SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్.. కార్గిల్ యుద్ధంలో సొంత సైనికుల శవాలనే తీసుకోలేదంటూ ఫైర్..!

India Slams Pakistan at UN: ఐక్యరాజ్యసమితి వేదికగా మత స్వేచ్ఛ, అంత్యక్రియల హక్కుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్న పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని భారత్ ఎండగట్టింది. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన తమ సొంత సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించడానికి నిరాకరించిన అమానవీయ చరిత్ర పాకిస్థాన్‌ది అని ఘాటుగా గుర్తు చేసింది. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 23, 2026, 06:00 PM IST | Updated: Oct 23, 2026, 06:01 PM IST
Image Credit: India Slams Pakistan at UN (Source: File)
Join

India Slams Pakistan at UN: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌ ద్వంద వైఖరిని భారత్ తీవ్ర స్థాయిలో ఎండగట్టింది. మత స్వేచ్ఛ, అంత్యక్రియల హక్కుల గురించి ప్రపంచానికి నీతులు చెబుతున్న పాకిస్థాన్.. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ సొంత సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించడానికి నిరాకరించిందని గుర్తుచేసింది. యూఎన్‌లో ‘మత స్వేచ్ఛ-నమ్మకాలు’ అంశంపై జరిగిన చర్చా వేదికలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ భావికా మంగళానందన్ ప్రసంగించారు. తన సొంత మైనారిటీలకు కూడా భద్రత కల్పించలేని దేశానికి భారత్‌కు నీతులు చెప్పే అర్హత లేదని స్పష్టం చేశారు.

"1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన తమ సొంత సైనికుల మృతదేహాలను తీసుకోవడానికి కూడా నిరాకరించిన ఒక దేశం.. నేడు విశ్వాసం, మత స్వేచ్ఛ, అంత్యక్రియల హక్కుల గురించి బహిరంగంగా ఉపన్యాసాలు ఇవ్వడం తీవ్రమైన విడ్డూరం.. నాడు పాక్ కాదనుకున్న ఆ సైనికుల మృతదేహాలకు భారత సైన్యమే పూర్తి సైనిక లాంఛనాలతో.. ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించింది." అని ఆమె గుర్తు చేశారు.

ఉగ్రవాదుల అంత్యక్రియల హక్కులను సమర్థిస్తూ ప్రత్యేక నివేదికలో పేర్కొన్న అంశాలపై భావికా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాది అనే వ్యక్తి కేవలం అమాయక ప్రజలను చంపడమే కాకుండా మొత్తం దేశ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాడని.. ఉగ్రవాదుల పక్షాన నిలబడే వాదన బాధితుల వేదనను విస్మరించడమేనని అన్నారు. చట్టపరమైన నిబంధనలు ఏవైనా దేశాల సార్వభౌమ హక్కుల మేరకే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌కు ఉన్న అనవసరపు యావను పక్కనపెట్టి.. తమ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు, రావల్కోట్ వంటి చోట్ల జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాలని హితవు ఆమె సూచించారు. పాక్‌లోని మైనారిటీల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందని.. వారి ప్రాథమిక హక్కులను నిరంతరం కాలరాస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ (HRCP) విడుదల చేసిన వార్షిక నివేదికలోనే.. అక్కడ మైనారిటీలపై జరుగుతున్న ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు, దైవదూషణ చట్టాల దుర్వినియోగం, బలవంతపు వివాహాలు, బలవంతపు మత మార్పిడుల వంటి దారుణాలు బట్టబయలయ్యాయని వివరించారు. సొంత గడ్డపై మైనారిటీల రక్షణ కూడా చూసుకోలేని ఒక దేశానికి భారత్‌కు నీతులు చెప్పే ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేశారు. ప్రజల బాధలు, నష్టాల నుంచి రాజకీయ లబ్ధి పొందడం, తమ ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి నివేదికలను వాడుకోవడం ప్రత్యేక నివేదకులకు తగదని మంగళానందన్ హెచ్చరించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES