Vaibhav Sooryavanshi: బుడ్డోడు చితక్కొట్టాడు.. 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు..!
Vaibhav Sooryavanshi Century: సంచలన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వైభవ్ సూర్యవంశీ.. మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. ఈసారి ఏకంగా ప్రపంచ రికార్డునే బద్దలు కొట్టాడు. కేవలం 28 బంతుల్లోనే శతకం సాధించి లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Vaibhav Sooryavanshi Century: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలన ప్రదర్శన చేశాడు. గ్రౌండ్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఈ యువ సంచలనం.. ఈసారి ఏకంగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దోహా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఈ అద్భుతం చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. దీంతో భారత్ ఎ జట్టు ముందు 250 పరుగుల లక్ష్యం నిలిచింది.
లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొదట 16 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్న వైభవ్.. ఆ తరువాత 12 బంతుల్లోనే మరో 50 బాదేసి.. శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటివరకు లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ పేరిట ఉండేది. 2023లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇప్పుడు వైభవ్ 28 బంతుల్లోనే సెంచరీ చేయడంతో ఆ రికార్డు కనుమరుగైంది. గతంలోనూ యూఏఈపైనే రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో 32 బంతుల్లో సెంచరీ చేసి 42 బంతుల్లో 144 పరుగులు సాధించాడు. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ తన సత్తా చాటుతూ మరో చారిత్రక ఘనతను అందుకున్నాడు.
ఫాస్టెస్ట్ సెంచరీల జాబితా..
- 28 బంతులు: వైభవ్ సూర్యవంశీ – ఇండియా ఎ vs యూఏఈ, 2026
- 29 బంతులు: జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ – సౌత్ ఆస్ట్రేలియా vs టాస్మానియా, అడిలైడ్, 2023
- 31 బంతులు: ఏబీ డివిలియర్స్ – సౌతాఫ్రికా vs వెస్టిండీస్, జోహన్నెస్‌బర్గ్, 2015
- 32 బంతులు: సకిబుల్ గని – బీహార్ vs అరుణాచల్ ప్రదేశ్, రాంచీ, 2025
- 33 బంతులు: ఇషాన్ కిషన్ – జార్ఖండ్ vs కర్ణాటక, అహ్మదాబాద్, 2025