Soft Chapati Tips: చపాతీలు మెత్తగా, రుచిగా రావడం కోసం పిండి కలిపే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. ఇంట్లో చేసిన చపాతీలు గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా, పొంగి రావాలంటే ఏం చేయాలి? పిండి కలిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పిండిని ఎంతసేపు ఉంచాలి? చపాతీలు మెత్తగా ఉండేందుకు ఉపయోగపడే సింపుల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
1/5
హోటల్ స్టైల్ చపాతీ
చపాతీ ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటి. కూర, పప్పు, పెరుగు ఇలా ఏదితో తిన్నా చపాతీ రుచిగా ఉంటుంది. అయితే ఇంట్లో చపాతీలు చేసినప్పుడు కొన్నిసార్లు అవి గట్టిగా మారిపోతుంటాయి. ఎంత ప్రయత్నించినా హోటల్‌లో దొరికేంత మెత్తగా రావడం లేదని చాలామంది అనుకుంటారు. కానీ పిండి కలిపే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేస్తే చపాతీలు చాలా సాఫ్ట్‌గా వచ్చేలా చేసుకోవచ్చు.
2/5
చపాతీ రెసిపీ
ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒకేసారి ఎక్కువ నీటిని పోయకుండా కొద్దికొద్దిగా గోరువెచ్చని నీటిని పోస్తూ పిండిని కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి సరైన స్థాయిలో కలుస్తుంది.
3/5
గోధుమ పిండి చపాతీ
చపాతీలు మరింత మెత్తగా ఉండాలంటే పిండిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పాలు కలపవచ్చు. పిండి ముద్దగా మారిన తర్వాత ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి మరోసారి బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు. అదే సమయంలో చాలా జిగురుగా కూడా ఉండకూడదు. చేతికి మృదువుగా అనిపించేలా పిండిని సిద్ధం చేసుకోవాలి.
4/5
చపాతీ టిప్స్
పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయడం కంటే కొంత సమయం పక్కన పెట్టడం మంచిది. పిండిపై కొద్దిగా నూనె రాసి మూతపెట్టి సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి మెత్తగా మారి చపాతీలు కూడా సాఫ్ట్‌గా వస్తాయి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న సమాన భాగాలుగా చేసుకుని ఉండలు చేసుకోవాలి. ప్రతి ఉండను కొద్దిగా పొడి పిండి అద్దుకుని పలుచగా రుద్దాలి. కావాలంటే రుద్దిన చపాతీని మడిచి మళ్లీ రుద్దుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చపాతీలో మంచి పొరలు ఏర్పడి, కాల్చినప్పుడు మరింత మెత్తగా ఉంటుంది.
5/5
మెత్తటి రొట్టెలు
చివరగా పెనాన్ని బాగా వేడి చేసి చపాతీని వేయాలి. ఒకవైపు చిన్న బుడగలు కనిపించినప్పుడు తిప్పాలి. మరోవైపు కూడా కాలిన తర్వాత మళ్లీ తిప్పి తేలికగా ఒత్తితే చపాతీ బాగా పొంగుతుంది. పెనం నుంచి తీసిన వెంటనే కొద్దిగా నెయ్యి రాసి మూత ఉన్న గిన్నెలో పెట్టాలి. ఇలా చేస్తే చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. ఇంట్లో చపాతీలు చేసేటప్పుడు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మంచి సాఫ్ట్ చపాతీలు తయారు చేసుకోవచ్చు.