SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mirabai Chanu Asian Games: 28 ఏళ్ల కల నెరవేరిన వేళ..ఆసియా గేమ్స్‌లో వెండి పతకాన్ని సాధించిన మీరాబాయి చాను!

Mirabai Chanu Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడలు 2026లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుత ప్రదర్శనతో రజత (సిల్వర్) పతకాన్ని కైవసం చేసుకుంది. నగోయాలో జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో ఆమె మొత్తం 198 కేజీల బరువు పైకి ఎత్తి ఈ మెడల్ సాధించారు. 1998లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం గెలిచిన తర్వాత, ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో 28 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Written By Harish Darla
Published: Sep 23, 2026, 01:35 PM IST | Updated: Sep 23, 2026, 01:49 PM IST
Join

Mirabai Chanu Asian Games 2026: జపాన్‌లోని నగోయా వేదికగా సెప్టెంబర్ 23 బుధవారం జరిగిన ఆసియా క్రీడలలో భారత వెయిట్‌లిఫ్టింగ్‌కు సరికొత్త చరిత్ర నమోదైంది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో తీవ్ర పోటీలోనూ సిల్వర్ మెడల్‌ను గెలుచుకుంది.

మీరాబాయి చాను పాల్గొన్న వెయిట్ లిఫ్టింగ్ పోటీ వివరాల్లోకి వెళితే.. స్నాచ్ విభాగంలో మీరాబాయి చాను మొదటి ప్రయత్నంలో 83 కేజీల బరువు ఎత్తి పోటీని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన రెండు రౌండ్లలో వరుసగా 85 కేజీలు, 87 కేజీలను విజయవంతంగా పైకి ఎత్తి, పోటీ మొదటి సగభాగాన్ని మూడవ స్థానంలో నిలిచి ముగించారు.

అంతిమంగా స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు కలిపి మొత్తం 198 కేజీల అత్యుత్తమ ప్రదర్శనతో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. గతంలో రెండుసార్లు తృటిలో ఆసియా క్రీడల పతకాన్ని కోల్పోయిన మీరాబాయి, ఈసారి పట్టుదలతో శ్రమించి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

మరోవైపు, ఈ విభాగంలో ఉత్తర కొరియాకు చెందిన రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ రీ సాంగ్ గమ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించారు. ఆమె స్నాచ్‌లో 94 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 121 కేజీలతో కలిపి మొత్తం 215 కేజీల బరువు ఎత్తి రికార్డు ప్రదర్శన నమోదు చేయడమే కాకుండా, ఆసియా క్రీడల టైటిళ్లలో హ్యాట్రిక్ పూర్తి చేశారు.

ఈ విజయంతో భారత్‌లో వెయిట్‌లిఫ్టింగ్ రంగానికి ఎంతో కాలంగా ఉన్న ఆసియా క్రీడల పతకాల నిరీక్షణకు తెరపడింది. 1998 ఆసియా క్రీడల్లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం గెలిచిన నాటి నుంచి భారత వెయిట్‌లిఫ్టర్లకు ఈ క్రీడల్లో పతకం దక్కలేదు. మీరాబాయి చాను సాధించిన ఈ రజతం భారత క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలిచింది.

మీరాబాయి చాను మరో ఘనత
మీరాబాయి చాను ఖాతాలో ఇప్పటికే ఒలింపిక్ రజత పతకం, ఒక స్వర్ణంతో కలిపి మూడు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు, పలు కామన్వెల్త్ గేమ్స్ అలాగే కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లతో పాటు ఒక ఆసియా ఛాంపియన్‌షిప్ కాంస్య పతకం ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చేరిన ఆసియా క్రీడల రజత పతకంతో ఆమె పతకాల సేకరణ మరింత సంపూర్ణమైంది.

Also Read: US Open Final 2026: యూఎస్ ఓపెన్‌లో సంచలనం..సబాలెంకాను ఓడించిన కజకిస్థాన్ రిబాకినా..

Also REad: డబుల్ సెంచరీతో అలరించిన ఇషాన్ కిషన్..31 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES