Hyderabad Ganesh Shobh Yatra: విఘ్నాలు తొలగించే వినాయకుడు 11 రోజుల పాటు పూజలందుకుని శుక్రవారం గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా గణేశ్ మహా శోభయాత్ర కొనసాగుతోంది. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తవగా.. మిగిలిన విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. శోభయాత్రగా విగ్రహాలు తరలివస్తుండగా.. నిమజ్జనంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన చేశారు. నిమజ్జనం ఎలా జరుగుతుందో కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
హైరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవం తుది ఘట్టానికి చేరుకున్న వేళ, శోభాయాత్ర మార్గాలు, భద్రతా ఏర్పాట్లను బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించారు. కేంద్రంలోని 5వ అంతస్తులో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్న తీరును, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులను సీసీటీవీ దృశ్యాల ద్వారా పర్యవేక్షించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గణేశ్ శోభాయాత్ర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలిస్తున్నామని.. అత్యంత ప్రశాంతంగా నిమజ్జనం కొనసాగుతోందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ప్రకటించారు. శనివారం తెల్లవారేసరికి నిమజ్జన ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 14వ తేదీన గణేశ్ ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి టీజీఐసీసీసీ బృందం పూర్తి అప్రమత్తతతో విధులను నిర్వర్తిస్తోందని వివరించారు. విద్యుత్, జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఆర్టీసీ, వైద్యారోగ్య, ఆర్‌అండ్‌బీ తదితర కీలక శాఖల సీనియర్ అధికారులంతా ఒకే వేదికపై సమన్వయంతో పనిచేస్తుండటంతో క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.
'హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన దాదాపు 10,000 సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, కెమెరాలు అమర్చిన ప్రత్యేక నిఘా వాహనాల నుంచి వస్తున్న లైవ్ ఫీడ్స్ ద్వారా క్షణక్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఖైరతాబాద్, బాలాపూర్ మహాగణపతుల శోభాయాత్రలతో పాటు పాతబస్తీ, రాజేంద్రనగర్, గోల్కొండ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాల తరలింపు ఎక్కడా ఆటంకాలు లేకుండా సాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరుగుతున్నాయి' అని కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
జియో ట్యాగింగ్ యాప్ ద్వారా నగరంలో నమోదైన 14,850 విగ్రహాల్లో ఇప్పటికే దాదాపు 10,300 విగ్రహాల నిమజ్జనం విజయవంతంగా పూర్తయిందని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. మిగిలిన 4,500 విగ్రహాల నిమజ్జనాన్ని శుక్రవారం తెల్లవారేసరికి పూర్తి చేయాలనే లక్ష్యంతో యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని వెల్లడించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 30కి పైగా భారీ క్రేన్లతో పాటు అదనపు క్రేన్లు, బేబీ పాండ్స్‌ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో ఐజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ట్రాఫిక్ మళ్లింపులను పక్కాగా అమలు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమైన పోలీస్ సిబ్బందితోపాటు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు విశేష సేవలందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజీ ఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, ఎస్పీ పూజ, ఎస్పీ వెంకట్ రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.