Karimnagar Govt Diet College Students Car: విద్యాబుద్ధులు నేర్పి.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా తీర్చిదిద్దిన గురువు రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు చూపిన ప్రేమాభిమానాలు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థ DIET - డైట్ కాలేజీలో గురువారం చోటుచేసుకున్న ఈ అపూర్వ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరీంనగర్ ప్రభుత్వ డైట్ కాలేజీలో సుదీర్ఘకాలంగా ఇంగ్లీష్ లెక్చరర్‌గా సేవలు అందించిన గుర్రం మహేశ్వర్ రెడ్డి గురువారం రోజున పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కాలేజీలో ఆయనకు వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఆయన వద్ద విద్యనభ్యసించిన వివిధ బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థులంతా ఒక చోటకు చేరి తమ ప్రియతమ గురువుకు వినూత్నంగా గురుదక్షిణ చెల్లించాలని నిర్ణయించుకున్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ప్రభుత్వ డైట్ కాలేజీ ఉంది. అక్కడ చదివిన విద్యార్థులు తమ గురుభక్తిని చాటుకున్నారు. డైట్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకులు గుర్రం మహేశ్వర్ రెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహేశ్వర్ రెడ్డికి 2014-24 మధ్య ఆ కళాశాలలో చదువుకున్న విద్యార్థులంతా కలిసి టాటా టియాగో ఈవీని బహుమతిగా అందించారు. మహేశ్వర్ రెడ్డిని విద్యార్థులు తమ చేతుల్లో ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి..తమ గురువుగారికి ఇది చాలా చిన్న కానుక అంటూ మురిసిపోయారు. తమకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ పూర్వ విద్యార్థుల్లో యూట్యూబర్ అనిల్ ఉన్నారు. పూర్వ విద్యార్థులు చూపిన అభిమానానికి మహేశ్వర్ రెడ్డి సార్ ఎమోషనల్ అయ్యారు. ఈ వేడుక కోసం చాలా మంది తమ వంతు సాయం అందించారని చెప్పారు. ఈ అద్భుతమైన సన్నివేశం చూసి ఈ కార్యక్రమానికి హాజరైనవారు ఎంతో ఆనందించారు. మొత్తమ్మీద గురువుకు శిష్యులందరూ కలిసి జీవితంలో మర్చిపోలేని విధంగా ఒక మంచి జ్నాపకాన్ని అందించారు.
మహేశ్వర్ రెడ్డి తన సర్వీసులో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేశ్.. ఆయన వేలాది మంది శిష్యుల్ని సంపాదించుకున్న గొప్ప గురువు అంటూ ప్రశంసించారు. ఉపాధ్యాయ వ్రుత్తిని పవిత్రమైందని.. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ఎవరైనా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే గురువు ఉండాల్సిందే అన్నారు. ఉపాధ్యాయుడే తరగతి గది సైనికుడని.. నిరంతరం విద్యార్థుల గురించి ఆలోచిస్తూ.. గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ డైట్ కళాశాల తెలంగాణలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. మహేశ్వర్ రెడ్డి రిటైర్మెంట్ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.