Diwali Tips: మంచిర్యాలలో ప్రకృతి మిత్ర ర్యాలీ.. 'టపాసులు వద్దు.. మట్టి దీపాలే ముద్దు'
Prakruthi Mithra Called Pollution Free Diwali: హిందూవుల అతి పెద్ద పండుగ దీపావళి రావడంతో కాలుష్య రహితంగా ఈ పండుగను చేసుకుందామని మహిళలు పిలుపునిచ్చారు. మంచిర్యాలలో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరగ్గా.. దీపావళిని కాలుష్య రహితంగా చేసుకుందామని నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.
Prakruthi Mithra Awareness Rally: దీపావళిని కాలుష్య రహితంగా జరుపుకోవాలని.. టపాసులు వద్దు మట్టి దీపాలే ముద్దు అని మంచిర్యాల పట్టణ మహిళలు నినదించారు. కాలుష్య రహిత దీపావళి పండుగను చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు ప్రతిజ్ఞ చేసి మట్టి నూనె దీపాలతో ప్రదర్శన చేపట్టారు. ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలోని కలెక్టరేట్ రోడ్డులో ఉన్న 'ప్రకృతి మిత్ర' రాష్ట్ర కార్యాలయ ఆవరణలో కాలుష్య రహిత దీపావళి నిర్వహణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మట్టి ప్రమిదలతో చేసిన దీపాలను, ప్లే కార్డ్స్ ప్రదర్శించి, కాలుష్య నివారణ, ప్రకృతి హితమైన దీపావళి పై నినాదాలు చేశారు. కాలుష్యం వద్దు అంటూ దీపావళి ప్రతిజ్ఞ చేశారు. ప్రకృతి మిత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, 'వాల్టా' అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ.. దీపావళి అంటే నూనె దీపాల వరుస అని.. ఇది కాలుష్యాన్ని కలిగించే బాంబుల వరుస కాదని తెలిపారు. ప్రజలందరూ ప్రకృతికి, మూగజీవాలకు హాని కలిగించని మట్టి దీపాలు వెలిగించి ఆనందంగా దీపావళి పండుగ చేసుకోవాలని సూచించారు.
దీపావళిని బాంబులు, టపాసులతో చేసుకుంటే దానివలన వెలువడే కాలుష్యంతో గర్భిణీలు, వృద్ధులు, పిల్లలతోపాటు మూగజీవాలు జీవ వైద్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ప్రకృతి మిత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి కాలుష్యంతో గుండె, నరాలు, ఎన్నికల లోపం, కంటి, చర్మ సంబంధిత వ్యాధుల పడే ప్రమాదం ఉందని వివరించారు. రాజ్యాంగాన్ని , పలు పర్యావరణ చట్టాలను గౌరవిస్తూ కాలుష్యం కలిగించే టపాసులు స్వచ్ఛందంగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కాలుష్య రహిత దీపావళి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అగ్నిమాపక, అటవీ శాఖ , అధికారులు సత్యనారాయణ, రమేశ్ బాబు, సంతోశ్ కుమార్ మాట్లాడుతూ.. గాలి, శబ్ద, నీటి కాలుష్యాన్ని అత్యధిక మోతాదులో కలిగించే బాణసంచాను కాల్చవద్దని విజ్ఞప్తి చేశారు. పండుగ సంప్రదాయంలో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రీన్ టపాసులు మాత్రమే పరిమితంగా కాల్చాలని సూచించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే 101 నెంబర్ కి ఫోన్ చేసి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. దీపావళిని కాలుష్యం లేకుండా సంప్రదాయ రీతిలో చేసుకోవాలని.. టపాసులు, బాంబులు, చిచ్చుబుడ్డీలు కాకుండా దీపాలతో కేదారేశ్వరి అమ్మవారిని పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతిమిత్ర ప్రతినిధులు రాచకొండ చందన చిప్ప జ్యోతి, స్వర్ణలత, హేమ ఉన్నారు.