Zomato Cash on Delivery Fee: కస్టమర్లకు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షాకిచ్చింది. ఇక నుంచి క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకునే కస్టమర్ల నుంచి అదనపు రుసుము వసూలు చేయనుంది. ఈ రుసుము రూ.5 నుంచి రూ.20 వరకు ఉండనుంది. మన దేశంలో ఫుడ్ డెలివరీ వ్యవస్థలో కొన్ని సంస్థలే ఉండగా.. అందులో జొమాటో అత్యంత కీలకమైంగా ఉంది. ఇళ్లలో, ఆఫీసులలో ఉండే వినియోగదారులకు రెస్టారెంట్లను అనుసంధానిస్తూ కొంత రుసుమును వసూలు చేయడం ద్వారా ఈ సంస్థ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో చెల్లింపు పద్ధతుల ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించాలనే ఉద్దేశంతో జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది.
ఐఏఎన్ఎస్ (IANS) నివేదిక ప్రకారం.. యాప్ స్క్రీన్‌షాట్లలో సాధారణంగా ఈ ఛార్జీ ఐదు రూపాయలుగా కనిపిస్తుండగా.. కొన్ని సందర్భాల్లో వినియోగదారులకు రూ.7 లేదా గరిష్టంగా రూ. 20 వరకు విధించినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేసే కస్టమర్లకు ఈ క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ఈ సీవోడీ ఫీజు అనేది జొమాటో వసూలు చేసే సాధారణ ప్లాట్‌ఫామ్ ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, జీఎస్టీ (GST)లకు పూర్తిగా అదనం.
క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జీలు అందరికీ ఒకేలో ఉండవు. ఒక్కో వ్యక్తి, ఆర్డర్ విలువ, లోకేషన్, ఇతర అంశాల ఆధారంగా మారుతూ ఉంటుంది. ఫుడ్ డెలివరీ సమయంలో నగదు రూపంలో చెల్లించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కాగా జొమాటోకు ప్రధాన పోటీదారు అయిన స్విగ్గీ మాత్రం ఇంకా ఎలాంటి COD రుసుమును ప్రవేశపెట్టలేదు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఫుడ్ డెలివరీ ఆదాయం 37% పెరిగి రూ.3,100 కోట్లకు చేరుకుందని జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ నివేదిక వెల్లడించింది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు విధిస్తున్న ఇలాంటి అదనపు ఛార్జీలు వాటి మోనిటైజేషన్ మోడల్స్‌ను పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిరోజూ లక్షలాది ఆర్డర్ల ద్వారా ఇప్పటికే భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్న జొమాటో.. రూ.5 స్వల్ప రుసుమును పెంచినా కూడా వార్షికంగా వందల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని పొందనుంది. మార్చిలో జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ.12.50 నుంచి రూ.14.90కి పెంచిన విషయం తెలిసిందే. దీనిపై జీఎస్టీ అదనం. ఎల్పీజీ, ముడి చమురుతో సహా పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా జొమాటో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు ఆగస్టు 2023 నుంచి ప్లాట్‌ఫారమ్ ఫీజును వసూలు చేసున్నాయి. స్విగ్గీ రూ.2 ఛార్జీతో ప్రారంభించగా.. ఆ తర్వాత జొమాటో కూడా అదే బాటలో పయనించింది.
ఉద్యోగుల తొలగింపు
గత నెలలో వచ్చిన నివేదికల ప్రకారం.. జొమాటో తమ వర్క్‌ఫోర్స్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 250 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ 'కస్టమర్ డిలైట్' ఆపరేటింగ్ మోడల్, సంస్థాగత అవసరాల సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా హైదరాబాద్‌లోని తన 'కస్టమర్ డిలైట్' కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని.. మిగిలిన అంతర్గత కార్యకలాపాలన్నింటినీ గురుగ్రామ్‌లోని ఒకే చోట కేంద్రీకరించాలని జొమాటో నిర్ణయించింది.