Avenue Towers Flats: జీ న్యూస్‌కు స్పందన.. తప్పును అంగీకరించి సరిదిద్దుకున్న ఎన్‌బీసీసీ
Avenue Towers Flats Auction: తీవ్ర వివాదాస్పదమైన ఢిల్లీలోని సరోజినీనగర్ అవెన్యూ టవర్స్‌లోని ప్లాట్ల వేలంపై ఎట్టకేలకు ఎన్‌బీసీసీ తన తప్పును అంగీకరించింది. ఈ సందర్భంగా తన తప్పును సరిదిద్దుకుంది. జీ న్యూస్ కథనాలకు స్పందించిన ఎన్‌బీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
Zee News Effect: ఢిల్లీలోని సరోజినీనగర్ అవెన్యూ టవర్స్‌లోని ఫ్లాట్ల వేలాన్ని రద్దు చేస్తూ ఎన్‌బీసీసీ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవగా.. ఈ వ్యవహారంపై జీ న్యూస్ స్పందించి కథనాలు ప్రచురించింది. జీ న్యూస్ వార్త పెద్ద ప్రభావాన్ని చూపింది. ఈ విషయంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌బీసీసీ తన తప్పును అంగీకరించి సరిదిద్దుకుంది. అంతకుముందు ఫ్లాట్ల వేలం రద్దు విషయంలో కోర్టులో ఎలాంటి కోర్టు కేసులు లేవని కొట్టిపారేసిన ఎన్‌బీసీసీ.. ఇప్పుడు ఒక కొత్త సవరించిన నోటీసును జారీ చేసింది. కొన్ని యూనిట్లకు సంబంధించిన కేసు ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని.. కొత్త కొనుగోలుదారులు తమ సొంత రిస్క్‌తో ఈ వేలంలో పాల్గొనవచ్చని కొత్త కొనుగోలుదారులకు స్పష్టం చేసింది.
ఎన్‌బీసీసీ జారీ చేసిన కొత్త సమాచారం ప్రకారం.. 'పరిపాలనా కారణాలతో అక్టోబర్ 28, 2026న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా గత ఈ-వేలంలో 49 ఫ్లాట్ల బిడ్లను ఎన్‌బీసీసీ రద్దు చేసింది. ఇప్పుడు ఆ 49 ఫ్లాట్లను కొత్త వేలంలో మళ్లీ చేర్చినట్లు ఎన్‌బీసీసీ స్పష్టం చేస్తోంది. ఆ 49 ఫ్లాట్లలో కొన్ని యూనిట్లకు సంబంధించి బిడ్డర్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ బిడ్లు రద్దు చేయడాన్ని వారు సవాలు చేశారు. కాబట్టి, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు తమ స్వంత విచక్షణతో వేలంలో పాల్గొనాలని ఎన్‌బీసీసీ హెచ్చరిస్తోంది. ఒకవేళ ఏదైనా నష్టం లేదా క్లెయిమ్ జరిగితే.. దానికి ఎన్‌బీసీసీ బాధ్యత వహించదు'. దీనికి ముందు నవంబర్ 6వ తేదీన ఈ ఫ్లాట్ల కొత్త వేలం కోసం దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు.. ఎన్‌బీసీసీ ఈ సమాచారాన్ని కొత్త కొనుగోలుదారుల నుంచి దాచిపెట్టింది. భూమి లేదా ఆస్తికి సంబంధించి ఎలాంటి కోర్టు కేసు పెండింగ్‌లో లేదని అప్పట్లో ఎన్‌బీసీసీ పేర్కొంది. అయితే వాస్తవానికి సరిగ్గా దానికి ఒక్క రోజు ముందు నవంబర్ 5వ తేదీనే కొందరి పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఎన్‌బీసీసీకి నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.
కొత్త వేలానికి సంబంధించి ఎన్‌బీసీసీ జారీ చేసిన నోటీసులో.. అత్యధిక బిడ్లు వేసిన వారికి కొత్త వేలంలో పాల్గొనే అవకాశం ఉండదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎన్‌బీసీసీ ఒక కొత్త సవరణ పత్రాన్ని జారీ చేసింది. తాము విజయవంతమైనవిగా పరిగణించిన వ్యక్తులకు మాత్రమే కొత్త వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అత్యధిక బిడ్లు వేసి హైకోర్టును ఆశ్రయించిన ఆ వ్యక్తులకు మళ్లీ వేలంలో పాల్గొనే మార్గం తెరుచుకుంది. ఈ కొనుగోలుదారుల తరఫున ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో.. తాము వేలంలో అత్యధిక బిడ్ వేసినట్లు పేర్కొన్నారు. ఇది ఎన్‌బీసీసీ నిర్ణయించిన రిజర్వ్ ధరకంటే ఎక్కువ. అయినప్పటికీ వారి వేలం రద్దు చేసింది. వేలం రద్దు చేయడానికి ఎన్‌బీసీసీ సరైన కారణం కూడా చెప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పులలోని మార్గదర్శకాలను ఉదహరిస్తూ జీ న్యూస్ తన రిపోర్ట్‌లో దీనిపై ప్రశ్న లేవనెత్తింది.
అయినప్పటికీ ఎన్‌బీసీసీ వైఖరిపై కోర్టులో ఇంకా అనేక ప్రశ్నలు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు కొత్త వేలం ప్రక్రియను ఎందుకు ప్రారంభించారని కొనుగోలుదారుల తరఫు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. బుధవారం జరిగిన విచారణలో హైకోర్టులో కొనుగోలుదారుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నవంబర్ 5వ తేదీన హైకోర్టు విచారణ జరిపినప్పుడు మీరు ఏం చేయబోతున్నారని కోర్టు ఎన్‌బీసీసీని నేరుగా ప్రశ్నించిందని, అయితే అప్పుడు ఎన్‌బీసీసీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు. కానీ విచారణ జరిగిన మరుసటి రోజే కేవలం 24 గంటల్లోనే ఆ 49 ఫ్లాట్ల వేలాన్ని మళ్లీ ప్రారంభించారని వెల్లడించారు. కొత్త వేలం ప్రక్రియపై కూడా స్టే విధించాలని కొనుగోలుదారులు కోరారు. ఈ విషయంలో పరిస్థితిని మరింత దిగజార్చవద్దని ఎన్‌బీసీసీని హైకోర్టు కూడా హెచ్చరించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై సమగ్ర సమాధానం దాఖలు చేస్తామని ఎన్‌బీసీసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ నవంబర్ 26వ తేదీన జరగనుంది. ఆ రోజున ఎన్‌బీసీసీ ప్రారంభించిన కొత్త వేలం ప్రక్రియపై స్టే విధించాలా వద్దా? అనే దానిపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.