దేశీ నిమ్మ సాగుతో కోటీశ్వరుడైన రైతు.. ఈ సమ్‌థింగ్ స్పెషల్ సక్సెస్ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
Success Story: పంటలపై తరచూ కోతులు, ఏనుగుల వంటి వన్యప్రాణుల దాడితో నష్టపోయి విసిగిపోయిన ఒడిశాకు చెందిన ఓ రైతు.. సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ఆలోచించి తన పంట పద్ధతినే పూర్తిగా మార్చుకున్నాడు
Success Story: పంటలపై తరచూ కోతులు, ఏనుగుల వంటి వన్యప్రాణుల దాడితో నష్టపోయి విసిగిపోయిన ఒడిశాకు చెందిన ఓ రైతు.. సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ఆలోచించి తన పంట పద్ధతినే పూర్తిగా మార్చుకున్నాడు. వన్యప్రాణుల నుంచి పంటలకు రక్షణగా ఉండేలా 'దేశీ నిమ్మ' (కాగ్‌జీ నిమ్మ) సాగు వైపు అడుగులు వేశాడు. కేవలం 50 నిమ్మ మొక్కలతో అత్యంత సాధారణంగా మొదలైన ఈ వినూత్న వ్యవసాయ ప్రయాణం.. కాలక్రమేణా అద్భుతమైన ఫలితాలనిచ్చింది. నేడు ఆ వ్యాపారం ఏకంగా 150 ఎకరాలకు విస్తరించింది. అంతేకాకుండా, చుట్టుపక్కల ఉండే సుమారు 500 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు కోటి రూపాయల బిజినెస్ సామ్రాజ్యంగా ఎలా మారిందో ఈ సక్సెస్ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
రైతులు తమ పంటలను నెలల తరబడి కన్నబిడ్డలా చూసుకుంటారు. కానీ కొన్నిసార్లు.. ప్రకృతి వైపరీత్యం లేదా వన్యప్రాణుల దాడి వారి కష్టాన్ని.. సంపాదనను నాశనం చేస్తాయి. అయితే.. ఒడిశాలోని ఒక రైతు కుటుంబం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అడవి ఏనుగులు, కోతులు వరి, వేరుశెనగ పంటలపై దాడి చేసి నాశనం చేసేవి. ఆ నష్టాలను భరించలేక.. ఒక కొత్త ప్రయోగానికి ప్రయత్నించారు. వన్యప్రాణులు తినని నిమ్మసాగు వైపు మళ్లారు. ఈ నిర్ణయమే.. ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేసింది. ఇప్పుడు వారి వార్షిక టర్నోవర్ కోటి రూపాయలకు పైగానే ఉంది.
ఒడిశాలోని అంగుల్ జిల్లా, ఓగి గ్రామానికి చెందిన రైతు కార్తిక్ సాహు.. సుమారు 15 సంవత్సరాల క్రితం 50 నిమ్మ చెట్లతో ఈ సాగును ప్రారంభించారు. ఆయన ఉద్యానవన శాఖ నుండి ఒక్కో మొక్కను కేవలం రూ. 2 కే కొనుగోలు చేసి, తన పొలంలో నాటారు. అవి బాగా పెరిగి, ఫలాలను ఇవ్వడం ప్రారంభించినప్పుడు, ఓగిలోని ఇతర రైతులు దాని ప్రభావాన్ని గమనించి నిమ్మ సాగు చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలోని సారవంతమైన నేల నిమ్మ సాగుకు చాలా అనుకూలంగా ఉంది. నష్టాలను నివారించుకోవడానికి ఒక కుటుంబం చేసిన ఈ ప్రయత్నం క్రమంగా గ్రామం అంతటా వ్యాపించి, ఒక పెద్ద వ్యవసాయ కార్యకలాపంగా ఎదిగింది.
సుమారు ఏడు సంవత్సరాల క్రితం కార్తీక్ సాహు మరణానంతరం.. అతని కుమారుడు సంతోష్ సాహు కుటుంబ నిమ్మ తోటను చేపట్టాడు. ఓగి గ్రామంలోని రైతులు నిమ్మకాయలు పండిస్తున్నప్పటికీ.. వాటిని కేవలం స్థానిక మార్కెట్‌లో మాత్రమే అమ్మి నష్టపోతున్నారని సంతోష్ గ్రహించాడు. వారిని పెద్ద నగరాల్లోని టోకు కొనుగోలుదారులతో అనుసంధానించాలని అతను నిర్ణయించుకున్నాడు. తన ఒక ఎకరం భూమిలో పండించిన నిమ్మకాయలతో పాటు.. సంతోష్ గ్రామంలోని 200 మందికి పైగా రైతుల నుండి నిమ్మకాయలను సేకరించి.. వాటిని ప్రధాన మార్కెట్లకు (భువనేశ్వర్, కటక్, జంషెడ్‌పూర్) సరఫరా చేయడం ప్రారంభించాడు.
"నా ఒక ఎకరంలో పండించిన నిమ్మకాయలతో పాటు, నేను గ్రామంలోని 200 మందికి పైగా రైతుల నుండి నిమ్మకాయలను టోకు మార్కెట్‌కు సరఫరా చేస్తాను. రెండు ప్రధాన పంట కాలాల్లో నా వ్యాపారం సంవత్సరానికి ₹1 కోటికి పైగా టర్నోవర్‌ను ఆర్జిస్తుంది.సంతోష్ గర్వంగా చెబుతున్నారు.
వ్యాపారం ఎలా సాగుతోంది?
ఓగి గ్రామంలోని రైతులు పండించే కాగ్జీ రకం నిమ్మకాయ దాని కాగితంలాంటి పలుచని తొక్క, చిక్కటి రసం, పులుపునకు ప్రసిద్ధి చెందింది. సంతోష్ ఈ రైతుల నుండి రూ. 10కి 100 నిమ్మకాయలు కొంటాడు. అతను 220-280 రూపాయలకు నిమ్మకాయలు పండించి.. వాటిని టోకు మార్కెట్‌లో 300-320 రూపాయలకు అమ్ముతాడు. అమ్మకం పూర్తయ్యాక.. సంతోష్ రైతులకు డబ్బు చెల్లిస్తాడు. కోటి రూపాయలకు పైగా ఉన్న అతని టర్నోవర్‌లో సుమారు 60 శాతం రైతులకే చెందుతుంది. ప్రస్తుతం, ఓగి గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు సుమారు 150 ఎకరాల్లో ఈ నిమ్మకాయలను సంతోషంగా సాగు చేస్తున్నాయి. ఒక చిన్న గ్రామంలో గొప్ప వ్యవసాయ వ్యాపారాన్ని నిర్మించిన సంతోష్ సాహు ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
Also Read: