Students AI: టెక్నాలజీ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో కోడింగ్, ప్రోగ్రామింగ్ లో కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ వినియోగం ఖండాంతరాలను దాటడమే కాదు.. అనంత విశ్వంలోనూ, ఖగోళశాస్త్ర పరిశోధనల్లోనూ, ఏఐ రాజ్యమేలుతోంది. ఎల్ కేజీ, యూకేజీ విద్యార్ధులకు పాఠాల బోధనలోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకతను చాటుకుంటోంది.
పాఠ్యాంశాలను చదివి, నోట్స్ రాసుకునే విషయంలోనూ విద్యార్థులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఆధారపడుతున్నారు. డిగ్రీ, బీటెక్ స్థాయి విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు పాఠాలపై పట్టు సాధించే క్రమంలో ఏఐ సాధనాలతో అసైన్మెంట్లు, పరిశోధనాత్మక అంశాలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ రూపకల్పనకు ఏఐ సాధనాలపై ఆధారపడేవారు పెరిగిపోతున్నారు.
ఎల్‌కేజీ నుంచి గ్రాడ్యుయేట్ల దాకా ఏఐతో పాఠ్యాంశాల బోధన..
ఎల్‌కేజీ నుంచి సెకండరీ విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ వినియోగం పెరగడంతో పాఠశాల స్థాయి విద్యార్థులు మొబైల్ ఫోన్లను వినియోగించి చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఆశ్రయిస్తున్నారు. తమ పిల్లలు చిన్న వయసులోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారని ఇళ్లల్లో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఈ మురిపెం వెనుక.. చదువుకునే పిల్లలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నామనే భయంకర విషయం ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఏఐ వినియోగంతో ప్రయోజనాలపై బ్రిటన్‌లోని హయ్యర్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ సర్వే చేపట్టింది. 1,041 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 92 శాతం మంది విద్యార్థులు ఏదో ఒక రూపంలో ఏఐ ఉపయోగిస్తున్నారు. అసెస్‌మెంట్లు, అసైన్‌మెంట్ల కోసం 88 శాతం మంది జనరేటివ్ ఏఐ వినియోగించారు. 2024లో 53 శాతం అసైన్‌మెంట్ల కోసం ఏఐ వినియోగించారు. క్రమేణ ఏఐ వినియోగం పెరిగిపోతోంది. 45 శాతం మంది పాఠశాల స్థాయిలోనే ఏఐ ఉపయోగించినట్లు సర్వేలో తేలింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ నైపుణ్యాలు అవసరమని 67 శాతం మంది భావిస్తున్నారు. ఏఐ నైపుణ్యాలపై 36 శాతమే విద్యాసంస్థల నుంచి శిక్షణ పొందినవారున్నారు.
పరిశోధనాత్మక అంశాలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ రూపకల్పన..
ఏఐపై విద్యార్థులకు ఆసక్తి, వినియోగం పెరుగుతున్నా.. దాన్ని సమర్థంగా ఉపయోగించేలా శిక్షణ అందడం లేదని సర్వే ద్వారా వెల్లడైంది.టెక్నాలజీని నేర్చుకోడానికి విద్యార్థులు ఏఐను ఎంతవరకు ఉపయోగిస్తున్నారు? ఎంతమంది పిల్లలు కేవలం సమాధానాలు పొందేందుకు ఆధారపడుతున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం నిర్వహించిన ఓ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. నాలుగో తరగతి విద్యార్థులు సైతం ప్రతీ చిన్న లెక్కలను సాధన చేయడం కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నారనే అంశం ఆందోళన కలిగిస్తోందని సర్వే అభిప్రాయపడింది. గత మూడేళ్ళతో పోలిస్తే చిన్న పాటి లెక్కలకూ ఏఐని వినియోగించే వారి సంఖ్య 50 శాతం రెట్టింపు అయిందని తేలింది. భారతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో 84 శాతం మంది చదువులకు జనరేటివ్ ఏఐని ఉపయోగించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సగటు 80 శాతంగా నమోదైంది. 2023లో ప్రపంచ విద్యార్థుల్లో ఏఐ వినియోగం 40 శాతం మాత్రమే ఉండగా.. రెండేళ్లలో రెట్టింపైంది. 2023లో భారత విద్యార్థుల్లో ఏఐ వినియోగం 44 శాతంగా ఉండగా.. 2025 నాటికి 84 శాతానికి చేరింది. అంటే రెండేళ్లలో 40 శాతం పాయింట్ల పెరుగుదల నమోదైంది.
విద్యార్థులు ఏఐని ప్రధానంగా మూడు విధాలుగా వినియోగిస్తున్నారు. పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవడం, వ్యాసాలు లేదా పరిశోధన పత్రాలను సంక్షిప్తం చేయడం, అసైన్‌మెంట్లకు ఆలోచనలు పొందడం కోసం ఏఐని వాడుతున్నారు. 56 శాతం మంది విషయాలను అర్థం చేసుకోవడానికి లేదా సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవడానికి ప్రధానంగా వాడుతున్నారు. 55 శాతం మంది వేగంగా నేర్చుకోవడానికి, 35 శాతం మంది వ్యక్తిగత అభ్యాసానికి ఉపయోగిస్తున్నారు. అయితే మరోవైపు 29 శాతం మంది విద్యార్థులు ఏదైనా అంశం లేదా అసైన్‌మెంట్ విషయంలో సందేహం వచ్చినప్పుడు ముందుగా ఏఐనే ఆశ్రయిస్తున్నారు. ఉచిత ఆన్‌లైన్ వనరులు, స్నేహితులు, పాఠ్యాంశాల కంటే ఏఐ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో విద్యార్థులకు ఏఐ ఒక అభ్యాస సాధనంగా మారుతోందా? స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని తగ్గిస్తోందా? అనే ఆందోళన కేంద్ర పరిశోధన సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.
విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్..
ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ.. దాని సమాధానాలపై విద్యార్థులకు పూర్తి విశ్వాసం లేదని పరిశోధనలో తేలింది. సర్వేలో ఏఐ ఇచ్చే సమాచారం తప్పుగా ఉండొచ్చని 53 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని ఉపయోగించని విద్యార్థుల్లో 38 శాతం మంది కూడా తప్పుడు సమాచారం వస్తుందనే భయంతో దూరంగా ఉన్నారు. 50 శాతం మంది విద్యా అవసరాలకు ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ సాధనాలు కావాలని కోరుతున్నారు. 49 శాతం మంది సమాధానాల్లో మానవ నిపుణుల భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. 38 శాతం మంది డేటా గోప్యతకు రక్షణ అవసరమని పేర్కొన్నారు. విద్యార్థుల ఏఐ వినియోగంపై తరగతి వారీగా అధ్యయనం, ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు డిజిటల్ భద్రతపై అవగాహన, ఏఐ ఆధారిత అసెస్‌మెంట్ విధానాలు అభివృద్ధి చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
ఇళ్లల్లో చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులు.. హోంవర్క్ పై ప్రత్యేక దృష్టిపెట్టి పిల్లలచేత స్వయంగా రాసేందుకు అవకాశమివ్వాలి. అంతేగానీ సులభంగా లెక్కల సాధన కోసం, పాఠ్యాంశాల అధ్యయనానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకానికి దూరంగా పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఛాట్ జీపీటీతో లెక్కలు సాధన చేయించడం, ప్రతి అంశానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకానికి అలవాటు చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో.. )