Lal Krishna Advani: భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఉద్దండ నేత.. భారతీయ జనతా పార్టీవ్యవస్థాపక ప్రముఖులలో ఒకరైన భారతరత్న ఎల్.కె. అద్వానీ నేడు శత వసంతాల్లోకి అడుగుపెడుతున్నారు. సరిగ్గా దీపావళి పర్వదినాన ఆయన నూరవ పుట్టినరోజు జరుపుకోవడం అత్యంత విశేషం. దేశ విభజన నాటి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ.. శూన్యం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. దేశ రాజకీయాల స్వరూపాన్నే మార్చివేసిన అద్వానీ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. సైద్ధాంతిక స్పష్టత, అంకితభావం, కృషితో జనసంఘ్‌ను బలోపేతం చేయడంలోనూ, బీజేపీని అధికార దిశగా నడిపించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి ఆయన సాగించిన రాజకీయ ప్రయాణం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం.శతాయుష్కులుగా అడుగుపెడుతున్న ఈ ప్రత్యేక సందర్భాన, ఆ మహానాయకుడి జీవిత విశేషాలు, అరుదైన ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీకోసం!
శ్రీ లాల్ క్రుష్ణ అద్వానీ.. భారత రాజకీయ చరిత్రలో పరిచయం అక్కర్లేని పేరు. నేడు నవంబర్ 8వ తేదీన ఆయన శతాయుష్కుల జాబితాలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది ఆయన 100వ పుట్టిన రోజు దీపావళి పండగతో జమిలిగా రావడం విశేషమని చెప్పాలి. శ్రీరామ ప్రభువు విజయానికి, వెలుగు దివ్వెకు ప్రతీకైన ఈ పండగ సమయం జనసంఘ్ ఆవిర్భావానికి 75వసంతాలు పూర్తైన సందర్భంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి.. ఈమధ్యే ఆర్ఎస్ఎస్ శత వసంతోత్సవం నిర్వహించుకోవడం తదితరాలన్నీ ఈ ఏడాది ఆయన జన్మదినంతో ముడిపడటం విశేషం. ఆధునిక భారత చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలతో పెనవేసుకొన్న సుదీర్ఘ జీవితం అద్వానీది. 1927నవంబర్ 8వ తేదీ దేవ్ దీపావళి పర్వదినంన ఆయన జన్మించారు. 1947లో తరుణప్రాయంలోనే సింధూ ప్రాంతంలోని తన చిరపరిచిత ప్రపంచాన్ని వీడి ఎంతో వేదనను అనుభవించారు. అయినా కూడా చేదు అనుభావాలకు తావు లేకుండా శూన్యం నుంచి తన జీవిత పునరుద్దీపన చేసుకున్నారు. కఠిన పరిస్ధితుల్లోనూ ఆద్యంతం పునర్నిర్మించగల ఈ లక్షణం.. సామర్థ్యం ఆయనలో సహజాతాలు. జనసంఘ్ ను బలోపేతం చేసే వేళ, బీజేపీకి రూపు రేఖలు దిద్దే సమయాన ఆయనలోని ఈ లక్షణాలే కీలక పాత్ర పోషించాయి.
పార్టీ అధ్యక్షుడిగా బీజేపీకి సారధ్యం:
1989లో పార్టీ అధ్యక్షుడిగా బీజేపీకి సారధ్యం వహించినప్పుడు లోకసభలో కాంగ్రెస్ పార్టీ బలం 400 నుంచి 200 స్థానాలకు దిగువకు పతనం అయ్యింది. 1996లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దేశమే ప్రధానం సూత్ర ప్రాతిపదికన పార్టీకి బలమైన పునాది వేశారు అద్వానీ. అద్వానీని ఒక నాయకుడిగా విశిష్టంగా నిలిపిన రెండు కీలక అంశాలను మనం గుర్తు చేసుకోవాలి. మొదటిది.. ఆయన రచనలు, ప్రసంగాలలో ఆయన సైద్ధాంతిక స్పష్టత, మేధో పదును సుస్పష్టంగా కనిపిస్తాయి. జనసంఘ్, బీజేపీల కోసం ఆయన రూపొందించిన తీర్మానాలు ఇప్పటికీ చదవదగినవి. ఆయన ఇంటర్వ్యూలు లోతైన అంతర్దృష్టితో, సూటిగా ఉండేవి. రెండవది, భారత రాజకీయాలలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన బూటకపు లౌకికవాదాన్ని బట్టబయలు చేయడంలో ఆయనకున్న చాకచక్యం.
ఒక ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా, ఆయన మొదట రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో పనిచేశారు. అక్కడి నుండి, ఆయన జాతీయ రాజధానికి తరలివచ్చి అటల్ బిహారీ వాజ్‌పేయ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. రాజకీయ దిగ్గజాలైనప్పటికీ, వారు దశాబ్దాల పాటు శత్రువులుగా మారకపోవడం స్ఫూర్తిదాయకం. ఇద్దరూ భారత రాజకీయాల గమనాన్ని, దిశను మార్చారు.
అద్వానీ తన స్వస్థలాన్ని విడిచి ఢిల్లీకి వచ్చినప్పుడు.. ఆ నగరం ఇంకా దేశ విభజన భయం నుండి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో, ఆయన జనసంఘ్‌ను బలోపేతం చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. ఈ క్రమంలో, ఆయన 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఛైర్మన్ అయ్యారు. ఆయన పార్లమెంటరీ జీవితం 1970లో ప్రారంభమైంది. ఎంపీగా, ఆయన ఉభయ సభలలో ప్రతిపక్ష నాయకుడిగానే కాకుండా, అధికార పార్టీలో కూడా తనదైన ముద్ర వేశారు. 1991 లోక్‌సభ ఎన్నికలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.
అడ్వాణీ రెండు స్థానాలనుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ఒకటి గాంధీనగర్. గుజరాత్తో ఆయనకు అప్పటికే అనుబంధం ఉంది. దేశ విభజన తర్వాత ఆయన తండ్రి కచ్లో స్థిరపడ్డారు. అడ్వాణీ గుజరాత్ నుంచి రాజ్యసభకూ ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి, గాంధీ నగర్ లో పోటీ అంటే.. ఒకరకంగా సొంత గూటికి తిరిగి రావడం లాంటిది. బీజేపీ సంస్థలో భాగస్వామిని కాబట్టి, ఆయన సమ ర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేయడం సహా ప్రచారంలోనూ సహాయపడే గౌరవం నాకు దక్కింది. ఆ తర్వాత కూడా అక్కడి ఓటరుగా అనేకసార్లు ఆయనకు ఓటు వేసే గౌరవం లభించింది.
అద్వానీ జీవితంలో ఎమర్జెన్సీ:
ఆయన జీవితంలో ఎమర్జెన్సీ ఓ కీలక మలుపు. ప్రజా స్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ పోరాటాన్ని ఆయనముందుండి నడిపించారు. నాటి అనుభవాలను 'ఎ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్' పుస్తకంలో పంచుకున్నారు. అందులోని 'ఏ టేల్ ఆఫ్ టూ ఎమర్జెన్సీస్' అనే ఒక భాగం 1975 జూన్లో భారత్లో సంభవించిన పరిణామాలతో... 1933 నాటి నాజీ జర్మనీలోసంఘటనలకు గల అద్భుత సారూప్యాన్ని కళ్లకు కడుతుంది. అడ్వాణీ చిచ్చరపిడుగు వంటి ప్రతిపక్ష నేత. అంతేకాదు అద్భుత పరిపాలకుడు కూడా. జనతా పార్టీ 1977లో ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు ఆయన సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. అటుపైన ఉప ప్రధానమంత్రిగా, దేశంలో అత్యధిక కాలం హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించిన నేతగా దేశ భద్రత వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు. ఉగ్రవాదంపై ఆయన తీసుకున్న నిర్ద్వంద్వ వైఖరి వల్లనే భారత్ అత్యంత పటిష్ట ఉగ్రవాద నిరోధక చట్టం చేయగలిగింది.
సోమనాథ్ నుండి అయోధ్య వరకు జరిగిన రథయాత్ర:
సోమనాథ్ నుండి అయోధ్య వరకు జరిగిన రథయాత్ర అద్వానీ జీవితంలో ఒక మైలురాయి వంటిది. రథయాత్ర ప్రణాళిక నుండి పూర్తి అయ్యే వరకు అందులో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. యాత్ర ప్రారంభమైనప్పుడు సోమనాథ్‌లో ఉండటం ఒక ప్రత్యేక అనుభవం. బీహార్‌లో ఆయన అరెస్టుకు సంబంధించిన బాధాకరమైన జ్ఞాపకాలు ఇప్పటికీ నా మదిలో తాజాగా ఉన్నాయి. దీని తరువాత, గుజరాత్‌లోని చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. ఎంతోమంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఏ ధరకైనా రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. చివరకు, ఎన్నో సంవత్సరాల తరువాత, దేశ ప్రజల ఆశీస్సులతో, అయోధ్యలో శ్రీరాముని దివ్యమైన, వైభవోపేతమైన ఆలయం నిర్మించింది.
"మై కంట్రీ - మై లైఫ్" :
అద్వానీకి ఎన్నో ప్రశంసనీయమైన గుణాలు ఉన్నాయి. దానికి మొదటి ఉదాహరణ ఆయన నిరాడంబరత. నవనిర్మాణ ఉద్యమం తరువాత, ఆయన జునాగఢ్‌కు వచ్చారు. అక్కడ, కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసిన అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేస్తూ, ఒక నెలపాటు సాధారణ కార్యకర్తగా పనిచేశారు. ఆయనను తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయనను పుస్తకాల పురుగుగా అభివర్ణించేవారు. ఆయనతో సమయం గడిపిన వారికి, ఆయన వార్తాపత్రికలను ఎంత ఆసక్తిగా చదివేవారో తెలుసు. ఆయన సినిమాలు, నాటకాల అభిమాని అవ్వడమే కాకుండా, ఒక ఉద్వేగభరితమైన సినీ విమర్శకుడిగా కూడా పేరు పొందారు. అద్వానీకి ఉన్న చారిత్రక అవగాహన, దానిని పరిరక్షించాలనే ఆయన తపన ఆయన రచించిన "మై కంట్రీ - మై లైఫ్" అనే పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన ఎల్లప్పుడూ సింధీ సంస్కృతితో అనుబంధాన్ని కొనసాగించారు. లేహ్ సమీపంలో జరిగే సింధు దర్శన పూజను ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఆయన చేసిన ప్రయత్నాలలో మరొక భాగం. నేను స్వయంగా ఆయనతో, జార్జ్ ఫెర్నాండెస్‌తో కలిసి ఆ పూజలో పాల్గొన్నాను.
అద్వానీ విశిష్ట జీవితం:
అద్వానీ విశిష్ట జీవితం, ఆయన భార్య కమలా అద్వానీ గారి ప్రస్తావన లేకుండా అసంపూర్ణం. ఆయన ప్రజా జీవితమంతటా ఆమె ఒక బలమైన అండగా నిలిచారు. కరాచీలో పెరిగినప్పుడు, తన జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని అద్వానీ ఎన్నడూ ఊహించి ఉండరు. ఆయన చేసిన సేవకు కృతజ్ఞతగా, దేశ ప్రజలు 2024లో ఆయనను భారత్ రత్నతో సత్కరించారు. విశ్వవ్యాప్త ఆరాధనీయుడైన అద్వానీ తన 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో, ఆయన మంచి ఆరోగ్యంతో నిరంతరం వృద్ధి చెందుతూ, ఎప్పటిలాగే మనందరికీ స్ఫూర్తినిస్తూ ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను.
అద్వానీకి ఎన్నో ప్రశంసనీయమైన గుణాలు ఉన్నాయి. ఆయనను తెలిసిన వారందరూ ఆయనను పుస్తకాల పురుగుగా వర్ణిస్తారు. ఆయనతో సమయం గడిపేవారికి ఆయన వార్తాపత్రికలను ఎంత ఆసక్తిగా చదువుతారో బాగా తెలుసు. ఆయన సినిమా, నాటకాల అభిమాని మాత్రమే కాదు, ఒక ఉద్వేగభరితమైన సినీ విమర్శకుడు కూడా. ఆయన రాసిన 'మై కంట్రీ - మై లైఫ్' అనే పుస్తకం అద్వానీ గారి చారిత్రక ఆలోచనా విధానాన్ని, దానిని పరిరక్షించాలనే ఆయన తపనను ప్రతిబింబిస్తుంది.
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని