Snake In Police Station: పోలీస్ స్టేషన్‌కు అనుకోని అతిథి.. హడలెత్తిన పోలీసులు
King Cobra Surprise Visit To Police Station: పోలీస్ స్టేషన్‌కు అనుకోని అతిథి వచ్చేసింది. ఆ అతిథి రాకతో పోలీసులు హడలెత్తిపోయారు. వచ్చింది ఏ పెద్ద రౌడినో.. గూండానో కాదు వచ్చింది నాగుపాము. పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి దర్జాగా ఓ మూలన కూర్చుంది. ఆ తర్వాత స్టేషన్‌లో ఏం జరిగిందో తెలుసుకోండి.
King Cobra Surprise Visit To Police Station: పోలీస్ స్టేషన్ అంటే నేరస్తులు వస్తుంటారు.. ఫిర్యాదుదారులు వస్తుంటారు. కానీ ఒక నాగుపాము పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. పాము రావడంతో పోలీసులు హడలెత్తిపోయారు. ఓ మూలకు చేరిన పామును చూసి బెంబేలెత్తిపోయారు. పోలీసులు భయంతో వెంటనే స్నేక్ క్యాచర్‌ను పిలిపించి ఆ పామును బయటకు పంపించారు. తెలంగాణలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ పాము చలికాలం కదా అని వెచ్చగా ఉంటుందని వచ్చిందో.. తన బాధలు పోలీసులకు చెప్పుకుందామని వచ్చిందో తెలియదు కానీ మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాము ప్రత్యక్షమై పోలీసులకు చుక్కలు చూపించింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ నాగుపాము అందరినీ హడలెత్తించింది. మెల్లగా స్టేషన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగుపాము ఆ తర్వాత ఒక మూలకు కూర్చుండిపోయింది. విధుల్లో నిమగ్నమైన పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. ఇంతసేపు పాము ఉన్నా కూడా తాము విధులు నిర్వహించిన విషయాన్ని గుర్తుంచుకుని పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పాములు పట్టేవ్యక్తిని పిలిచారు.
పామును చూసిన పోలీసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ అయిన రాజాపూర్ సర్పంచ్ రామకృష్ణకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రామకృష్ణ వెంటనే స్టేషన్‌కు చేరుకుని పాము వద్దకు వెళ్లాడు. మూలన నక్కి ఉన్న నాగుపామును చాకచక్యంగా పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. బయట కొంత అటవీ ప్రాంతం ఉండడంతో అక్కడ వదిలేశారు. పామును బయటకు పంపించడంతో పోలీసులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
పాము పోలీస్ స్టేషన్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ వార్త వైరలయ్యింది. అయితే చలికాలం కావడంతో చలికి తట్టుకోలేక అటవీ ప్రాంతం నుంచి పాము పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. స్టేషన్ చుట్టూ చెట్లు, పొదలు ఉండడంతో పాములు తరచూ అక్కడకు వస్తున్నాయని పోలీస్ సిబ్బంది చెబుతున్నారు. కొంత అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడంతో పాముల బెడద ఎక్కువగా ఉంది.