Ganesh Shobhyatra 2026: వినాయక చవితి నుంచి 9 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు భక్తుల కోలాహలం మధ్య గంగమ్మ ఒడికి చేరిపోయాడు. 9వ రోజు సందర్భంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి నల్లగొండతోపాటు పలు జిల్లాల్లో వినాయక శోభయాత్ర వైభవంగా జరిగింది. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఏ జిల్లాల్లో ఎలా సాగిందో ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.
వరంగల్‌లో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గణేశ నిమజ్జనం నెమ్మదిగా కొనసాగుతోంది. ఒక వైపు వర్షం హోరు.. మరోవైపు నిమజ్జనల జోరు కొనసాగుతోంది. వరంగల్ నగరంలో 19 నిమజ్జనం కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8000 విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు. విశేష పూజలు నిర్వహించుకున్న గణేశ్ విగ్రహాలు వరంగల్‌లోని చిన్న వడ్డేపల్లి చెరువు వద్దకు చేరుకుంటున్నాయి. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇందూరులో..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, జుక్కల్ తదితర ప్రాంతాల్లో 9వ రోజున బుధవారం వినాయక నిమజ్జనం పెద్ద ఎత్తున సాగింది. మిగతా ప్రాంతాల్లో 11 వ రోజు గురువారం విగ్రహాలను కదిపి 12వ రోజు శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలు అన్ని చోట్లా భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేలం పాటలో పోటాపోటీగా లక్షలు పాడి లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూను ప్రసాదంగా భావించిన భక్తులు వేలం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య సోదరభావం, ఐక్యతను పెంపొందించేలా సాగాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సవాల్లో పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్నారు.ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు కొనసాగడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ట్రాక్టర్ నడిపిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను మాజీమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. శోభాయాత్రలో భక్తులు కోలాటాలు, కళాకారుల నృత్యాలు చేశారు. స్వయంగా గణపతి మహరాజ్ కొలువుతీరిన శోభాయాత్ర మొదటి గణపతి వాహనాన్ని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నడిపారు. శోభయాత్రలో దారి పొడవునా కొబ్బరికాయలు కొడుతూ మంగళహారతులతో స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. శోభాయాత్ర సందర్భంగా సూర్యాపేట పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలలో సుమారు పదివేల పైగా విగ్రహాలను నిమజ్జనం జరిగాయి. నల్గొండ జిల్లాలో భారీ విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కాలువ వద్ద ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట పట్టణంలో బతుకమ్మ చెరువు లో నిమజ్జనం చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బోనగిరి పట్టణంలోని పెద్ద చెరువులో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏర్పాట్లు చేయగా.. ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
రూ.కోటి లక్షకు గణేశుడి లడ్డూ వేలం
వినాయక నిమజ్జనాలు జరుగుతుండడంతో లడ్డూ వేలం పాటలు జోరుగా సాగుతుండగా.. హైదరాబాద్‌లో మరోసారి రికార్డు స్థాయిలో లడ్డూ వేలం జరిగింది. ఒక కోటి లక్ష రూపాయలకు లడ్డూ వేలం పాట జరిగింది. ఇది ఎక్కడో కాదు హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో ఉన్న కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటుచేసిన గణేశ్ వద్ద లడ్డూ వేలం పాట మంగళవారం రాత్రి 12 గంటల వరకు నిర్వహించగా.. శక్తిమాన్ టీమ్ కోటి లక్ష రూపాయలకు లడ్డూ ధరకు దక్కించుకుంది. అయితే పోయిన సంవత్సరం ఇక్కడి లడ్డూ ఏకంగా 2.31 కోట్ల ధర పలికింది. ఈసారి సగానికి ధర పడిపోయింది.
అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో ఉన్న అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బుధవారం నిమజ్జనం జరిగింది. మొదటగా గణేష్ లడ్డూ వేలం పాట నిర్వహించగా.. కళాశాలలోని ఏవీహెచ్, అస్రా గ్రూప్‌లు హోరాహోరీ పోటిపడ్డాయి. ఈ వేలం పాటలో ఏవీహెచ్ విద్యార్ధులు రూ.1.20 లక్షలకి లడ్డూను కైవసం చేసుకున్నారు. గణనాథుడి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురిసి సుభిక్షంగా ఉండాలని విద్యార్ధులకి మంచి భవిష్యత్ ఉండాలని కళాశాల చైర్మన్ నివాస్ ఆకాంక్షించార. అనంతరం గణేశ్ నిమజ్జనం ఆనందోత్సాహాల మధ్య వైభవంగా సాగింది.