NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) న్యూజెర్సీ విభాగం కొత్త కమిటీ ప్రకటించారు. నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్గా సాయి గంగుల ఎంపికయ్యారు. న్యూజెర్సీలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ వేదికగా అధ్యక్షుడు రాజ్ అల్లాడ ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. నాట్స్ చైర్మన్ కిశోర్ కంచర్ల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ అల్లాడ మాట్లాడుతూ.. సాయి గంగులకు అభినందనలు తెలిపారు. సాయి ఉత్సాహవంతుడు అని.. సామాజిక సేవ పట్ల అంకితభావం ఉన్న చురుకైన నాయకుడిగా పని చేస్తారని అన్నారు. న్యూజెర్సీ వ్యాప్తంగా నాట్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల మాట్లాడుతూ.. నాట్స్ ప్రస్థానంలో న్యూజెర్సీది ఎప్పుడూ ప్రత్యేక స్థానమన్నారు. నాట్స్ అభివృద్ధిలో న్యూజెర్సీ తెలుగు సమాజం చేసిన కృషిని ఆయన కొనియాడారు. న్యూజెర్సీ నుంచే ముగ్గురు నాట్స్ అధ్యక్షులు రావడం ఈ ప్రాంతానికున్న విశిష్టతకు నిదర్శనమన్నారు. తెలుగు సమాజానికి మరింత చేరువవుతూ.. సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి నాట్స్ కట్టుబడి ఉందన్నారు.
తెలుగు సంఘాల కలయికతో ఈ సమావేశం ఒక ఉత్సవంలా సాగింది. ఆప్టా, ఆత్మీయ, మాటా, తానా, టీఫాస్, ఎన్ఆర్ఐవీఏ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు, సభ్యులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేర్వేరు సంఘాలైనా.. సమాజ హితం కోసం అందరం ఒక్కటేనన్న సందేశాన్ని ఈ కలయిక బలంగా చాటింది. రాజ్ అల్లాడ నాయకత్వాన్ని అభినందించిన వక్తలు.. ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు. క్యాన్సర్ అవగాహన, ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు వంటి ప్రజాహిత కార్యక్రమాల్లో అన్ని సంఘాలు చేయి చేయి కలపాలని రాజ్ అల్లాడ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ వేడుకలో నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు బిందు యలమంచిలి, టీపీ రావు, శ్యామ్ నాళం, మురళీకృష్ణ మేడిచెర్ల, శ్రీనివాస్ భీమినేని, వంశీ కొప్పురావూరి పాల్గొన్నారు. అలాగే సంస్థ జాతీయ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న నెక్సిల్లో హెల్త్ ప్రతినిధి శశి పర్వతం, బులియన్ ఫార్చ్యూన్ ప్రతినిధి కల్యాణ్ లక్కింశెట్టి, వంశీకృష్ణ కొప్పురావూరి హాజరై తమ పూర్తి మద్దతు ప్రకటించారు. న్యూజెర్సీలోని తెలుగు ప్రజలు నాట్స్ చేపట్టే సమాజ సేవలు, కమ్యూనిటీ యాక్టివిటీస్, వాలంటీర్ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి natsnj@natsworld.org మెయిల్ ద్వారా సంప్రదించాలని కోరారు.