Big Debate With Bharath: తెలుగు న్యూస్ ఛానల్స్‌లో ఆసక్తికర వార్తలు.. సంచలన విషయాలకు వేదికగా నిలుస్తున్న బిగ్ డిబేట్ విత్ భరత్ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక అంశాలపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కవిత.. ఈ సందర్భంగా కీలక అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టిస్తున్న హైడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా రద్దు చేయాలి
హైదరాబాద్‌లో హైడ్రా చేస్తున్న విధ్వంసంపై కవిత తీవ్రంగా స్పందించారు. చెరువుల పరిరక్షణ, నాలాల నిర్వహణ, వరదల నివారణ వంటి ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టకుండా ఇతర అంశాల్లో జోక్యం చేసుకుంటోంది. నాలాల్లో పూడికతీత, వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించడం, మాన్‌హోల్స్ ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై హైడ్రా మరింత దృష్టి పెట్టాలి. చెరువుల పరిరక్షణ పేరుతో చర్యలు తీసుకుంటున్నప్పుడు పేదలు, పెద్ద నిర్మాణాల విషయంలో ఒకే విధమైన ప్రమాణాలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం హైడ్రా విధానం సరిగా లేదని.. హైడ్రాను రద్దు చేయాలి.
ఫ్యూచర్ సిటీ అనవసరం
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, భూసేకరణ, రైతులకు పరిహారం వంటి అంశాలపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. 'భూములు కోల్పోయే రైతులకు తగిన పరిహారం అందించకుండా పనులు చేపడుతున్నారనే ఆరోపణలు నా దృష్టికి వస్తున్నాయి. భూముల సేకరణకు సంబంధించి రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. భూమిని ఒక నిర్దిష్ట అవసరం కోసం సేకరించినప్పుడు ఆ ప్రయోజనం మారితే ప్రభావిత రైతుల హక్కులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో ఇప్పటికే నివాస ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు, నగర విస్తరణకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించకుండా కొత్త ప్రాజెక్టులపై భారీగా దృష్టి పెట్టడం సరైన ప్రాధాన్యం కాదు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో ఎవరికి ప్రయోజనం కలుగుతుంది.
ఉద్యోగులు, విద్యార్థుల అంశంపై..
ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై స్పందించిన కవిత ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలి. పెన్షన్లు, డీఏ, పీఆర్సీ, ఉద్యోగుల బదిలీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ నియామకాల వంటి అంశాలు ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండకూడదు. విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై స్పష్టత ఇవ్వాలి' అని కవిత కోరారు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ ప్రకటనలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాల్లో స్పష్టత అవసరమని చెప్పారు. ఒకేరోజు పరీక్షల నిర్వహణ వంటి నిర్ణయాలు అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించవచ్చని అభిప్రాయపడ్డారు.
పేపర్ బ్యాలెట్‌కు 'జై' కొట్టిన కవిత
ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో పేరు, ఇంటిపేరు, విద్యా సర్టిఫికెట్లలోని వివరాల మధ్య తేడాల కారణంగా కొందరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కవిత తెలిపారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు సామాజిక తనిఖీ తరహా పరిశీలన అవసరమని సూచించారు. ఓటు హక్కుకు సంబంధించిన ప్రక్రియలో అర్హులైన పౌరులు అనవసర ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో సందేహాస్పద వివరాలను పరిశీలించేందుకు పారదర్శకమైన విధానం అవసరమని పేర్కొన్నారు. ఈవీఎంలపై ప్రజల్లో సందేహాలు ఉండడంతో పేపర్ బ్యాలెట్ విధానాన్ని కూడా పరిశీలించాలని కవిత చెప్పారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలపై నమ్మకం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రాంతీయ పార్టీలు బలపడాలి
తెలంగాణ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రాల సమస్యలకు ప్రాంతీయ పార్టీలు ప్రాధాన్యమివ్వాలని కోరారు. తెలంగాణ సంస్కృతి, సామాజిక వైవిధ్యానికి తగిన రాజకీయ విధానం అవసరమని పేర్కొన్నారు. మతం ఆధారంగా ద్వేషాన్ని పెంచే రాజకీయ ధోరణులు తెలంగాణ సమాజానికి సరిపోవని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెట్టడం ముఖ్యమని కవిత తెలిపారు. జాతీయ రాజకీయాల్లో కాకుండా తాను తెలంగాణ అభివృద్ధిపైనే దృష్టి సారించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రాంతీయ పార్టీలు బలపడితే రాష్ట్రాల అవసరాలు, ప్రజల ఆకాంక్షలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత లభిస్తుందని కవిత అభిప్రాయపడ్డారు.
మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన
మహిళల భద్రతతో పాటు ఆర్థిక స్వావలంబనపై స్పందించిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతతో పాటు ఆర్థిక స్వావలంబన ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళలు రాజకీయాలు, వ్యాపారాలు, కార్పొరేట్ రంగాల్లో ఎదగడానికి ప్రభుత్వాలు మరింత సహకారం అందించాలని అభిప్రాయపడ్డారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే స్వేచ్ఛగా జీవించే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వ్యాపారాలు ప్రారంభించే మహిళలకు ఆర్థిక సహాయం, అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని చెప్పారు. మహిళలు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఎదుగుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని.. వాటిని అధిగమించేందుకు స్పష్టమైన విధానాలు అవసరమని తెలిపారు. మహిళల సాధికారతను సంప్రదాయ రంగాలకు పరిమితం చేయకుండా ఐటీ, వ్యాపారం, ఇతర ఆధునిక రంగాల్లోనూ అవకాశాలు పెంచాలని ఆకాంక్షించారు. మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం వంటి అంశాలు రాజకీయ విధానాల్లో కీలకంగా ఉండాలని కవిత పేర్కొన్నారు.