క్రమంలో ఇటీవల కొందరు టిడిపి కార్యకర్తలు నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో  ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం సీరియస్ కావడంతో ఎమ్మెల్యే శిరీష దేవి ఆ కోపాన్ని కార్యకర్తలపై చూపించినట్లుగా అనుకుంటున్నారు. అయితే తాట తీస్తా అంటూ ఆమె ఇచ్చిన వార్నింగ్ పై రంపచోడవరం నియోజకవర్గం మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు భగ్గుమన్నారు. వన్ టైం ఎమ్మెల్యే అంటూ సాక్షాత్తూ టీడీపీ కార్యకర్తలే సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఏదేమైనా ఎమ్మెల్యే చివరికి కార్యకర్తలకు క్షమాపణ చెప్పడంతో ప్రస్తుతానికి రగడ చల్లారుతుందా లేదో చూడాల్సి ఉంది. అయితే రంపచోడవరం నియోజకవర్గంపై     టిడిపి అధిష్టానం స్థానిక ఎన్నికల తర్వాతే ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES