SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టీచర్ ఉద్యోగానికి అంత డిమాండా?.. ఫిన్‌లాండ్ ఉపాధ్యాయుల జీతాలు, సౌకర్యాల వెనుక ఉన్న నిజాలివే!

Teacher Salary: ఫిన్‌లాండ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి అత్యుత్తమ విద్యావ్యవస్థ. అయితే ఈ విజయానికి వెనుకనున్న అసలు శిల్పులు మాత్రం అక్కడి ఉపాధ్యాయులు. ఇక్కడ టీచర్ ఉద్యోగాన్ని కేవలం ఒక వృత్తిగా మాత్రమే కాకుండా.. అత్యంత గౌరవప్రదమైన స్థానంగా భావిస్తారు. డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లతో సమానంగా సామాజిక హోదా ఉన్న ఫిన్లాండ్ ఉపాధ్యాయుల ఎంపిక విధానం, వారికి ఇచ్చే లక్షల జీతాలు, సౌకర్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 08, 2026, 02:11 PM IST | Updated: Oct 08, 2026, 02:13 PM IST
Image Credit: Finland's teacher salary structure
Join

Teacher Salary: విద్యా రంగంలో ఫిన్లాండ్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా వినిపిస్తుంటుంది. ఆ దేశ విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు పంపిస్తోంది. అక్కడి పాఠశాలల్లో అమలవుతున్న విధానాలు, బోధనా పద్ధతులు, విద్యార్థులకు అందుతున్న స్వేచ్ఛ, ఉపాధ్యాయుల బాధ్యతలు వంటి అంశాలను మన టీచర్లు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తోంది. అయితే ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ నుంచి మనం నేర్చుకోవాల్సింది కేవలం పాఠాలు చెప్పే విధానం మాత్రమే కాదు. అక్కడి ఉపాధ్యాయులకు కల్పిస్తున్న గౌరవం, స్వతంత్రత, వృత్తిపరమైన స్వేచ్ఛ, శిక్షణ, పని వాతావరణం వంటి అంశాలను కూడా మన వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఫిన్లాండ్‌లో ఉపాధ్యాయ వృత్తికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. టీచర్‌గా మారడం అక్కడ అంత సులభమైన విషయం కాదు. అత్యున్నత విద్యార్హతలు, ప్రత్యేక శిక్షణ, బోధనా నైపుణ్యాలు ఉన్నవారినే ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తారు. అందుకే అక్కడ టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పే ఉద్యోగి అనే భావన ఉండదు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే నిపుణుడిగా సమాజం చూస్తుంది.

అక్కడి విద్యా వ్యవస్థలో మరో ముఖ్యమైన అంశం ఉపాధ్యాయులకు ఇచ్చే స్వేచ్ఛ. ప్రతి విషయాన్ని పైస్థాయి నుంచి నిర్దేశించి, అదే విధంగా తరగతి గదిలో అమలు చేయాలనే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయుడిని కేవలం ఆదేశాలను అమలు చేసే వ్యక్తిగా కాకుండా, తన వృత్తిలో నిపుణుడిగా పరిగణిస్తారు. తెలంగాణ టీచర్లను ఫిన్లాండ్‌కు పంపించి అక్కడి విధానాలను చూపించడం మంచి ప్రయత్నమే. అయితే అక్కడి పాఠశాలలను చూసి తిరిగి వచ్చిన తర్వాత మన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు కూడా అదే స్థాయిలో వృత్తిపరమైన స్వేచ్ఛ, గౌరవం, శిక్షణ, మెరుగైన పని వాతావరణం కల్పిస్తేనే ఆ పర్యటనల అసలు ప్రయోజనం కనిపిస్తుంది.

ఫిన్లాండ్‌లో ఉపాధ్యాయులపై ఉన్న నమ్మకం కూడా ఆ దేశ విద్యా వ్యవస్థలో కీలకమైన అంశంగా చెప్పవచ్చు. టీచర్లు తమ విద్యార్థులకు ఏ విధంగా బోధించాలి. వారి సామర్థ్యాలను ఎలా పెంచాలి అనే విషయాల్లో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉంటారు.  విద్యార్థుల మార్కుల కంటే వారి ఆలోచనా విధానం, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సామాజిక నైపుణ్యాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ విధానం వెనుక ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం.

టీచర్లకు ఎలాంటి సౌకర్యాలు ఉండాలి?
ఇక్కడే ఫిన్లాండ్ మోడల్ నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఉంది. ఉపాధ్యాయులపై బాధ్యతలు పెంచుతున్నప్పుడు వారికి అవసరమైన వనరులు, శిక్షణ, పని స్వేచ్ఛ, సౌకర్యాలు కూడా పెరగాలి. తరగతి గదిలో కొత్త పద్ధతులను అమలు చేయాలని ఆశిస్తున్నప్పుడు.. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండాలి. ఉపాధ్యాయులకు నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఆధునిక బోధనా పద్ధతులపై శిక్షణ, డిజిటల్ వనరులు, మెరుగైన పాఠశాల వాతావరణం, అవసరమైన విద్యా సామగ్రి అందించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.


అంతేకాదు.. ఫిన్లాండ్‌లో ఉపాధ్యాయుల జీతభత్యాల విషయానికి వస్తే..  వారి అర్హత, అనుభవం పనిచేస్తున్న పాఠశాల రకాన్ని బట్టి వేతనాలు మారుతుంటాయి. అక్కడ సగటున ఒక ఉపాధ్యాయుడి నెలసరి జీతం 3,000 నుండి 5,000 యూరోల వరకు ఉంటుంది. అంటే ఫిన్‌లాండ్‌లో ఒక ఉపాధ్యాయుడి నెలసరి జీతం భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2.7 లక్షల నుండి రూ. 4.5 లక్షల వరకు ఉంటుంది. (ఇది వారు బోధించే స్థాయి.. ప్రైమరీ లేదా హైస్కూల్ అనుభవాన్ని బట్టి మారుతుంది).ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల సగటు వేతనాలు.. SGT అయితే.. ప్రారంభ జీతం సుమారు రూ.35,000 నుండి రూ.45,000 వరకు ఉంటుంది.School Assistant అయితే రూ. 45,000 నుండి రూ. 55,000 వరకు ఉంటుంది. అనుభవం బట్టి మారుతుంటాయి. ఇక మన దేశంలో ఉపాధ్యాయులకు అందించే వేతనాలు ఫిన్లాండ్ తో పోల్చితే చాలా తక్కువే అని చెప్పాలి. అలాగే టీచర్లను ఇతర పనులకు కూడా ప్రభుత్వం వినియోగిస్తుంది.  

విద్యా వ్యవస్థను మార్చాలంటే ముందుగా ఆ వ్యవస్థను నడిపించే ఉపాధ్యాయుడిని బలోపేతం చేయాలి. ఫిన్లాండ్‌ నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఇదే. అక్కడి పాఠశాలలను చూడటం మాత్రమే కాదు.. అక్కడి టీచర్లకు లభిస్తున్న నమ్మకం, గౌరవం, స్వేచ్ఛ, శిక్షణ, సౌకర్యాలను కూడా అధ్యయనం చేసి, మన ఉపాధ్యాయులకు అనుగుణంగా వాటిని అమలు చేయగలిగితేనే ఈ పర్యటనలు దీర్ఘకాలిక మార్పులకు దారితీస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES