SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బాలీవుడ్‌లోకి గరుడవేగ అంజి.. 9 భాషల్లో క్రైమ్ థ్రిల్లర్ ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్–సఫేద్ సచ్’

Unexpected Safed Sach Movie: టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ‘గరుడవేగ’ అంజి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. డెహ్రాడూన్‌లోని ఐఎస్‌బీటీ వద్ద జరిగిన అత్యాచార ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న అన్‌ఎక్స్‌పెక్టెడ్–సఫేద్ సచ్ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Written By Ashok Krindinti
Published: Nov 20, 2026, 18:36 IST | Updated: Nov 20, 2026, 18:37 IST
Image Credit: Unexpected Safed Sach Movie
Join

Unexpected Safed Sach Movie: టాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘గరుడవేగ’ అంజి.. ఇప్పుడు బాలీవుడ్‌లో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో సంజయ్ కపూర్ కీ రోల్ పోషిస్తున్నారు. కేసును విచారించే పోలీస్ అధికారి ఎస్ఎస్పీ భరత్ సింగ్‌గా ఆయన నటిస్తున్నారు. ప్రశాంత్ నారాయణన్, ఎస్తేర్ అనిల్, పృథ్వీరాజ్, తంబి రామయ్య, గంజా కరుప్పు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో పోలీస్ అధికారిగా సంజయ్ కపూర్.. గంభీరమైన లుక్‌లో ప్రశాంత్ నారాయణన్ కనిపిస్తున్నారు.

నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మహిళల భద్రత, పోలీసు దర్యాప్తు వంటి కీలక అంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. డెహ్రాడూన్‌లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ (ISBT) పరిసరాల్లో చోటుచేసుకున్న అత్యాచార ఘటన స్ఫూర్తితో ఈ సినిమా రానుంది. ఓ టీనేజ్ అమ్మాయి అదృశ్యం కావడం, రాత్రివేళ బస్సులో ప్రయాణించిన ఆమె ఆచూకీ తెలియకపోవడం చుట్టూ కథ సాగుతుంది. చివరకు పాడుబడిన బస్సు గుర్తించడం, బాధితురాలు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో కనిపించడంతో పోలీసుల దర్యాప్తు మొదలవుతుంది. ఈ కేసులో దాగి ఉన్న నిజాన్ని బయటపెట్టే క్రమంలో ఎదురయ్యే సవాళ్లే సినిమాకు హైలెట్‌గా నిలవనున్నారు.

‘గరుడవేగ’ అంజి దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. కెవిన్ రాయ్ సంగీతం అందిస్తుండగా.. ప్యారేలాల్ గుండేచా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గర్వాలీ, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి భాషల్లోనూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మొత్తం తొమ్మిది భాషల్లో తెరకెక్కుతున్న ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్–సఫేద్ సచ్’ 2027లో థియేటర్లలో విడుదల మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ గురించి సంజయ్ కపూర్ మాట్లాడుతూ.. పోలీస్ అధికారిగా నటించడం మంచి అనుభవమని తెలిపారు. మహిళల భద్రత అనేది కేవలం వార్తలకు పరిమితమైన అంశం కాదని.. సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమగ్ర దర్యాప్తు, నిజాన్ని వెలికితీయడం ఎంత ముఖ్యమో తన పాత్ర ద్వారా చూపించనున్నట్లు చెప్పారు. ప్రశాంత్ నారాయణన్ మాట్లాడుతూ.. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందే సినిమాలకు ప్రత్యేకమైన బాధ్యత ఉంటుందన్నారు. సున్నితమైన అంశాలను నిజాయితీగా తెరపై చూపించడం అవసరమని, ఈ కథలోని ఆసక్తికరమైన అంశాలు, సామాజిక సందేశం తనను ఆకర్షించాయని తెలిపారు.

నిర్మాత ప్యారేలాల్ గుండేచా మాట్లాడుతూ.. వినోదంతో పాటు సమాజంలోని ముఖ్యమైన సమస్యలపై చర్చకు తెరతీసే శక్తి సినిమాకు ఉందన్నారు. మహిళల భద్రత, న్యాయం, బాధ్యతాయుతమైన పోలీసింగ్ ప్రాధాన్యతను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు వెల్లడించారు. దర్శకుడు అంజి మాట్లాడుతూ.. ఇది సాధారణ క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదని, మహిళల భద్రత, సమాజ బాధ్యత వంటి అంశాలపై ఆలోచింపజేసే చిత్రమని తెలిపారు. ప్రేక్షకులకు ఆసక్తికరమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తూనే, ఒక ముఖ్యమైన సామాజిక అంశంపై చర్చకు అవకాశం కల్పించడమే తమ ఉద్దేశమన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES