SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Cricket News: సెంచరీ కొట్టి జేబులో నుంచి చిట్టీ.. స్టార్ బ్యాట్స్‌మెన్ ఎమోషనల్ సెలబ్రేషన్ వెనుక అసలు కథ..!

Litton Das Emotional Celebrations: సెంచరీ పూర్తి కాగానే ఎమోషనల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్. శతకం బాదిన వెంటనే జేబులో నుంచి ఓ చిట్టీ తీసి చూపించగా.. అందులో ఉన్న సందేశం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Nov 18, 2026, 18:33 IST | Updated: Nov 18, 2026, 18:35 IST
Image Credit: Litton Das Emotional Celebrations (Source: X)
Join

Litton Das Emotional Celebrations: క్రికెట్‌లో సెంచరీలు చేయడం ఆటగాళ్లకు కొత్తేమీ కాదు. కానీ కొన్ని శతకాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ చేసిన సెంచరీ కూడా అలాంటిదే.. తన బ్యాట్‌తో పరుగుల వరద పారించిన ఈ బ్యాట్స్‌మెన్.. సెంచరీ పూర్తికాగానే జేబులో నుంచి ఓ చిన్న కాగితం తీసి చూపించాడు. అందులో ఉన్న సందేశం చూసి అభిమానులు ఫిదా అయ్యారు. తన మూడేళ్ల కూతురు అనైరా పుట్టినరోజు సందర్భంగా ఈ శతకాన్ని ఆమెకు అంకితం చేశాడు. ఆ ప్రత్యేక సెలబ్రేషన్ వెనుక ఉన్న కారణాన్ని కూడా వెల్లడించాడు.

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ మైదానంలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు లిటన్ దాస్ తన 8వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అయితే ఈ మైలురాయిని చేరుకున్న వెంటనే లిటన్ దాస్ చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. జేబులో దాచుకున్న ఓ చిన్న కాగితాన్ని బయటకు తీసి చూపించాడు. ఆ కాగితంపై 'హ్యాపీ బర్త్‌డే మై ప్రిన్సెస్.. ఈ సెంచరీ నీ కోసమే' అనే సందేశం ఉంది. లిటన్ దాస్ కూతురు అనైరా ఇటీవలే మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సెంచరీని ప్రత్యేక కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఈ సెలబ్రేషన్ కోసం లిటన్ దాస్ ముందుగానే సిద్ధమయ్యాడు. రెండో రోజు ఉదయం  92 పరుగులతో క్రీజులో ఉన్న సమయంలో బంగ్లాదేశ్ జట్టు సిబ్బందిలో ఒకరితో ఆ సందేశాన్ని కాగితంపై రాయించుకున్నాడు. మరో 8 పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుందనే నమ్మకంతో ముందుగానే ఆ ఏర్పాట్లు చేసుకున్నాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే.. తన కూతురిని చాలా మిస్ అవుతున్నానని లిటన్ దాస్ చెప్పాడు. భవిష్యత్ గురించి సానుకూలంగా ఆలోచిస్తే మంచి విషయాలు జరుగుతాయని.. ముందు రోజు రాత్రే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించాడు.

ఇదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్షెస్ అకెర్మన్ కూడా తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అతడు 157 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అకెర్మన్ 95 పరుగుల వద్ద ఔటై తొలి శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈసారి మాత్రం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. తన సెంచరీ సమయంలో ప్రత్యేకంగా ఎలాంటి సెలబ్రేషన్ ప్లాన్ చేసుకోలేదని.. కుటుంబ సభ్యులు గ్రౌండ్‌లో ఉండటంతో ఆ క్షణం మరింత ప్రత్యేకంగా అనిపించిందని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అకెర్మన్ 157 పరుగులతో ఆ జట్టును పోటీలోకి తీసుకొచ్చాడు. వచ్చే ఏడాది లార్డ్స్‌ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలన్న బంగ్లాదేశ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి ఈ సిరీస్ కీలకంగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES