SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

UPI Charges Postponed: పండగ పూట వ్యాపారులకు భారీ ఊరట.. యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం వాయిదా..

UPI MDR Charges Postponed: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిపే మర్చంట్ లావాదేవీలపై ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీల అమలును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తాత్కాలికంగా వాయిదా వేసింది. రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, వ్యాపార వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛార్జీల అమలు దీపావళి తర్వాత, అంటే నవంబర్ రెండో వారం నాటికి ఉండే అవకాశం ఉందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.

Written By Harish Darla
Published: Oct 13, 2026, 12:51 PM IST | Updated: Oct 13, 2026, 03:55 PM IST
Image Credit: Source: Zee Telugu News
Join

UPI MDR Charges Postponed: పండగ సీజన్ సమీపిస్తున్న వేళ వ్యాపారులకు ఎన్‌పీసీఐ తీపి కబురు అందించింది. యూపీఐ ద్వారా జరిగే పర్సన్ - టు - మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలపై ప్రతిపాదించిన ఎండీఆర్ ఛార్జీల అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం సమావేశమైన యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఈ అంశంపై చర్చించి, నిర్ణయాన్ని ఖరారు చేసింది.

పండగ వేళ వ్యాపారుల అభ్యర్థనలను మన్నిస్తూ, దీపావళి పండగ ముగిసిన తర్వాతే ఈ ఛార్జీలను అమల్లోకి తేనున్నట్లు తెలిపింది. కచ్చితమైన అమలు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, నవంబర్ రెండో వారం తర్వాత ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

ఛార్జీల నిబంధనలు, పరిమితులు..
గత సెప్టెంబర్ నెలలో యూపీఐ స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. రూ.2,000 దాటిన మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించనున్నారు. దీని ప్రకారం వ్యాపారి ప్రతి రూ.2,000 లావాదేవీకి రూ.8, అలాగే రూ.10,000 లావాదేవీకి రూ.40 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. అయితే వ్యాపారులపై పరిమితి లేని భారం పడకుండా గరిష్ఠ ఛార్జీని రూ. 300గా నిర్ణయించారు.

అనగా రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన పెద్ద లావాదేవీలకైనా సరే గరిష్ఠంగా రూ. 300 మాత్రమే వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన వివరాల ప్రకారం, ఈ ఛార్జీల భారం వినియోగదారులపై ఎంతమాత్రం పడదు.

కీలక రంగాలు, ఉచిత సేవలు.. 
రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ ముడిసరుకులు వంటి కొన్ని ముఖ్యమైన రంగాలలో రూ. 2,000 మించిన లావాదేవీలకు ఫ్లాట్‌గా రూ. 5 మాత్రమే ఛార్జీగా విధించనున్నారు. సాధారణ వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ (పీ2పీ) డబ్బుల బదిలీలు, అలాగే ప్రతిరోజూ జరిగే చిన్న వ్యాపార లావాదేవీలు మునుపటిలాగే ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

యూపీఐ డిజిటల్ నెట్‌వర్క్ నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ చర్యలు, మోసాల నివారణ, కస్టమర్ సపోర్ట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించడానికే ఈ ఛార్జీలను ప్రతిపాదించినట్లు కేంద్రం వివరించింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES