SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ప్రైవేట్ బడుల్లో 25శాతం ఫ్రీ సీట్లు.. ఇకపై ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

RTE Act 2009 25 Percent Quota Private Schools: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవ్వనున్నాయా? భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉంటాయని చిత్రాలతో చూపే పరిస్థితి వస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Written By Bhoomi
Published: Oct 21, 2026, 11:51 AM IST | Updated: Oct 21, 2026, 11:52 AM IST
Image Credit: Government Schools Future:
Join

RTE Act 2009 25 Percent Quota Private Schools: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవ్వనున్నాయా?  భవిష్యత్తులో  ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉంటాయని  చిత్రాలతో చూపే పరిస్థితి వస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సందేహాలు మొదలయ్యాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫ్రీగా ప్రాథమిక విద్య కోసం 25శాతం సీట్లు కేటాయింపు అమల్లోకి వచ్చినట్లయితే.. ఇప్పటికే పలు సవాళ్లతో కొట్టుమిట్టాడుతున్న సర్కారు బడుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితైన ప్రైవేట్ విద్యాసంస్థలు.. ఇప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరించాయి. దీంతో ఉచిత విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ బడుల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 25శాతం కోటా కల్పించడం సామాజిక న్యాయానికి దోహదపడుతుందని.. పేద పిల్లలకు నాణ్యమైన చదువు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వపై ఉంది. అయినప్పటికీ ఈ నిర్ణయంతో ప్రభుత్వ విద్యావ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని విద్యార్థుల చేరికలు తగ్గే అవకాశాలను సర్కార్ పరిగణలోనికి తీసుకోక తప్పదు.

రాష్ట్రంలో జననాల రేటు క్రమంగా తగ్గుతున్నందున.. పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య సహజంగానే తగ్గుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల సంఖ్యను నిలబెట్టుకోవడానికి ఉపాధ్యాయులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన తరుణంలో, ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్ల కేటాయింపును అమలు చేయడం వల్ల విద్యార్థుల ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న కొంతమంది పేద విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరితే, వారు అక్కడే చదువు కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రూల్స్  ఇప్పటికే ప్రైవేట్ బడుల వైపు మొగ్గు చూపుతున్న కుటుంబాలకు మరింత ప్రోత్సాహకరంగా మారే అవకాశం ఉంటుంది. ఫలితంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి.. కొన్ని పాఠశాలల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు?
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో..  ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్ల రిజర్వేషన్‌ను అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడినట్లయితే.. దాన్ని ఆపడం అసాధ్యం. అయితే, చట్టాన్ని అమలు చేసేటప్పుడు ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలి.  ప్రభుత్వం ఈ రెండు బాధ్యతలను సమన్వయం చేసుకోవాలి. విద్యార్థుల నమోదును తగ్గించడానికి ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం ఒక్కటే పరిష్కారం కాదు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉండటం పేద కుటుంబాలకు అత్యంత కీలకం. పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అందించడం ఎంత ముఖ్యమో, పేదలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యం. ఒకవైపు ప్రైవేట్ విద్యను అందించి, మరోవైపు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరిస్తే.. అది ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా వాటిపై ఆధారపడిన పేద పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.


 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES