Ganesh Shobha Yatra 2026: గణేష్ శోభాయాత్రను తిలకించడానికి హైదరాబాద్, తెలంగాణ, సహా దేశ విదేశాల నుంచి ఎంతో భక్తులు విచ్చేస్తున్నారు. ముఖ్యంగా వినాయక సాగర్ కు వచ్చే భక్తులు తెలుసుకోవాల్సిన విషయాలు.. ప్రభుత్వ సూచనలు పాటించాలి. నిర్దేశించిన సమయం పాటించండి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తే బెటర్. ముఖ్యంగా లిక్కర్ తాగి వాహనాలు నడపొద్దు. మీ వెంట ఉండే పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో అప్రమత్తతతో మెలగాలి.
వాహనాల పార్కింగ్..
నిమజ్జనానికి వచ్చే వాహనాలతో పాటు సాధారణ వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలతో పాటు వాహనాలను దారి మళ్లించనున్నారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పరిస్థితిని బట్టి ఈ సమయాన్ని పొడిగించే అవకాశం ఉందని పోలీసులు ప్రకటించారు. భక్తులు సొంత వాహనాల్లో వచ్చిన ఇబ్బంది పడకూడదు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంను వాడుకోవాలని చెబుతున్నారు.
సాధారణ వాహనాలకు అనుమతి లేదు..
ఊరేగింపు సాగే ప్రధాన మార్గాల్లో నిమజ్జన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతర వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. సాధారణ వాహనదారులు ఇన్నర్ రింగ రోడ్డుతో పాటు మసాబ్‌ట్యాంక్, -పంజాగుట్ట-, బేగంపేట, -సికింద్రాబాద్ రూట్, ఔటర్ రింగ్ రోడ్డును వినియోగించాలని సూచించారు.
సిటీ బస్సులను మాసాబ్ ట్యాంక్, వి.వి. విగ్రహం, సికింద్రాబాద్ గడియారపు స్థంభం, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్, ఆరాంఘర్ వరకే అనుమతిస్తారు. జిల్లాల నుంచి వచ్చి వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ చేరుకోవడానికి ఆల్టర్నేట్ రూట్లను కేటాయించారు. భారీ లారీలను సిటీలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ లారీలను శివార్లలోనే నిలిపివేసి ఓఆర్‌ఆర్ వైపు మళ్లించనున్నారు.
ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన వేడుకలకు వినాయక సాగర్ పరిసర ప్రాంతాలకు సొంత వాహనాల్లో వచ్చే భక్తుల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. కార్లు, బైకులపై ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చేవారు వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంగణంలో పార్క్ చేయాలి.
నెక్లెస్ రోడ్ రోటరీ క్లబ్, ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు నుంచి వచ్చేవారి కోసం ఐమ్యాక్స్ థియేటర్ పక్కనున్న హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ఐమ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటు ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆవరణను, రేస్ కోర్స్ రోడ్ , ఎన్టీఆర్ ఘాట్ పరిసరాలను కూడా పార్కింగ్‌కు కేటాయించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గం..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారు లేదా వచ్చేవారు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ రోడ్డును పూర్తిగా నివారించి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్డునే ఉపయోగించాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు బేగంపేట, ప్యారడైజ్ ఫ్లై ఓవర్, సంగీత్ చౌరస్తా రూట‌్‌ను ఎంచుకోవాలని కోరారు. నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులు తమ వాహనాలను ఎన్టీఆర్ గ్రౌండ్స్, కట్ట మైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్, ప్రభుత్వ ఉద్యానవనం, ఖైరతాబాద్ రైల్వే స్టేషన్, ఖిల్వత్ గ్రౌండ్స్ మొదలైన నిర్దేశిత స్థలాలలో నిలిపివేసి కాలినడకన రావలసి ఉంటుంది.
ఆటోలు, ఓలా, ఊబర్ వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. వీవీ స్టాచ్యూ, ఖైరతాబాద్ , నిరంకారి మధ్య మెయిన్ రోడ్డుపై ప్రయాణికులను ఎక్కించడం, దించడాన్ని పూర్తిగా నిషేధించారు. ఆటోలు, క్యాబ్‌లు ప్రయాణికులను దించడానికి ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని మాత్రమే ఉపయోగించాలి.
నిమజ్జనం సందర్భంగా మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించారు. చివరి మెట్రో రైలు శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు అన్ని టెర్మినల్ స్టేషన్ (మియాపూర్, ఎల్బీ నగర్, నాగోల్, రాయదుర్గ్, జేబీఎస్, ఫలక్‌నుమా) నుంచి నడుస్తాయి. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్ మీదుగా 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడుపుతోంది.
ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం..
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ట్యాంక్ బండ్ పరిసరాల్లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదు. వీవీ స్టాచ్యూ వైపు నుంచి ఫ్లై ఓవర్ మీదుగా ..రాజీవ్ గాంధీ విగ్రహం..మింట్ కాంపౌండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.పాత పీఎస్ సైఫాబాద్ నుంచి రాజ్‌దూత్ లేన్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేశ్వైపు వచ్చే వెహికల్స్‌ను ఇక్బాల్ మినార్ వైపు టర్న్ చేస్తారు.
ఇక ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ వైపు వెళ్లే వాహనాలను మింట్ కాంపౌండ్ లేన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు తరలిస్తారు. నిరంకారి నుంచి ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు పంపిస్తారు.
విగ్రహాల నిమజ్జనం చేసిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్, ఎగువ చెరువు కట్ట, పీవీఎన్‌ఆర్ మార్గాల్లో నిమజ్జనం పూర్తి చేసుకున్న ఖాళీ లారీలు, ట్రక్కులు ప్రత్యేకంగా కేటాయించిన మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి కాలినడకన వెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు నుంచి వచ్చేవారు ఐమ్యాక్స్ గ్రౌండ్స్, హెచ్ఎండీఏ లేక్ వ్యూ పార్కింగ్ , ఎన్టీఆర్ పార్క్ వెనుక ఉన్న ఈ- రేసింగ్ గ్రౌండ్ లో వాహనాలను నిలపవచ్చు.
నెక్లెస్ రోడ్ వైపు నుంచి వచ్చేవారు ప్రధాన పార్కింగ్ స్థలాలు నిండిపోతే, ప్రత్యామ్నాయంగా మక్తా పార్కింగ్ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. టెలిఫోన్ భవన్ పరిసరాల్లో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే పార్కింగ్ అందుబాటులో ఉంటుంది.