AP Rain Alert: రాత్రి తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. రెండు రోజులు ఏపీకి రెడ్ అలర్ట్
Two Days Heavy Rains In AP After Severe Depression Crossed Coast: సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ రాత్రికి కళింగపట్నం వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Andhra Pradesh Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే తీవ్ర వాయుగుండం తీరానికి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ తీవ్ర వాయుగుండం నేటి రాత్రికి తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తీరం దాటిన అనంతరం ప్రభావం అధికంగా ఉంటుందని.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గడిచిన 6 గంటల్లో గంటకు 13 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి కళింగపట్నానికి 30 కి.మీ, విశాఖపట్నానికి 90 కి.మీ, గోపాల్‌పూర్‌కు 160 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. ఇది బుధవారం రాత్రి 11-12 గంటల సమయంలో ఉత్తర కోస్తా - దక్షిణ ఒడిశా తీర ప్రాంతలైన విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ప్రకటించారు.
48 గంటలపాటు అప్రమత్తం
ఆర్టీజీఎస్‌అవేర్-విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తీవ్రవాయుగుండంపై క్షేత్రస్థాయిలోని అధికారులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికి భారీ వర్షాల కురిసే అవకాశం ఉండడంతో మరో 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర సహాయక చర్యల కోసం శ్రీకాకుళంలో 3, అల్లూరి 2, విశాఖ 2, పోలవరం 1, అనకాపల్లిలో ఒకటి మొత్తంగా 5 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత జిల్లాల్లో సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వాతావరణ సమాచారం కోసం.. సహాయం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 4250101 సంప్రదించవచ్చు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో దీని ప్రభావంతో గురువారం 24వ తేదీన పలు జిల్లాల్లో భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
భారీగా వర్షపాతం నమోదు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం సాయంత్రం 7 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో అత్యధికంగా 88.2 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక లక్ష్మీనర్సుపేటలో 73.7 మిమీ, ఎన్టీఆర్ జిల్లా పుట్రేలలో 67.6 మిమీ, రెడ్డిగూడెంలో 64.1 మిమీ, ఎ.కొండూరులో 62.8 మిమీ, ఏలూరు జిల్లా ఏదులగూడెంలో 57 మిమీ, కృష్ణా జిల్లా పెదయెరుకపాడులో 53.7 మి మీ, ఎన్టీఆర్ జిల్లా కొర్లమండలో 50.7 మి మీ, చందర్ల 49 మి మీ, శ్రీకాకుళం జిల్లా మందసలో 44.7 మి మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.