SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

India vs New Zealand Score: కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ.. శుభ్‌మన్ గిల్ బ్యాడ్‌లక్.. న్యూజిలాండ్‌పై భారత్‌ భారీ ఆధిక్యం..!

IND vs NZ 3rd Day Highlights: కివీస్‌పై మొదటి టెస్ట్‌లో భారత్ పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 486 రన్స్ చేయగా.. 118 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కేఎల్ రాహుల్ శతకం బాదగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Written By Ashok Krindinti
Published: Nov 21, 2026, 15:13 IST | Updated: Nov 21, 2026, 15:15 IST
Image Credit: India vs New Zealand Score (Source: BCCI/X)
Join

IND vs NZ 3rd Day Highlights: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు దుమ్ములేపారు. ఓవర్‌నైట్ స్కోరు నుంచి భారీ ఇన్నింగ్స్ నిర్మించిన భారత ఆటగాళ్లు కివీస్ బౌలర్లతో ఆడుకున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ ( 136) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98) రెండు పరుగుల దూరంలో శతకాన్ని చేజార్చుకున్నాడు. రిషభ్ పంత్ కూడా మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. క్రీజ్‌లో పంత్ (55 నాటౌట్)తోపాటు అన్షుల్ కాంబోజ్ (0)‌ ఉన్నారు.

ఓవర్‌నైట్ కేఎల్ రాహుల్, పడికల్ (80) మూడో రోజు కూడా సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కివీస్ బౌలర్లను పరీక్ష పెడుతూ పరుగులు రాబట్టారు. అయితే పడికల్‌ను జెమీసన్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో 165 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ గిల్.. కేఎల్ రాహుల్‌తో జత కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. గిల్ కాస్త వేగంగా ఆడగా.. కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూనే స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మొత్తం 290 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. టెస్టు కెరీర్‌లో ఇది అతడికి 13వ సెంచరీ. న్యూజిలాండ్ గడ్డపై ఇదే తొలి టెస్టు శతకం. రాహుల్-గిల్ జోడి మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించింది. ఈ ఇన్నింగ్స్‌తో రాహుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాల్లో టెస్టు సెంచరీలు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్, మహమ్మద్ అజారుద్దీన్, రాహుల్ ద్రవిడ్ ఈ ఘనత సాధించాడు.

రిషభ్ పంత్‌తో కలిసి గిల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ 146 బంతుల్లో 98 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔట్ అయి నిరాశగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. మూడో రోజు ఆఖరి ఓవర్‌ మూడో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. జాకబ్ డఫీ వేసిన బంతి అనూహ్యంగా లోపలికి దూసుకొచ్చి.. గిల్ బ్యాట్‌ను దాటిన బంతి ప్యాడ్‌కు తగిలి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. దీంతో తృటిలో 12వ సెంచరీ చేజార్చుకున్నాడు. మరోవైపు రిషభ్ పంత్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. మొదట నెమ్మదిగా ఆడినా.. క్రీజ్‌లో కుదురుకున్న తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గిల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

మూడో రోజు ఆటలో భారత్ ఏకంగా 327 పరుగులు సాధించింది. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది. నాలుగో రోజు ఆటలో మరిన్ని పరుగులు జోడించి న్యూజిలాండ్‌పై భారీ ఆధిక్యం సాధించాలని టీమిండియా భావిస్తోంది.  

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES