Diesel Rationing: దేశంలోని ప్రైవేట్ ఇందన విక్రయ సంస్థలు.. తమ పెట్రోల్ పంపుల్లో డీజిల్ సరఫరా.. అమ్మకాలపై సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇంధన నిల్వలు నిరంతరం ఉండే విధంగా చూసేందుకు సరఫరా గొలుసులో ఎలాంటి అంతరాయం వాటిల్లకుండా ఉండేందుకు డీజిల్ విక్రయాలపై కఠినమైన పరిమితులను విధిస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త నిబంధనల ప్రకారం.. ఇక నుంచి పెట్రోల్ బంకుకు వచ్చే ప్రతీ హెవీ వెహికల్ లేదా కస్టమర్ కు ఒకేసారి గరిష్టంగా 50 లీటర్ల డీజీల్ మాత్రమే విక్రయిస్తారు. ఒక్కో ప్రైవేట్ పెట్రోల్ పంప్ నుంచి రోజువారీగా అమ్మే మొత్తం డీజీల్ లిమిట్ ను 6,000 లీటర్లకు కుదించారు. అంటే ఈ కోటా పూర్తయితే.. ఆ రోజుకి ఆ బంకులో డీజీల్ విక్రయాలను నిలిపివేస్తారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవడం, అంతర్గత సరఫరా వ్యత్యాసాల కారణంగా ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీల కంటే కొన్నిసార్లు ప్రైవేట్ బంకుల్లో ఇంధన లభ్యతపై ఆధారపడటం అనేది పెరిగిపోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంధన కొరత రాకుండా ఉండాలంటే సరుకు అంతటినీ కొద్దిమందికే విక్రయించకుండా అందరికీ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంతో ప్రైవేట్ రిటైలర్లు ఈ రేషనింగ్ విధానాన్ని తీసుకువచ్చారు.
లారీలు, మల్టీ ఆక్సిల్ ట్రక్కులు, ప్రైవేట్ బస్సులు, సుదీర్ఘ ప్రయాణాలు చేసే సరుకు రవాణా వాహనదారులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కో ట్యాంకు కెపాసిటి 200 నుంచి 400 లీటర్లు ఉంటుంది. 50 లీటర్ల పరిమితితో వారు పదే పదే బంకులకు మారాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాదు ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు కూడా ఎక్కువ మొత్తంలో డీజీల్ అవసరం అవుతుంది. ఈ నిర్ణయం వల్ల రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే జనరేటర్లు లేదా పారిశ్రామిక అవసరాల కోసం క్యాన్లలో, డ్రమ్ముల్లో పెద్ద మొత్తంలో డీజీల్ కొనుగోలు చేసేవారికి ప్రైవేట్ బంకుల్లో సరుకు దొరకడం కష్టంగా మారుతుంది. ప్రస్తుతానికి ఈ ఆంక్షలు ప్రధానంగా ప్రైవేట్ ఇంధన కంపెనీలకు మాత్రమే వర్తిస్తాయని తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ బంకుల్లో యథాతథంగా డీజీల్ సరఫరా జరుగుతున్నప్పటికీ.. ప్రైవేట్ బంకుల్లో పరిమితుల వల్ల లోడ్ అంతా ప్రభుత్వ బంకులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
అయితే సరుకు రవాణా వ్యయం పెరగడం, రవాణా ఆలస్యం కావడం వంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం త్వరలోనే ఈ విషయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రవాణా రంగ నిఫుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.