Telangana Cabinet Meeting Decisions: తెలంగాణలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లు, భూ కేటాయింపులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన కరువు భత్యం (డీఏ)తోపాటు డీఆర్ ప్రకటించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలని మంత్రివర్గంలో చర్చ జరిగింది. తెలంగాణ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 నుంచి బకాయి ఉన్న డీఏలలో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయం మంత్రివర్గం తీసుకుంది. అప్పటినుంచి బకాయి పడ్డ ఏరియర్స్‌ను వాయిదాల్లో చెల్లించాలని తీర్మానించింది. ఆర్థికంగా భారమైనప్పటికీ ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించగా.. డీఏ, డీఏలతో ప్రతి ఏడాది ప్రభుత్వంపై రూ.2,500 కోట్ల భారం పడనుంది.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా దీనిపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. దాదాపు 17 శాతం వర్షపాతం లోటు ఉండగా.. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయనున్నారు. రైతు సంఘాలతో పాటు వివిధ రంగాల నిపుణులతో భేటీలు ఏర్పాటు చేస్తారు. ఈ భేటీల్లో రాష్ట్రంలో ఉన్న ఎల్‌నినో పరిస్థితులు చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కరువు మండలాల ప్రకటనతోపాటు రాష్ట్రానికి తగిన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని నివేదిస్తాం.
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం విక్రయాలు త్వరలో ప్రారంభం కానుండడంతో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. ఈ సీజన్‌లో దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల విభాగం అంచనా వేసింది. కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రివర్గం అధికారులకు సూచించింది.
== > విద్యుత్ అంశంపై మంత్రివర్గంలో కీలక చర్చ జరిగింది. ఎల్‌నినో పరిస్థితులతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సాధారణంగా ఒక్క రోజుకు 15,000 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉండగా.. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్ల పీక్ డిమాండ్‌కు చేరింది. అంటే దాదాపు 20 వేల మెగావాట్లకు చేరింది. గతేడాది మొత్తంలో 16,613 మెగావాట్ల గరిష్ట వినియోగం నమోదైంది. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తి, తగినంత విద్యుత్తు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్తు కోత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైనంత విద్యుత్తును సమకూర్చుకోవాలని, డిమాండ్ మేరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
== > భవిష్యత్ డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి, విద్యుత్ సమీకరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. దాదాపు 7,800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 4000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల పవన విద్యుత్తు యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది.
== >రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించింది.
== > దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పున:సమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
== > తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ అమలుచేసే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ఈ పాలసీకి ఆమోదం తెలిపింది.
== > న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మరో నలుగురు గ్రూప్ 1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పని చేసేందుకు నియమించాలని నిర్ణయం తీసుకుంది.