తెలంగాణను వణికిస్తున్న చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.
Telangana Cold Waves: తెలంగాణను చలిపులి వణికిస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. దీంతో ప్రజలు వెచ్చని ప్రదేశాలను ఆశ్రయిస్తున్నారు.
Weather Update: తెలంగాణలో ఒక్కపారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిన్న మొన్నటిదాకా ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు, ఇప్పుడు చలి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో 20 డిగ్రీలకు పైగా నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు, కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 15 డిగ్రీల దిగువకు చేరడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోనున్నాయి.
21 జిల్లాల్లో 14 డిగ్రీల దిగువకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు..
ముఖ్యంగా 21 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల కిందకు పడిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ ప్రాంతంలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత ..
సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ ప్రాంతంలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం క్రమంగా పెరుగుతోంది.
ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు..
రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ హోచ్చరిస్తోంది. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల రహదారులపై విజిబిలిటీ తగ్గే ప్రమాదం ఉందంటోంది. ఉదయం వేళల్లో పనులకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.