తెలంగాణలో రికార్డు స్థాయిలో సన్నవడ్ల సాగు.. గిట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో మోసపోతున్న రైతన్నలు..
Fine grain paddy in Telangana: చమటోడ్చిన రైతులకు కన్నీళ్లు ఆవిరవుతున్నాయి. కష్టపడి పండించిన పంట దిగుబడులకు ఆశాజనకంగా గిట్టుబాటు ధర లభించిందన్న ఆనందం రోజుల వ్యవధిలోనే కనుమరుగైపోయింది. ఇటీవల తెలంగాణలో సన్నవడ్ల మంచి డిమాండ్ ఉండటంతో రైతులు ఆనందపడ్డారు. పెరిగిన ధాన్యం ధరలతో దళారులు రాబంధుల్లా వాలిపోయారు. మిల్లర్లు, దళారులు సిండికేటుగా మారి రైతులకు పొట్టకొడుతున్నారు. దీంతో రైతులకు ఆదాయం అందుబాటులో లేని పరిస్థితి దాపురించింది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో.. కళ్లాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని తక్కువ ధరలకే అమ్మేసుకుంటున్నారు.
Government Encourage Paddy Cultivation: తెలంగాణలో రైతులు సన్నవడ్లను విస్తారంగా సాగుచేశారు. ప్రకృతి సహకరించడంతో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. సన్నవడ్లకు క్వింటాకు రూ.500ల బోనస్ తో ప్రభుత్వ ప్రోత్సాహకం ప్రకటంచింది. దిగుబడి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అమ్మేకంటే బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటే మరికొంత ఆదాయం వస్తుందని రైతులు సంతోషించారు. అయితే… ధాన్యంకు డిమాండు పెరగడంతో.. మార్కెట్లో బియ్యం ధరలు అమాంతంగా పెంచేశారు. కొద్ది రోజుల వ్యవధిలోనే పరిస్థితి తలకిందులైంది.
గణనీయంగా పడిపోయిన ధాన్యం ధరలు..
ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఈసారి వరి పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. సాగునీటి లభ్యతతో పంటలు బాగా పండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొరత ఏర్పడిందని, మార్కెట్‌లో సన్న రకాల ధాన్యానికి మంచి ధరలు లభిస్తున్నాయని ప్రచారం జరగడంతో తమ పంటకు కూడా అధిక ధర వస్తుందని ఆశించారు. జైశ్రీరామ్ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.5 వేలకుపైగా, బీపీటీ రకానికి సుమారు రూ.3,500 వరకు ధర పలుకుతోందన్న వార్తలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే స్థానికంగా కోతలు ప్రారంభమైన కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. మూడు రోజుల్లోనే సన్న రకాల ధాన్యం ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతుల ఆనందం ఆవిరైంది.
మిల్లర్లు, దళారులు కుమ్మక్కుతో రైతన్నకు కన్నీళ్లు..
తెలంగాణ జిల్లాలో మిల్లర్లు, దళారులు కుమ్మక్కై ధాన్యం ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మొదట బీపీటీ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.3,300 వరకు ధర చెల్లించిన వ్యాపారులు, మూడు రోజుల వ్యవధిలోనే సుమారు రూ.600 తగ్గించి రూ.2,700 వరకు మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. మహేంద్ర చింట్లు రకం ధాన్యానికి గతంలో రూ.4,500 వరకు ధర పలకగా, ప్రస్తుతం రూ.3,500కే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
గతంలో పంట కోతలకు ముందే రైతులకు అడ్వాన్స్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన వ్యాపారులు, ఇప్పుడు తక్కువ ధరకు అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల తగ్గింపునకు సిండికేట్ కారణమని వారు ఆరోపిస్తున్నప్పటికీ, దీనిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను తేల్చాల్సి ఉంది.
రైతన్నలను భయపెడుతున్న వర్షాలు..
ఒకవైపు ధాన్యం ధరలు తగ్గుతుండగా, మరోవైపు వాతావరణ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. తుఫాను ప్రభావంతో ఎప్పుడు వర్షాలు పడతాయోనన్న ఆందోళన నెలకొంది. వరి కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని ఆరబెట్టి, తేమ శాతం తగ్గిన తర్వాత విక్రయించాలంటే సమయం పడుతుంది. ఈలోగా వర్షాలు కురిస్తే పంట తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.
దీంతో కొందరు రైతులు పంటను పొలంలోనే పచ్చి ధాన్యంగా విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలను మరింత తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పంట చేతికొచ్చిన సమయంలోనే ధరలు పడిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని మదనపడుతున్నారు.
ఇతర ప్రాంతాల్లో ధాన్యానికి మంచి ధరలు..
ఇటీవల ఇతర ప్రాంతాల్లో ధాన్యానికి మంచి ధరలు వస్తున్నాయంటూ వార్తలు, సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం జరిగిందని రైతులు గుర్తుచేస్తున్నారు. అయితే ఇప్పుడు ధరలు పడిపోతున్నా, రైతులు నష్టపోతున్నా ఈ అంశంపై పెద్దగా చర్చ జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మూడు రోజుల్లోనే క్వింటాల్‌కు వందల రూపాయల ధర తగ్గినా ప్రశ్నించేవారు లేకపోవడం బాధాకరమని అంటున్నారు. ధాన్యం ధరలపై ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ధాన్యం ధరలు తగ్గుతున్నా.. బియ్యం ధరలు తగ్గడం లేదు..
మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా పెరిగాయని, కొన్ని సన్న రకాల బియ్యం క్వింటాల్‌కు రూ.10 వేల వరకు పలుకుతున్నాయని రైతులు, వినియోగదారులు పేర్కొంటున్నారు. గతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యంతో తయారైన బియ్యాన్ని ఇప్పుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం ధరలు తగ్గుతున్నప్పటికీ బియ్యం ధరలు ఎందుకు తగ్గడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే వివిధ రకాల బియ్యం ధరలు నాణ్యత, రకం, మార్కెట్‌ను బట్టి మారుతుంటాయి. ఈ నేపథ్యంలో రైతులకు చెల్లిస్తున్న ధరలు, బియ్యం విక్రయ ధరలపై సంబంధిత అధికారులు పరిశీలన జరపాలని కోరుతున్నారు.
కరువు పరిస్థితుల్లోనూ కష్టపడి పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ధరల తగ్గింపునకు గల కారణాలను పరిశీలించాలని కోరుతున్నారు. మిల్లర్లు, దళారులు సిండికేట్‌గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపి, అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ధాన్యం ధరలు మరింత పడిపోకముందే ప్రభుత్వం జోక్యం చేసుకుని భరోసా కల్పించాలని రైతులు కోరుతున్నారు.