SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మరోసారి ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక

Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్‌గా వరుసగా రెండోసారి జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. పోటీ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. దీంతో ప్రపంచ క్రికెట్‌లో జై షా నాయకత్వం మరో రెండేళ్లపాటు కొనసాగనుంది.

Written By Ashok Krindinti
Published: Nov 16, 2026, 13:55 IST | Updated: Nov 16, 2026, 13:57 IST
Image Credit: Jay Shah (Source: File)
Join

Jay Shah: ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న జై షా.. మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. ఐసీసీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లు ఆయన పేరును ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా ఆయన ఎన్నియ్యారు. ఇతర దేశాల బోర్డుల నుంచి పోటీ లేకపోవడంతో రెండోసారి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నియమాకాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడంతో పాటు.. అభిమానుల సంఖ్యను పెంచడం, వాణిజ్యపరంగా క్రికెట్‌ను బలోపేతం చేయడం దిశగా ఐసీసీ అడుగులు వేస్తోంది. 2024 డిసెంబర్ 1న తొలిసారి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తాజాగా రెండోసారి కూడా అధ్యక్షుడిగా అవకాశం దక్కడంతో అంతర్జాతీయ క్రికెట్ పాలనలో ఆయన పాత్ర మరింత కీలకం కానుంది.

రాబోయే రోజుల్లో క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ ముందున్న అతిపెద్ద లక్ష్యాల్లో 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ ఒకటి. దాదాపు 128 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్ ఒలింపిక్స్‌లోకి తిరిగి ప్రవేశించనుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొత్త దేశాలకు క్రికెట్‌ను పరిచయం చేయాలని.. ముఖ్యంగా యువతను క్రికెట్‌వైపు ఆకర్షించాలని ఐసీసీ భావిస్తోంది. రెండోసారి ఛైర్మన్‌గా ఎన్నికైన అనంతరం జై షా మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచిన ఐసీసీ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఛైర్మన్ బాధ్యతలు నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నానని, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి సభ్య దేశాలతో కలిసి పనిచేస్తానని అన్నారు.

కేవలం అంతర్జాతీయ టోర్నమెంట్ల నిర్వహణకే పరిమితం కాకుండా.. క్రికెట్‌కు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించాల్సిన అవసరం ఉందని జై షా అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లు, అభిమానులు, వాణిజ్య భాగస్వాములకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెడతానని తెలిపారు. మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడం, అసోసియేట్ దేశాలకు అవకాశాలు పెంచడం, అంతర్జాతీయ క్రికెట్‌లో పారదర్శకతను కాపాడటం వంటి అంశాలు కూడా ఐసీసీ భవిష్యత్తు ప్రణాళికల్లో కీలకంగా ఉండనున్నాయి. మొత్తానికి రెండోసారి ఐసీసీ పగ్గాలు చేపట్టిన జై షాకు రాబోయే రెండేళ్లు అత్యంత కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీ, ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు ఆదరణ పెంచడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా చెప్పవచ్చు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES