Variable Dearness Allowance: దసరా పండుగ నేపథ్యంలో లక్షలాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వ్యవసాయం, భవన నిర్మాణం, రోడ్లు, ఇతర నిర్వహణ పనుల్లో పనిచేస్తున్న కార్మికుల వేరియబుల్ డీఏ(Variable DA) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పెంపు వల్ల.. కార్మికుల నైపుణ్యం, వారు పనిచేసే ప్రాంతం (ఏరియా A, B, C) ఆధారంగా వారి కనీస వేతనాల్లో మార్పులు వచ్చాయి.
వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి సంబంధించి, ఏరియా-A పరిధిలోని నైపుణ్యం లేని కార్మికులకు ఇకపై రోజుకు కనీసం రూ.537 లభిస్తాయి. ఇందులో రూ.333 మూల వేతనంతో పాటు రూ.204 డియర్నెస్ అలవెన్స్ కలిసి ఉంటుంది. ఇదే ఏరియాలో అత్యంత నైపుణ్యం గల కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.705 గా నిర్ణయించారు. అలాగే, ఏరియా-B లోని నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు కనీసం రూ.491, ఏరియా-C లోని వారికి కనీసం రూ.486 చొప్పున వేతనం దక్కుతుంది.
రోడ్లు, రన్‌వేలు, భవనాలు, కరెంటు, నీటి పైప్‌లైన్లు, అండర్‌గ్రౌండ్ కేబుల్స్, సీవర్ లైన్ల నిర్మాణంలో పనిచేసే కార్మికులకు కూడా వేతనాలు పెరిగాయి.
ఏరియా-A లోని నైపుణ్యం లేని నిర్మాణ కార్మికుల కనీస వేతనం రోజుకు రూ.840 కి చేరగా, అత్యంత నైపుణ్యం గల కార్మికులకు రోజుకు కనీసం రూ.1,111 అందుతాయి.
ఏరియా-B పరిధిలో నైపుణ్యం లేని వారికి రూ.704, అత్యంత నైపుణ్యం గల వారికి రూ.1,024 గా నిర్ధారించారు.
ఇక ఏరియా-C లో ఈ రెండు కేటగిరీల వారికి వరుసగా రూ.565, రూ.933 చొప్పున రోజువారీ వేతనం లభిస్తుంది. సెమీ-స్కిల్డ్ మరియు స్కిల్డ్ కార్మికుల వేతనాలను కూడా వారి నైపుణ్యం, ప్రాంతం ఆధారంగా పెంచారు.
పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని, కార్మికుల రోజువారీ ఖర్చుల భారాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం ఈ డీఏను సవరిస్తుంటుంది. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) ఆధారంగా దీనిని గణిస్తారు. తాజా సవరణలో ఈ సూచీ 424.80 నుంచి 431.42 కు పెరగడంతో, ఈ 6.62 పాయింట్ల పెరుగుదల ఆధారంగానే అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త కరువు భత్యాన్ని అమలులోకి తెచ్చారు.