SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దొరల గుండెల్లో నిద్రపోయిన తెలంగాణ వీరనారి..నైజాం నిరంకుశత్వాన్ని సవాల్ చేసిన ధీరవనిత.. చాకలి ఐలమ్మ జయంతి ప్రత్యేక కథనం!

Chakali Ailamma Biography: భూమికోసం..భుక్తికోసం.. పేదల విముక్తి కోసం అంటూ కమ్యూనిస్టులు చెప్పే సిద్ధాంతం ఒక కులవ్రుత్తి చేసుకునే మహిళ నుంచి ఉద్భవించిందంటే మీరు నమ్మగలరా? స్త్రీలంటే చిన్నచూపు చూసేవారికి చాకలి ఐలమ్మ పోరాటం కనువిప్పు కలిగించిందని చెప్పాలి. పోలీసులను, దేశ్ ముఖ్ లను ఎదురించి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తన పేరును లిఖించుకున్న వీరవనిత చాకలి ఐలమ్మ. ఈ పోరాటం తర్వాతే నిజాంకు, దేశ్ ముఖ్ ల ఆగడాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం షురూ అయ్యింది. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈ కథనం ద్వారా ఆ వీరమాతను స్మరించుకుంటూ నాటి పరిస్థితులను తెలుసుకుందాం.

Written By Bhoomi
Published: Sep 26, 2026, 08:31 AM IST | Updated: Sep 26, 2026, 08:32 AM IST
Image Credit: Chakali Ailamma Biography
Join

Chakali Ailamma Biography: తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ నైజాం నిరంకుశ పాలన, భూస్వాముల దౌర్జన్యాలు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన మహిళా వీరనారి. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, భూమి, పంట, హక్కుల కోసం పోరాడారు.

చాకలి ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26న అప్పటి వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా పరిధిలోని రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో జన్మించారు. ఐలమ్మ తల్లి ఒరుగంటి మల్లమ్మ, తండ్రి సాయిలు. ఐలమ్మకు చిన్నతనంలోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో బాల్య వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరి కులవ్రుత్తి అయిన బట్టలు ఉతకడం ద్వారానే జీవనం సాగించేవారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల వ్యవసాయం చేయాలని ఈ కుటుంబం నిర్ణయించుకుంది.  

కులవృత్తితో పాటు వ్యవసాయం చేస్తూ జీవించిన ఐలమ్మ, పాలకుర్తిలో భూస్వామి మల్లంపల్లి కొండలరావు వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేశారు. పంట బాగా పండడంతో ఆమె కుటుంబం దొరల ఆగ్రహానికి గురైంది. భూమిని, పంటను వదులుకోవాలని ఒత్తిడి చేసినా ఐలమ్మ వెనక్కి తగ్గలేదు.

విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి బెదిరింపులకు లొంగకుండా ఐలమ్మ న్యాయపోరాటం చేశారు. ఆంధ్ర మహాసభ, సంఘం నాయకుల ప్రోత్సాహంతో కోర్టును ఆశ్రయించి, తనపై పెట్టిన కేసులను ఎదుర్కొని విజయం సాధించారు. సాధారణ మహిళగా ఉన్న ఐలమ్మ భూస్వామికి వ్యతిరేకంగా కోర్టులో పోరాడి విజయం సాధించడం అప్పటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచింది.

కోర్టు పోరాటం అనంతరం దొరలు, రజాకార్లు ఐలమ్మ పంటను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, ఆమె సంఘం కార్యకర్తలు, గ్రామ ప్రజలతో కలిసి ధైర్యంగా ప్రతిఘటించారు. తన పంటను కాపాడుకోవడమే కాకుండా ప్రజలకు ధాన్యాన్ని పంచి పోరాట స్ఫూర్తిని నింపారు. ఆమె పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. వెట్టిచాకిరీ రద్దు, భూమి హక్కుల సాధనలో ఐలమ్మ ఒక ప్రతీకగా నిలిచారు.

ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన చాకలి ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న 89వ ఏట కన్నుమూశారు. తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆమె త్యాగాలను స్మరించుకుంటోంది. తెలంగాణ మహిళా శక్తికి, హక్కుల పోరాటానికి చాకలి ఐలమ్మ నేటికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES