భాగ్యనగరంపై చలి పంజా.. రాత్రి 7 దాటితే బయటకు రావాలంటేనే వణుకు, ఏయే ప్రాంతాల్లో ఎంత ఉష్ణోగ్రత ఉందంటే?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నవంబర్ రెండవ వారం నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా నగరంలో రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు చలితో వణుకుతున్నారు. పగటిపూట 30 నుంచి 31 డిగ్రీలు, రాత్రి 12 నుంచి 14 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Hyderabad Weather Alert: గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాలు పడకపోగా, చలికాలాన్ని కూడా కొంత వెనక్కి జరిపింది. శీతాకాలం ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా చలి తీవ్రత బాగా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఈ చలి తీవ్రతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. గత వారం రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో, రాత్రి ఏడు గంటల తర్వాత నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు, పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు మెదక్, నల్లగొండ, కామారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 నుంచి 9 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతున్నాయి.
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..
సాధారణంగా ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాదని, కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా 11 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని, అయితే వాతావరణంలో వచ్చిన మార్పులు చలి తీవ్రతపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ ప్రాంతంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం కోహీర్ ప్రాంతంలో సాధారణంగా ఎనిమిది నుంచి తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత చలి ఎక్కువగా ఉన్న సమయంలోనే నమోదవుతుంది.
కోహీర్‌లో సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత..
కానీ ప్రస్తుతం అంతే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. ఇది కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం, కొండలు గుట్టలు ఎక్కువగా ఉండటంతో అక్కడ చలి తీవ్రత అధికంగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ, వాతావరణ పరిస్థితులు కూడా ఒక కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఉష్ణోగ్రత పరిస్థితే సంగారెడ్డిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోనూ నమోదవుతోంది, అంటే 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య 7 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కోహీర్లో ఈ సీజన్‌లో అత్యల్పంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు నిపుణులు చెబుతున్నారు. జహీరాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో కూడా ప్రతి సంవత్సరం కనిష్ట ఉష్ణోగ్రతలు కొంత ఎక్కువగా నమోదవుతుంటాయి.
ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ..
ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 10 నుంచి 11 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ ఇదే స్థాయి ఉష్ణోగ్రత నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉదయం పనులకు వెళ్లేవారికి, పారిశుధ్య కార్మికులు, రోడ్లు ఊడ్చేవారికి ఇది మరింత ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు శుభ్రం చేసే సమయంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం విధులకు వెళ్లేవారు మాస్కులు, మఫ్లర్లు ధరించి వెళ్తున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో..
మరోవైపు పొగమంచు కూడా ఇబ్బందిని కలిగిస్తోంది. పొగమంచు కారణంగా ఉదయం వేళల్లో వాహనదారులు కొంతసేపు వాహనాలను పక్కన ఆపి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, ట్రక్ డ్రైవర్లు, పర్యాటకులు ఉదయం ఒక గంట నుంచి రెండు గంటల పాటు ప్రయాణాన్ని వాయిదా వేసి, హోటళ్లు లేదా దాబాల వద్ద ఆగి విశ్రాంతి తీసుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు, వెనుక నుంచి వచ్చే వాహనాలు ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం ఉంటుంది. గత సంవత్సరం ఇలాంటి పరిస్థితుల్లో అనేక ప్రమాదాలు జరిగి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు, వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రత తక్కువగా ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు.
పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు..
ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత వృద్ధులు బయటకు వెళ్లకపోవడమే మంచిది. చిన్నపిల్లలకు మఫ్లర్లు, స్వెటర్లు వేసి చలి నుంచి కాపాడుకోవాలి. చలికాలాన్ని ఈసారి కొంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే శీతాకాలం ఆలస్యంగా రావడం కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన రాజేంద్రనగర్, పటాన్‌చెరు, మౌలాలి, తుర్కయాంజల్, బేగంపేట, హయత్‌నగర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. అక్కడ 11 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. సాధారణంగా ఈ ప్రాంతాల్లో 13 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.
వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తం..
ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు ఇప్పుడు కొంత తగ్గాయి. వాతావరణ ప్రభావంతో పాటు శీతాకాలం ఆలస్యంగా రావడం కూడా దీనికి ఒక కారణమని చెబుతున్నారు. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలు, వాటి పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.
రైతులు ఉదయం 7 గంటల తర్వాతే..
రైతులు ఉదయం ఏడు గంటల వరకు పొలాలకు వెళ్లకుండా, ఆ తర్వాత వెళ్తే చలి నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అత్యవసర సేవల్లో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలి నుంచి సురక్షితంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరగడం ప్రస్తుత పరిస్థితిలో ఒక ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఎందుకంటే ఉదయం పూట ఈ చలి కారణంగా ఒకవైపు ఆరోగ్య సమస్యలు వస్తాయి, మరోవైపు ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ రెండింటి నుంచి కాపాడుకోవాలంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర సేవల్లో ఉండేవారు తమ తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.