Government Jobs: తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. 25 ఏళ్ల నాటి నిబంధనకు స్వస్తి..!
Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇద్దరికి మించి పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని 25 ఏళ్ల నాటి నిబంధనను ఎత్తివేసింది. ఇకపై ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు ఇలా..
Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన నిబంధనల్లో మధ్యప్రదేశ్ సర్కార్ కీలక మార్పులు చేసింది. నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కుటుంబ నియంత్రణ నిబంధనల విషయంలో తీపి కబురు అందించింది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులనే నిబంధనను తొలగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో ఇకపై ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అవకాశం కలగనుంది.
మధ్యప్రదేశ్‌లో 2001లో అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిబంధనను తీసుకొచ్చింది. దీని ప్రకారం 2001 జనవరి 26 తర్వాత మూడో సంతానం కలిగినవారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయేవారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు మాత్రమే కాకుండా.. ఇప్పటికే విధుల్లో ఉన్న ఉద్యోగులపైనా ఈ నిబంధన వర్తించేది. ఇద్దరికి మించి పిల్లలు ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఈ నిబంధనపై ఇటు ఉద్యోగులు, అటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది.
తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారికి కూడా ప్రయోజనం కలగనుంది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నారనే ఒక్క కారణంతో పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ కేసులను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కారణంతో ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగిస్తూ.. తుది ఉత్తర్వులు జారీ చేసిన కేసులను మాత్రం తిరిగి తెరవబోమని స్పష్టం చేసింది. అంటే పెండింగ్‌లో ఉన్న కేసులకు మాత్రమే తాజా నిర్ణయం వర్తించనుంది.
కాగా.. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారిపై ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో విధించిన పరిమితులను కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సడలించాయి. ఛత్తీస్‌గఢ్ 2017లోనే ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన ఇలాంటి నిబంధనను తొలగించింది. రాజస్థాన్ కూడా కొన్ని వర్గాలకు మినహాయింపులు కల్పిస్తూ మార్పులు చేసింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఈ కోవలోకి చేరింది.