WION Iconic Tourism Summit 2026: దేశవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని విస్తరించేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అద్బుతంగా కృషి చేస్తున్నారని ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా అన్నారు. న్యూఢిల్లీలో రెడ్ హ్యాట్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ సహకారంతో ‘విఎఫ్ఎస్ గ్లోబల్’ (VFS Global) సమర్పణలో నిర్వహించిన ‘WION ఐకానిక్ టూరిజం సమ్మిట్ & అవార్డ్స్ 2026’ సదస్సులో ఆయన ప్రసంగించారు. పర్యాటక రంగంలోని కీలక ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ సదస్సులో రంగం భవిష్యత్, కొత్త అవకాశాలు, మారుతున్న పోకడలు, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. కపిల్ మిశ్రా గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
దేశంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌కు కపిల్ మిశ్రా ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ రూపాంతరం చెందుతోందని.. రాజధాని భవిష్యత్‌ను ఒక ప్రపంచ గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని పర్యాటక రంగాన్ని ఆహ్వానించారు. ఢిల్లీని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు ఆలోచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. పర్యాటకులకు సరికొత్త అనుభవాలను అందించే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ఒక ఐకానిక్ ‘టౌన్ హాల్’ను ఒక ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దే ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని పరిశ్రమ వర్గాలను కోరారు.
Delhi Tourism and Art & Culture Minister Kapil Mishra said India’s civilisational strength would be central to its rise on the world stage.
Speaking at the WION Iconic Tourism Summit & Awards 2026, Mishra said, "It is India’s culture that will make India a superpower. Our… pic.twitter.com/qK5S52DwsO— WION (@WIONews) September 23, 2026
పీతాంపుర హాట్‌ను పీఎం యూనిటీ హబ్‌గా మార్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్‌ను కూడా సందర్శకులకు మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. "ఇప్పుడు మనమంతా కలిసి కూర్చొని, చర్చించి, ప్రణాళికలు రచించాల్సిన సమయం ఆసన్నమైంది" అని పేర్కొంటూ ఢిల్లీ పర్యాటక రంగ తదుపరి వృద్ధి ప్రయాణంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పరిశ్రమ వర్గాలను ఆహ్వానించారు.
ఢిల్లీకి ఉన్న విభిన్నమైన చారిత్రక వారసత్వాన్ని మంత్రి కపిల్ మిశ్రా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో నగర చరిత్రకు సంబంధించి కేవలం ఒకే కోణాన్ని మాత్రమే ప్రపంచానికి ఎక్కువగా చూపించారని అన్నారు. సిక్కుల చరిత్ర, శౌర్యం, వారి త్యాగాలు, అలాగే మరాఠాల చరిత్ర, జాట్ వర్గాల పరాక్రమం కూడా ఢిల్లీకి ఎంతో ఉందని చెప్పారు. ఢిల్లీ నిర్మాణంలో అనంగ్ పాల్ తోమర్ ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈ చారిత్రక ప్రముఖులందరి స్మారకార్థం ఢిల్లీలో ప్రత్యేక స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. "భారతదేశ సంస్కృతే ఈ దేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెడుతుంది. మన నాగరికతే ప్రపంచంలోని ప్రతి గుమ్మానికి, ప్రతి ఇంటికి మనల్ని చేరుస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీ మారుతోందని.. ఆ మార్పులో పర్యాటక పరిశ్రమ పాలుపంచుకోవాలని, రాజధాని పర్యాటక వ్యవస్థ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.