పెరిగిన కాలుష్యం.. ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం..! నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సహా కఠిన నిబంధనలు అమల్లోకి!
రాబోయే మరికొన్ని రోజుల్లో శీతాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో, వాయు కాలుష్యాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. ఈ వింటర్ యాక్షన్ ప్లాన్ అమల్లోకి తీసుకువచ్చింది. నగరంలో పెరుగుతున్న గాలి కాలుష్యాన్ని నివారించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి భాగంగా నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగా డబుల్ పార్కింగ్ ఛార్జీల విధింపుతో పాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Winter Pollution Action Plan: మన దేశంలోనే ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రాజధాని నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు అమలు చేయబడే ఈ కఠిన నిబంధనల ప్రకారం, DMRC ప్రాంతంలో పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా లేని, సరైన టెస్టింగ్ నిర్వహించని పాత వాహనాలు నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు రాజధాని నగరంలో ప్రవేశించకుండా కఠినమైన ఆంక్షలు విధింంచింది. అయితే, ఇది ఢిల్లీ మెట్రో పరిధిలోని స్థానిక వాహనదారులకు వర్తించదు.
ఢిల్లీ వింటర్ యాక్షన్ ప్లాన్ ముఖ్య అంశాలు ఇవే:
డబుల్ పార్కింగ్ ఛార్జీలు:
రోడ్లపై ప్రైవేట్ వాహనాల రాకపోకలను, వాటి ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం అధికారులకు ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు వాహనాల పార్కింగ్ విషయంలో డబుల్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ డబుల్ పార్కింగ్ ఛార్జీల నిబంధన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) యాజమాన్యంలోని పార్కింగ్ సౌకర్యాలకు మాత్రం వర్తించదు.
కార్యాలయ పని వేళల్లో మార్పులు:
వాహనాల ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్యాలయాల పని వేళలను సవరించింది. సాధారణంగా ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే పని వేళలను, నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఉండేలా ప్రభుత్వం మార్పులు చేసింది. దీనివల్ల రద్దీ సమయాల్లో రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్..
ట్రాఫిక్, వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాలకు వెళ్లే వారి సంఖ్యను తగ్గించడానికి, ఉద్యోగులకు 50 శాతం వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించింది. మిగిలిన సగం ఉద్యోగులు కార్యాలయానికి వచ్చేలా అనుమతి ఇచ్చింది, తద్వారా ప్రయాణాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.
అంతేకాదు, పర్యావరణ నిబంధనలను పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ (PUC) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపడాన్ని నిషేధించారు. ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
మరోవైపు, కాలుష్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. కొత్తగా నిర్మించిన లేదా కూల్చివేసిన నిర్మాణ స్థలాల వద్ద పర్యావరణ కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి ఏఐ ఆధారిత మానిటరింగ్ వ్యవస్థను అమలు చేస్తోంది. ఇది కూడా వింటర్ యాక్షన్ ప్లాన్‌లో ఒక ముఖ్యమైన భాగం.
ప్రభుత్వం పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని పెంచుతోంది. అలాగే, మెట్రో కనెక్టివిటీని, కార్-పూలింగ్ పద్ధతులను ప్రజలు ఎక్కువగా ఉపయోగించేలా ప్రోత్సహిస్తోంది. ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించి, వాటి ద్వారా వెలువడే ఉద్గారాలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు వింటర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా కీలక పాత్ర పోషిస్తాయి.